విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం మరింత ముదురుతున్నది. హస్తం పార్టీకి చెందిన సీరియర్లు టీపీసీసీ చీఫ్, కమిటీలపై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. దీంతో మనస్తాపానికి గురైన రేవంత్ వర్గం, తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన 12 మంది నేతలు పదవులకు రాజీనామా చేశారు.
సీనియర్ల విమర్శలకు ధీటుగా రేవంత్ వర్గం నేతలు రాజీనామాలతో సమాధానం ఇచ్చారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కు పంపారు. పదవులకు రాజీనామాలు చేసిన వారిలో వేంరెడ్డి నరేందర్‌రెడ్డి, సీతక్క, విజయరమణారావు, చారగొండ వెంకటేశ్, ఎర్రశేఖర్‌రెడ్డి, పటేల్ రమేశ్‌రెడ్డితో పాటు పలువురు నేతలు రాజీనామాలు చేశారు.
టీ పీసీసీ కమిటీలు ప్రకటించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త వాదనలు వ్యక్తమవుతుండడంతో పార్టీ సీనియర్లపై ఒత్తిడి పెరిగింది. టీపీసీసీ కమిటీలు వేస్తారనే ప్రచారం నేపథ్యంలో పలువురు సీనియర్లు ఢిల్లీకి వెళ్లి ప్రయత్నాలు చేసినా చివరకు రేవంత్ మార్క్ కనిపించింది.
టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి రేవంత్‌తో పాటుగా చేరిన వారితో సహా.. ఆ తర్వాత పార్టీలోకి వచ్చిన వారు, పార్టీలో కొన్నిరోజులుగా సైలెంట్‌గా ఉంటున్న వారితో పాటుగా ఇటీవల పలు నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేతలుగా ఎదుగుతున్న నేతలకు పదవులు వరించడంతో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని వస్తున్న నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ సీనియర్ల వద్దకు పరుగులు పెట్లాకె,
దీంతో శనివారం ఒక్కసారిగా సీనియర్లు తిరుగుబావుటా వెగుర వేశారు. రేవంత్‌కు వ్యతిరేకంగా సేవ్ కాంగ్రెస్ నినాదాన్ని ఎత్తుకున్నారు. ప్రస్తుతం టీ కాంగ్రెస్ సీనియర్స్ వర్సెస్ రేవంత్ వర్గంగా తయారైంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గాంధీ భవన్‌లో టీ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ సీనియర్ నేతలు గైర్హాజరయ్యారు.
సీనియర్ నేత జానారెడ్డి, మల్లు రవి, జనార్దన్‌రెడ్డి మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. పార్టీలో జరుగుతున్న సంక్షోభంపై జానారెడ్డి స్పందించలేదు. పార్టీకి సంబంధించిన ఏ విషయాన్ని తాను బయట మాట్లాడనని స్పష్టం చేశారు.
ఎలాంటి సమస్యలున్నా అంతర్గతంగానే చర్చిస్తామని చెప్పారు. పీసీసీ కమిటీల విషయంలో గతంలో కూడా ఎన్నో గొడవలు జరిగాయని.. ఇవేమీ కొత్తవి కావన్నారు.