‘రంగమార్తాండ’ రివ్యూ: శభాష్ కృష్ణవంశీ.. మనసుల్ని కదిలించే సినిమా

మూవీ పేరు: ‘రంగమార్తాండ’ విడుదల తేదీ: 22 మార్చి, 2023 నటీనటులు: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసుయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా తదితరులు సంగీతం: మాస్ట్రో ఇళయరాజా మాటలు: ఆకెళ్ల శివప్రసాద్ కెమెరా: రాజ్ కె. నల్లి నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి దర్శకత్వం: కృష్ణవంశీ తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమాలకు, మాటలకు ఎలాగైతే ప్రత్యేక అభిమానులు ఉంటారో.. సేమ్ టు సేమ్ కృష్ణవంశీ సినిమాలకు […]

  • Publish Date - March 23, 2023 / 01:30 AM IST

మూవీ పేరు: ‘రంగమార్తాండ’
విడుదల తేదీ: 22 మార్చి, 2023
నటీనటులు: ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసుయ, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజా తదితరులు
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
మాటలు: ఆకెళ్ల శివప్రసాద్
కెమెరా: రాజ్ కె. నల్లి
నిర్మాతలు: కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
దర్శకత్వం: కృష్ణవంశీ

తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ సినిమాలకు, మాటలకు ఎలాగైతే ప్రత్యేక అభిమానులు ఉంటారో.. సేమ్ టు సేమ్ కృష్ణవంశీ సినిమాలకు కూడా అలాగే అభిమానులు ఉంటారు. కృష్ణవంశీ నుంచి సినిమా వస్తుందంటే.. అందులో సినిమా ఇండస్ట్రీలోని వారు నేర్చుకోవడానికి చాలా అంశాలు ఉంటాయి. ఆయన చిత్రీకరించే విధానం, రాబట్టే ఎమోషన్స్, హీరోయిన్లను చూపించే తీరు.. వేటికవే ప్రత్యేకత అన్నట్లుగా ఉంటాయి. అయితే కొన్నాళ్లుగా ఆయనకు సరైన హిట్ లేదు. దీంతో బాగా గ్యాప్ వచ్చేసింది.

అయినా కూడా కృష్ణవంశీ నుంచి సినిమా వస్తుందంటే.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కళ ఉంటుందో.. ఇప్పుడాయన చేసిన ‘రంగమార్తాండ’ విషయంలో కూడా అలాంటి కళే కనిపిస్తుంది. చాలా గ్యాప్ తర్వాత మరాఠీ చిత్రం ‘నటసామ్రాట్’ రీమేక్‌గా ‘రంగమార్తాండ’ని కృష్ణవంశీ తెరకెక్కించారు. దాదాపు ఒక నెల రోజులుగా ఈ సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

ఇండస్ట్రీలోని పలు శాఖల వారికి కృష్ణవంశీ ఈ చిత్రాన్ని ప్రత్యేక షోలు వేసి చూపించారు. వారి నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్‌తో సినిమా ప్రమోషన్స్‌ని నిర్వహిస్తూ వస్తున్నారు. సినిమా చూసిన వారంతా కంటతడి పెడుతూ.. ‘కృష్ణవంశీ ఈజ్ బ్యాక్’ అంటూ సినిమాపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.

జాతీయ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, శివగామి రమ్యకృష్ణ, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం.. అన్ని అడ్డంకులు దాటుకుని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఇండస్ట్రీ మొత్తం మెచ్చిన ఈ సినిమాపై ప్రేక్షకుల తీర్పు ఎలా ఉందో.. సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

వెండితెరకి ప్రధానమైన మూలం నాటక రంగం. ఒకప్పుడు నటీనటులందరూ నాటకరంగం నుండే వచ్చేవారు. నాటకాల్లో ఆరితేరిన వారిని దర్శకనిర్మాతలు పట్టుకొచ్చి మరీ సినిమాలలో పెట్టుకునే వారు. నేడు కూడా కొన్ని ఫిల్మ్ ఇన్సిస్టిట్యూట్స్‌లో నాటకాలు వేయిస్తున్నారంటే సినిమా రంగంపై నాటక ప్రభావం ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సరే రంగమార్తాండ కథలోకి వస్తే.. ‘నాటకరంగం’ నేపథ్యంలో అమ్మానాన్నలు, వారి పిల్లలపై సాగే కథ ఇది. నేడు పెద్ద వారిని, తల్లిదండ్రులను ఆశ్రమాలలో చేర్పించి.. చేతులు దులిపేసుకుంటున్న వారిని మేల్కొలిపే చిత్రమిది.

