12 ఏళ్లుగా ఇంట్లో నకిలీ కొడుకు.. ఎందుకున్నాడంటే..

తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒక పిల్లాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. 28 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు.

  • Publish Date - December 12, 2023 / 12:21 PM IST

ఖండువా : తల్లిదండ్రులను వదిలిపెట్టి ఒక పిల్లాడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. 28 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. కానీ.. అప్పటికే ఇంట్లో తన స్థానంలో ఇంకో కొడుకు తానే అసలైన కొడుకును అంటూ ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఇన్నాళ్లు ఉన్నది అసలు కొడుకా? ఇప్పుడు ఇంటికి తిరిగి వచ్చింది అసలు కొడుకా? అన్న మీమాంశలో ఆ తల్లిదండ్రులు, ఆ ఊరి ప్రజలు పడిపోయారు. సినిమా కథలను తలపించే ఈ వింత ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఖండువా జిల్లా, ఖాలువా ఆదివాసి మండలం, కాలా కుర్దు గ్రామంలో వెలుగుచూసింది. తాను హరిద్వార్‌ వెళ్లి సంత్‌లతో వారి ఆశ్రమాల్లో గడిపానని, సంత్‌గా మారి ఇంటికి వచ్చేశానని 12 ఏళ్ల క్రితం వచ్చినప్పుడు నకిలీ కొడుకు చెప్పాడు.


కాగా.. తన పేరును కూడా కల్యాణగిరి మహారాజ్‌ అని మార్చుకున్నానని చెప్పాడు. తల్లిదండ్రులు కూడా నమ్మి.. కొడుకుగానే స్వీకరించారు. ఊళ్లోవాళ్లు కూడా అతడే ఆ ఇంటి వారసుడని నమ్మారు. కానీ.. 28 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన అసలు కొడుకు మళ్లీ తిరిగి వచ్చాడు. తానే అసలు కొడుకునని చెప్పడంతో అంతా నివ్వెరపోయారు. ఇంట్లో అప్పటికే ఉంటున్న కొడుకును నిలదీయడంతో అసలు రహస్యం బయటపెట్టాడు. తాను ఉత్తరప్రదేశ్‌కు చెందినవాడినని, కొడుకు ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఈ కుటుంబం బాధపడుతున్న విషయం తెలుసుకుని, వారి బాధ తొలగించడానికి, వారికి అండగా ఉండటానికి కొడుకుగా నటించి ఉంటున్నానని తెలిపాడు.