ఆటో అన్నలకు రాహుల్ చెప్పిన మాట.. జూబ్లీహిల్స్ వద్ద సెల్ఫీలు..

కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు

  • Publish Date - November 28, 2023 / 07:10 AM IST

  • జూబ్లీహిల్‌లో ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు, పారిశుద్ధ్య‌,
  • గిగ్ కార్మికులు, డెలివ‌రీ బాయ్స్‌తో ముఖాముఖీ
  • వారి స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్న కాంగ్రెస్ నేత‌
  • తామ అధికారంలోకి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తామ‌ని భ‌రోసా
  • ఆటో కార్మికుల‌కు రూ.12 వేలు అందిస్తాం
  • ఆటోల‌కు సింగిల్ ప‌ర్మిట్ పాల‌సీని తీసుకొస్తాం
  • పెండింగ్ చలాన్ల‌పై 50 శాతం రాయితీ క‌ల్పిస్తాం
  • పారిశుద్ధ్య కార్మికుల వేత‌నాలు పెంచుతాం
  • వారి ఉద్యోగాలు ప‌ర్మినెంట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాం: రాహుల్‌
  • కార్మికుల డ్రెస్ ధ‌రించి వారితో గ్రూప్ ఫొటో దిగిన రాహుల్‌గాంధీ

విధాత‌: కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్‌గాంధీ మంగ‌ళ‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఎన్నిక‌ల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు, పారిశుద్ధ్య‌, గిగ్ కార్మికుల‌తోపాటు డెలివ‌రీ బాయ్స్‌తో ముఖాముఖీగా మాట్లాడారు. కార్మికుల స‌మ‌స్య‌ల‌ను సావ‌ధానంగా విన్నారు. త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే కార్మికుల స‌మ‌స్య‌ల‌ను అన్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని వారికి భ‌రోసా ఇచ్చారు.

స‌దుపాయాలు అడిగే ఉద్యోగం మానేయ‌మంటున్న‌రు: పారిశుద్ధ్య కార్మికులు 


ఈ సంద‌ర్భంగా కార్మికులు బీఆర్ఎస్ ప్ర‌భుత్వంపై భ‌గ్గుమ‌న్నారు. ప‌దేండ్లు కేసీఆర్ ప్ర‌భుత్వం త‌మ‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని రాహుల్ ఎదుట‌ ఆవేద వ్య‌క్తం చేశారు. కాంట్రాక్ట‌ర్లు త‌మ‌ను వేధిస్తున్నార‌ని, త‌మ‌తో 11 గంట‌లు ప‌నిచేయిస్తున్నార‌ని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. స‌దుపాయాలు అడిగే ఉద్యోగం మానేయండ‌ని బెదిరిస్తున్నార‌ని వాపోయారు. త‌ర‌చూ ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నాని పేర్కొన్నారు. త‌మ‌కు కేసీఆర్ ప్ర‌భుత్వం డ‌బుల్ బెడ్రూమ్ ఇండ్ల‌ను కూడా ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేశారు.

చలాన్ల పేరుతో పోలీసులు వేధిస్తున్న‌రు: ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు 


తెలంగాణ పోలీసులు త‌మ‌ను చలాన్ల పేరుతో వేధిస్తున్నార‌ని ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు రాహుల్‌గాంధీకి మొర‌పెట్టుకున్నారు. గ‌తంలో ఎల్‌పీజీ గ్యాస్ రూ.31 ఇప్పుడు అది రూ.70 వ‌ర‌కు పెరిగింద‌ని, గ‌తంతో ఆటో ధ‌ర రూ.2. ల‌క్ష‌లు ఉంటే ఇప్ప‌డు 5.5 ల‌క్ష‌లు అయింద‌ని పేర్కొన్నారు. ఫైనాన్స్‌లో తీసుకుంటే రూపాయిన్న‌ర వ‌డ్డీ ప‌డుతున్న‌ద‌ని చెప్పారు. కిరాయి ఆటోలు న‌డిపితే రోజు 500 ఇవ్వాల‌ని, రూ.800-1000 సంపాదించే త‌మ‌కు రూ.500 కిరాయి చెల్లించ‌డం క‌ష్ట‌మ‌వుతున్న‌ద‌ని తెలిపారు. గ‌తంలో ఇన్సురెన్స్ రూ.2-5 వేల వ‌ర‌కు ఉంటే ఇప్పుడు అది రూ.14 వేల‌కు పెరిగింద‌ని వాపోయారు.

ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నం: డెలివ‌రీ బ్యాయ్స్‌ 


ప్ర‌జ‌ల‌కు స‌రుకులు స‌కాలంలో చేర‌వేసే క్ర‌మంలో తాము ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నామ‌ని డెలివ‌రీ బ్యాయ్స్ వాపోయారు. త‌మ‌కూ బీమా సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరారు. త‌మ కోసం కాంగ్రెస్ ఒక‌ స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని వారు రాహుల్‌గాంధీని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌక‌ర్యం క‌ల్పించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

కార్మికుల అందరి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాం: రాహుల్‌


తెలంగాణ‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని రంగాల‌ కార్మికుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తుంద‌ని రాహుల్‌గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి, మంత్రివ‌ర్గం కార్మిక సంఘాల ప్ర‌తినిధులతో స‌మావేశం అవుతార‌ని భ‌రోసా ఇచ్చారు. కార్మికులు ఇప్పుడు ఎదుర్కొంటున్న అన్నీ స‌మ‌స్య‌ల‌ను తీర్చుతామ‌ని చెప్పారు. ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు పెండింగ్ చ‌లాన్ల‌తో ఇబ్బంది ప‌డ‌కుండా పెండింగ్ చలాన్ల చెల్లింపుల‌పై 50 శాతం రాయితీ క‌ల్పిస్తామ‌ని చెప్పారు. సింగిల్ ప‌ర్మిట్ విధానం తీసుకొస్తామ‌ని హామీ ఇచ్చారు. మ్యానిఫెస్టో ప్ర‌క‌టించిన‌ట్టుగా ఆటో డ్రైవ‌ర్ల‌కు రూ.12 వేలు అంద‌జేస్తామ‌ని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల‌కు అన్ని ర‌కాల స‌దుపాయాలు క‌ల్పించ‌డంతోపాటు వారి వేత‌నాలు పెంచి, ఉద్యోగాల‌ను ప‌ర్మినెంట్‌కు కృషిచేస్తామ‌ని రాహుల్ హామీ ఇచ్చారు.

ఆటో డ్రైవ‌ర్ల ఖాకీ డ్రెస్ వేసుకొన్న‌రాహుల్‌గాంధీ వారితో క‌లిసి గ్రూప్‌ఫొటో దిగారు. పారిశుద్ధ కార్మికులతో కూడా గ్రూప్ ఫొటో దిగారు. ఇన్నాళ్లు రాహుల్‌గాంధీని పోస్ల‌ర్ల‌లోనే చూశామ‌ని, ఇప్ప‌డు త‌మ‌తో ఇట్ల ఫొటో దిగ‌డం త‌మ‌కు ఎంతో ఆనందంగా ఉంద‌ని హ‌ర్షం వ్య‌క్తంచేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకే ఈ సారి తాము ఓటేస్తామ‌ని తెలిపారు.

Latest News