కొండా, కోమటిరెడ్డిల అసంతృప్తికి కారణం అదేనా?

విధాత: పీసీసీ పదవుల పందేరంపై తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపింది. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులను భారీ స్థాయిలో నియమించిన విషయం విదితమే. వాటిలో తమకు సముచిత స్థానం దక్కలేదని కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సినియర్‌ నాయకురాలు కొండా సురేఖ తనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో తనకు […]

  • Publish Date - December 12, 2022 / 10:08 AM IST

విధాత: పీసీసీ పదవుల పందేరంపై తెలంగాణ కాంగ్రెస్‌లో కాకరేపింది. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, ఎగ్జిక్యూటివ్‌ కమిటీ, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులను భారీ స్థాయిలో నియమించిన విషయం విదితమే. వాటిలో తమకు సముచిత స్థానం దక్కలేదని కొందరు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.

ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సినియర్‌ నాయకురాలు కొండా సురేఖ తనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు కల్పించకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీలో తనకు స్థానం కల్పించగా.. ఆ పదవికి రాజీనామా చేశారు. అలాగే మాజీ మంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ పదవుల్లో స్థానం దక్కకపోవడంపై స్పందించారు. మంత్రి పదవినే వదిలేశాను. పార్టీ పదవి తనకు లెక్క కాదు. రాష్ట్ర కమిటీల్లో నా పేరు లేకుంటే హైపవర్‌ కమిటీ ఉండొచ్చు. ప్రస్తుతం కాంగ్రెస్‌ కండువా ఉన్నది. ఎన్నికలకు నెల ముందు రోజుల వరకు మాట్లాడను. నల్గొండ అసెంబ్లీ నుంచే తాను పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు.

కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పార్టీ పదవుల్లో తమకు తగిన ప్రధాన్యం దక్కలేదని తమ అసంతృప్తిని వ్యక్త పరుస్తూనే.. తమ భవిష్యత్తు రాజకీయ జీవితం గురించి పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. రాజకీయ బతుకుదెరువు కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని, ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాని వాళ్లతో వేసిన కమిటీ జాబితాలో తన పేరు చేర్చడాన్ని అవమానంగా బావిస్తున్నానని సురేఖ అన్నారు.

టీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి కొండా దంపతులకు కాంగ్రెస్‌ పార్టీలో పెద్దగా ప్రాధాన్యం ఉండటం లేదు. వాళ్ల కూతురు సుస్మిత పటేల్‌ను వచ్చే ఎన్నికల్లో పోటీ దింపాలనే ఆలోచన ఉన్నది. ఆ దిశగానే కొండా దంపతుల రాజకీయ అడుగులు వేస్తున్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానం ఒక కుటుంబంలో ఒక్కరికే పదవి అనే నిర్ణయాన్ని అమలు చేస్తున్నది. ఇది వారికి ఇబ్బందిగా మారింది.

పరకాల, వరంగల్‌ తూర్పు, భూపాలపల్లి స్థానాలను కొండా దంపతులు కోరుకుంటున్నారు. సురేఖ వరంగల్‌ తూర్పు నుంచి, పరకాల నుంచి తన కూతురు, భూపాల పల్లి నుంచి కొండామురళి బరిలో దిగుతారనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ ఒకవేళ అవకాశం కల్పించకుంటే బీజేపీ ద్వారాలు ఎలాగూ తెరిచే ఉంటాయి.

ఆ పార్టీ అధిష్ఠానం కూడా వచ్చే ఎన్నికల కోసం అభ్యర్థుల వేటలో పడింది. కాంగ్రెస్‌లో కుదరకపోతే కాషాయ పార్టీలో చేరి అయినా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలని కొండా దంపతుల ఆలోచన. అందుకే తాజాగా ప్రకటించిన పీసీసీ కమిటీల జాబితాపై తీవ్ర విమర్శలు చేశారనే అభిప్రాయం వ్యక్తమౌతున్నది.

మరోవైపు మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చండూరులో కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అద్దంకి దయాకర్‌ వెంకట్‌రెడ్డిపై తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు. అనంతరం ఆయన, రేవంత్‌ వెంకట్‌రెడ్డికి క్షమాపణలు చెప్పారు. కానీ ఆ వివాదం అంతర్గతంగా ఇప్పటికీ కొనసాగుతున్నది. తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం వెంకట్‌ రెడ్డి స్థానిక కాంగ్రెస్‌ నేతలతో మాట్లాడిన ఆడియో కలకలం రేపాయి.

దీనిపై పార్టీ అధిష్ఠానం ఆయనను వివరణ కోరింది. తనపై తీవ్ర విమర్శలు చేసిన అద్దంకి తాజాగా పార్టీ ప్రకటించిన పదవుల్లో ప్రధాన కార్యదర్శి పదవి దక్కడం వంటివి వెంకట్‌రెడ్డికి మింగుడు పడటం లేదు. ఎన్నికలకు నెల రోజుల వరకు మాట్లాడన్న ఆయన నల్గొండ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తానని కుండ బద్దలు కొట్టారు. దీంతో ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్నది ఇప్పుడే చెప్పలేదు.

అందుకే ప్రస్తుతం కాంగ్రెస్‌ కండువా ఉన్నది వచ్చే ఎన్నికల నాటికి ఏది జరుగుతుందో ఇప్పుడే చెప్పలేను అన్నట్టు ఆయన మాట్లల్లో ధ్వనించింది. కాంగ్రెస్‌ రాష్ట్ర పీసీసీ పదవులపై ఇప్పుడు కొండా, కోమటిరెడ్డి తమ అసంతృప్తిని వెలుబుచ్చారు. వారి భవిష్యత్తు రాజకీయం వేరే పార్టీలో చూసుకోవాలనే నిర్ణయాన్ని ప్రస్తుతానికి వెల్లడించక పోయినా ఎన్నికల నాటికైనా అది బహిర్గతం అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఈ జాబితాలో ఉంటారో రానున్న రోజుల్లో తేలిపోతుంది.