రంగస్థలంపై ‘రంగమార్తాండ’ అనేంతగా బిరుదును పొందిన రాఘవరావు కుటుంబ కథ ఇది. రాఘవరావు (ప్రకాశ్ రాజ్).. రంగస్థలంపై ఎన్నో పాత్రలకి జీవం పోసి.. నాటక రంగం వదిలి.. ఇక జీవిత పయనం సాగించాలనుకున్నప్పుడు ఆయనకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ‘రంగమార్తాండ’ బిరుదు అందుకున్న రోజే.. రాఘవరావు ఇక నాటకాలకు, నటనకు స్వస్తి చెప్పి.. తన ఫ్యామిలీకి మిగతా జీవితం కేటాయిస్తానని చెప్పడం అందరికీ షాకిస్తే.. అక్కడి నుంచి రాఘవరావు తన ఫ్యామిలీతో ఫేస్ చేసే ప్రతీది.. ప్రస్తుత సగటు మానవుడి జీవితానికి చాలా దగ్గరగా ఉండేలా చిత్రీకరించి.. కృష్ణవంశీ ప్రేక్షకులకు షాకిస్తాడు. అదెలాగో తెలియాలంటే మాత్రం భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా చూడాల్సిందే.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

నటీనటుల విషయానికి వస్తే.. ‘రంగమార్తాండ’గా ప్రకాశ్ రాజ్ నిజంగా తన నటనతో విజృంభించాడు. రంగస్థలంపై నటుడిగా, నిజ జీవితంలో సగటు మనిషి అనుభవించే సంఘర్షణలను పలికించడంలో ప్రకాశ్ రాజ్ ప్రాణం పెట్టేశాడు. ప్రతి సన్నివేశాన్ని తన అనుభవంతో రక్తికట్టించాడు. టైటిల్‌కి న్యాయం చేశాడు. ఆయనతో పాటు మరో రెండు పాత్రలు ఈ సినిమాకి ప్రధాన బలం.

అందులో రమ్యకృష్ణ పాత్ర ఒకటి. రాఘవరావు ప్రేమగా పిలుచుకునే రాజుగారు (రమ్యకృష్ణ)కి సినిమాలో పెద్దగా డైలాగ్స్ లేనప్పటికీ.. ఈ శివగామి కళ్లతోనే సినిమాను నడిపించేసింది. మరీ ముఖ్యంగా రాఘవరావు, రాజుల మధ్య ఉండే ప్రేమానుబంధాలు మన ఇంట్లోని పేరేంట్స్‌ని గుర్తుకు తెస్తుంది. రమ్యకృష్ణ కూడా.. చాలా గొప్పగా అన అభినయాన్ని ప్రదర్శించింది.

ఇక మూడో పాత్ర.. సినిమాకు ప్రాణం ఈ పాత్ర. ప్రకాశ్ రాజ్ స్నేహితుడిగా చేసిన చక్రపాణి (బ్రహ్మానందం) పాత్ర. ఇప్పటివరకు బ్రహ్మానందాన్ని కమెడియన్‌గానే చూసుంటారు. ఈ సినిమాలో బ్రహ్మి నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పడతారు. ఈ విషయంలో కృష్ణవంశీకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు. బ్రహ్మానందంలో ఇటువంటి నటుడు దాగున్నాడని.. ఇన్ని సంవత్సరాల తర్వాత జనాలకి అర్థమవుతుంది.

వీరు కాకుండా రాఘవరావు కొడుకు, కుమార్తె, కోడలు అంటూ.. అనసూయ, శివాత్మిక, ఆదర్శ్ వంటి వారు వారి పాత్రల పరిధిమేర నటించారు. కోడలిగా అనసూయకు, కుమార్తెగా చేసిన శ్రీ (శివాత్మికా రాజశేఖర్)కు మంచి పాత్రలు పడ్డాయి. వారు కూడా అద్భుతమైన నటనను కనబరిచి ‘రంగమార్తాండ’కు ప్లస్ అయ్యారు. వీరు కాకుండా అలీ రెజా, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు ఇతర పాత్రలలో చేసిన వారు కానీ, రాఘవరావు ఫ్యామిలీకి చెందిన ఇతరులు కానీ.. కాస్త నోటెడ్ ఆర్టిస్ట్‌లను పెట్టి ఉంటే.. సినిమా ఇంకా బాగా రీచ్ అయ్యేది.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

ఈ సినిమాకి డైలాగ్స్, సంగీతం, కెమెరా ప్రధాన హైలెట్‌గా చెప్పుకోవచ్చు. ముందుగా మాస్ట్రో ఇళయరాజా సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లింది. తెలుగు పద్యాలు, రాఘవరావు నాటక రంగం, అలాగే నిజ జీవితం మూడ్‌ని మాస్ట్రో తన మ్యూజిక్‌తో చక్కగా ఆవిష్కరించాడు. కొన్ని చోట్ల సంగీతమే ప్రధానంగా ఈ చిత్రం నడిచింది. అలాగే కెమెరా కూడా ఏ స్టేజ్‌కి ఎలా కావాలో కృష్ణవంశీ చక్కగా వినియోగించుకున్నాడు.

ఇక డైలాగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిగా డైలాగ్స్ గుచ్చుకుంటాయి. నిర్మాణం పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ఇంకా.. ఇతక సాంకేతిక నిపుణులు కూడా కృష్ణవంశీ కోసం తమ అనుభవాన్ని రంగరించారు. కృష్ణవంశీ విషయానికి వస్తే.. తన బలాబలాలు గుర్తించి.. కృష్ణవంశీ చేసిన చిత్రమిది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్‌లో ఎమోషన్స్‌ని పొదివి పట్టిన తీరుకు నిజంగా కృష్ణవంశీకి హ్యాట్సాఫ్ చెప్పొచ్చు.

