Rahul Gandhi | ఇంత పెద్ద శిక్ష ప‌డిన తొలి ఎంపీ బ‌హుశా.. నేనే: రాహుల్ గాంధీ

Rahul Gandhi అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌ని ఎప్పుడూ అనుకోలేదు పరువు న‌ష్టం కేసులో ఇంత పెద్ద శిక్ష ప‌డింది నాకేనేమో! స్టాన్‌ఫోర్డ్ విద్యార్థుల‌తో రాహుల్ గాంధీ విధాత: లోక్‌స‌భ నుంచి అన‌ర్హ‌త వేటుకు గురై బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌పుడు అనుకోలేద‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ అన్నారు. ప‌రువు న‌ష్టం కేసులో ఇంత పెద్ద శిక్ష ప‌డిన తొలి ఎంపీ బ‌హుశా తానే అన్నారు. అలా జ‌ర‌గ‌డం కూడా మంచిదేన‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి వ‌చ్చిన […]

  • Publish Date - June 1, 2023 / 08:02 AM IST

Rahul Gandhi

  • అన‌ర్హ‌త వేటు ప‌డుతుంద‌ని ఎప్పుడూ అనుకోలేదు
  • పరువు న‌ష్టం కేసులో ఇంత పెద్ద శిక్ష ప‌డింది నాకేనేమో!
  • స్టాన్‌ఫోర్డ్ విద్యార్థుల‌తో రాహుల్ గాంధీ

విధాత: లోక్‌స‌భ నుంచి అన‌ర్హ‌త వేటుకు గురై బ‌య‌ట‌కు వ‌స్తాన‌ని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌పుడు అనుకోలేద‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ అన్నారు. ప‌రువు న‌ష్టం కేసులో ఇంత పెద్ద శిక్ష ప‌డిన తొలి ఎంపీ బ‌హుశా తానే అన్నారు. అలా జ‌ర‌గ‌డం కూడా మంచిదేన‌ని.. ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి వ‌చ్చిన అతి భారీ అవ‌కాశంగా దీనిని చూస్తున్నాన‌ని వ్యాఖ్యానించారు.

అమెరికా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా స్టాన్‌ఫోర్డ్ యూనివ‌ర్సిటీలో బుధ‌వారం రాత్రి ప్ర‌సంగించిన ఆయ‌న.. ప‌లువురు విద్యార్థుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చారు. త‌నపై అన‌ర్హ‌త వేటు ఈ మ‌ధ్యే ప‌డిన‌ప్ప‌టికీ.. అస‌లు డ్రామా ఆరు నెల‌ల కింద‌టే మొద‌లైంద‌ని రాహుల్ అన్నారు.

‘ఆ స‌మ‌యంలో మేమే కాదు మొత్తం ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఇబ్బంది ప‌డుతున్నాయి. ఆర్థికంగా, వ్య‌వ‌స్థాప‌రంగా బ‌ల‌హీన స్థితిలో ప‌డిపోయాం. అందుకే భార‌త్ జోడో యాత్ర చేప‌ట్టాం. ఇప్ప‌టికీ ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తిలో పోరాటాలు చేయ‌డానికి సాధ్యం కావ‌డం లేదు’ అని పేర్కొన్నారు.

ఎవ‌రి సాయ‌మూ వ‌ద్దు

ఈ స‌మ‌స్య‌ల‌పై విదేశీ సాయం కోరుతున్నారా అని ఒక‌రు ప్ర‌శ్నించగా.. రాహుల్ గాంధీ దానిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఇది మా పోరాటమే.. మేమే పోరాడతాం. కానీ ఇక్క‌డ ఉన్న విద్యార్థుల‌తో మాట్లాడ‌టం నా హ‌క్కు. వారితో బంధాన్ని ఏర్ప‌ర‌చుకోవాల‌నుకుంటున్నా.. అని అక్క‌డి విద్యార్థుల‌ను ఉద్దేశించి రాహుల్ అన్నారు.

ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డానికి ప్ర‌ధాని మోదీ ఎందుకు ముందుకు రార‌ని ప్ర‌శ్నించారు. దీనికి స్పందన‌గా మోదీ ఇలాంటి కార్య‌క్ర‌మాల‌కు ఎప్పుడు వ‌చ్చినా ఆహ్వానిస్తామ‌ని అక్క‌డ ఉన్న విశ్వ‌విద్యాల‌య ప్ర‌తినిధి వ్యాఖ్యానించారు.

మ‌రోవైపు రాహుల్ గాంధీ పాల్గొన్న‌ ఈ కార్య‌క్ర‌మానికి భారీ స్పంద‌న ల‌భించింది. స‌భ ప్రారంభం కావ‌డానికి రెండు గంట‌ల ముందే విద్యార్థులు క్యూల్లో నిల‌బ‌డ్డారు. ప‌లువురికి చోటు లేక‌పోవ‌డంతో.. బ‌య‌ట‌కు పంపేయ‌డం క‌నిపించింది.