Site icon vidhaatha

Revanth Reddy | చేతనైతే ‘ఇండియా’ను ఎదుర్కో: రేవంత్‌రెడ్డి

Revanth Reddy |

విధాత‌, హైద‌రాబాద్‌: 2014లో ఎన్డీఏ ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక దేశ ప్రజల భద్రతకు ముప్పు ఏర్పడిందని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దేశంలో దళితులకు, గిరిజ‌నుల‌కు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. భారత్ జోడో యాత్ర మొదటి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో కాంగ్రెస్ భారీ ప్రదర్శన నిర్వహించింది.

సోమాజీగూడలో ఉన్న‌ రాజీవ్ గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నేత‌లు నివాళులు అర్పించారు. అక్క‌డి నుంచి నెక్లెస్ రోడ్ లోని ఇందిరా గాంధీ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. అనంత‌రం ఇందిరా గాంధీ విగ్ర‌హానికి నివాళులు అర్పించారు. అక్క‌డ ఏర్ప‌టు చేసిన స‌భ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ మాట తప్పారని విమ‌ర్శించారు. ఉద్యోగాల‌ ఏర్పాటు సంగ‌తి ఏమోకాని నిరుద్యోగుల ఆత్మహత్యలు ఆపలేని పరిస్థితి ఏర్ప‌డింద‌ని మండిప‌డ్డారు.

న‌ల్ల‌ధ‌నాన్ని నిర్మూలించి, పేద‌ల ఖాతాల్లో 15 ల‌క్ష‌లు వేస్తామ‌న్న మోదీ.. అది చేయలేక.. దేశం పేరు మారుస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. మేక్ ఇన్ ఇండియా అన్న మోదీ ఇండియా పేరు మారుస్తానంటున్నారని విమర్శించారు. ‘ఇండియా’ కూటమి పేరు పలకడం ఇష్టం లేకనే మోదీ దేశం పేరు మారుస్తున్నార‌ని ఆరోపించారు.

మోదీకి చేతనైతే ఇండియా కూటమిని ఎదుర్కోవాలని స‌వాల్ విసిరారు. పెరిగిన ధరలు, మణిపూర్ అంశాలపై మోదీ పార్లమెంటులో చర్చించడంలేదని, కేవలం కాంగ్రెస్ ను తిట్టడానికే ఆయన ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ఏం చేసిందని మోదీ అడుగుతున్నారన్న రేవంత్‌.. గుజరాత్‌లో మోదీ తిరుగుతున్న ఎయిర్ పోర్ట్ కాంగ్రెస్ నిర్మించిందని గుర్తు తెచ్చుకోవాలన్నారు.

నిజాం నవాబుల నుంచి తెలంగాణకు విముక్తి కలిగించింది కాంగ్రెస్ కాదా? అని రేవంత్ ప్ర‌శ్నించారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ , భారత దేశం అభివృద్ధిని లెక్క కడదామా? అని అన్నారు. విభజించు పాలించు అనే విధానంతో దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రను బీజేపీ చేస్తున్నదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. దేశ సమగ్రతను కాపాడేందుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని తెలిపారు.

కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ పొలిమేరల దాకా తరమాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కారు ఢిల్లీకి వెళ్లి కమలంగా మారుతున్నదని ఆయన ఎద్దేవా చేశారు. లక్ష కోట్లు దోచిన కేసీఆర్ కు మద్దతు తెలపడంలో మీ ఆంతర్యం ఏంటి అసద్ భాయ్ అంటూ ఎంఐఎం అధినేత‌ను ప్ర‌శ్నించారు. ముస్లింలకు 12 శాతానికి బ‌దులు 4శాతం రిజర్వేషన్ కల్పించినందుకా కాంగ్రెస్ ను ఓడించాలంటున్నావని విమ‌ర్శించారు.

కాంగ్రెస్‌ బహిరంగసభ కోసం పరేడ్ గ్రౌండ్ బుక్ చేసుకుంటే అధికారం ఉందని బీజేపీ గ్రౌండ్ గుంజుకుందని ఆరోపించారు. దేశంలో హోంమంత్రి అమిత్ షా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిప‌డ్డారు. బీజేపీ, బీఆరెస్ కుట్ర చేసి కాంగ్రెస్ సభను జరగకుండా కుట్ర చేస్తున్నాయని చెప్పారు.

కుట్రలను అధిగమించి ఈ సభను జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు, ప్రజలకు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కార్య‌క్ర‌మంలో ఏఐసీసీ ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ త‌రువాత ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో నేతలు మాట్లాడారు.

Exit mobile version