విశ్లేషణ:

రంగస్థలంపై ఎన్నో పాత్రలకు జీవం పోసిన రాఘవరావు.. ఇక మిగిలిన జీవితాన్ని తన భార్య (రమ్యకృష్ణ), స్నేహితుడు (చక్రపాణి)లో కలిసి ఉండాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం ఆస్తులన్నీ తన పిల్లలకు పంచేస్తాడు. ఒక్క రూపాయి కూడా తన కోసం కానీ, తన భార్య కోసం గానీ ఉంచుకోవాలని భావించడు. పెద్దరికంతో చాదస్తం అని భావించే కోడలి సూటి పోటీ మాటలతో రాఘవరావు విసిగిపోయి ఇంటిని వదిలి వెళ్లిపోతాడు. నాటకమే కాకుండా.. నిజ జీవితంలో ఉండే సంఘర్షణలకి చోటిస్తూ ఈ సినిమా నడిచింది.

మెగాస్టార్ చిరంజీవి షాయరీతో మొదలైన ఈ సినిమా కథని.. కనిపించకుండా పోయిన రాఘవరావే నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. రాఘవరావు నాటక రంగానికి సంబంధించి ఒక అంకము నడిస్తే.. నిజ జీవితానికి సంబంధించి రెండో అంకము నడిపించి.. టైటిల్‌కు దర్శకుడు జస్టిఫికేషన్ చేశాడు. జీవితానికి మించిన రంగస్థలం లేదని చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశ్యంగా ఫైనల్‌గా అందరికీ అర్థమవుతుంది.

అయితే ఒక మరాఠీ సినిమాని అచ్చమైన, స్వచ్చమైన తెలుగుదనం ఉట్టిపడేలా మార్చిన కృష్ణవంశీ సర్వదా అభినందనీయుడు. అలాగే ఒక్కో నటుడిలో నుంచి ఆయన రాబట్టిన నటన.. నిజంగా ఆ పాత్రలలో నటించిన వారి జన్మ ధన్యమైపోయిందనే చెప్పుకోవాలి. తెలుగు భాషకు సంబంధించి వచ్చే ఓ సీన్, తెలుగు నాటక రంగాన్ని తక్కువ చేసి మాట్లాడే సీన్‌లో ప్రకాశ్ రాజ్ అద్భుతమైన నటనను కనబరిచారు.

ప్రకాశ్ రాజ్ కంటే గొప్పగా.. బ్రహ్మానందం ఈ సినిమాని తినేశాడు. ప్రకాశ్ రాజ్‌ని చెంపపై కొట్టి.. మళ్లీ కొట్టనా అడిగే సీన్, స్టేజ్‌పై ఎందరినో అలరించిన రాఘవరావు.. తన కుటుంబంలో ఇమడలేని పరిస్థితులలో ప్రదర్శించే సంఘర్షణ.. చూస్తున్న ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. మొత్తంగా చూస్తే మాత్రం నటన, నటించడం అంటే ఇదని ప్రతి ఒక్క నటుడికి తెలిపే చిత్రమిది.

కాకపోతే.. ఏం జరుగుతుందనే ఆసక్తిని కల్పించడంలో కృష్ణవంశీ ఫెయిలయ్యాడు. ఎందుకంటే, తర్వాత జరగబోయే సీన్ ముందుగానే తెలిసిపోతుంది. దానికి కూడా ఓ కారణం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. అలా తెలిసిపోవడానికి కారణం.. ఇటువంటి సంఘటనని మన పక్కంటిలోనో, పక్క వీధిలోనో చూసే ఉంటాం. అందుకే ముందే కథ ఇలా నడుస్తుందని ప్రేక్షకుడికి అర్థమైపోతుంది. ఇంకా చెప్పాలంటే సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్న చిత్రమిది.

తల్లిదండ్రులు, వారి పిల్లలు ఒక్కసారైనా ఈ సినిమాని చూడాలి. అందుకే తల్లిదండ్రుల, పిల్లల కథ ఇదని కృష్ణవంశీ ప్రమోట్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణలతో పాటు కాస్త పేరున్న నటీనటులు ఇతర పాత్రలలో చేసి ఉంటే.. సినిమా రేంజ్ మారిపోయేది. ఇప్పుడైనా ఏం పరవాలేదు.. ఒకసారి మాత్రం ఖచ్చితంగా చూడొచ్చు. కనురెప్పల మాటున దాగున్న ప్రేమను కూడా కదిలించి.. చూస్తున్న ప్రేక్షకుల మనసులను స్పృశించేలా కృష్ణవంశీ ఈ సినిమాని తెరకెక్కించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. కృష్ణవంశీ ఈజ్ బ్యాక్.. అంతే!

ట్యాగ్‌లైన్: కృష్ణవంశీ ఈజ్ బ్యాక్..
రేటింగ్: 3/5

Latest News