ర‌న్నింగ్ కొట్టు.. బోన‌స్ ప‌ట్టు

ప్రపంచవ్యాప్తంగా కంపెనీలు లక్ష్యాలను సాధించడానికి వివిధ పాల‌సీల‌ను అమ‌లు చేస్తాయి. కొన్ని కంపెనీలు పని సామర్థ్యం పెంచుకొని అధిక లాభాల లక్ష్యంగా ప‌నిచేస్తాయి

  • Publish Date - December 20, 2023 / 07:28 AM IST
  • నెల‌కు 50 కి.మీ ఉరికితే నెల వేత‌నం
  • ఉద్యోగుల‌కు చైనా కంపెనీ బంప‌ర్ ఆఫ‌ర్‌
  • ఉద్యోగుల ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం


విధాత‌: ప్రపంచవ్యాప్తంగా అనేక‌ కంపెనీలు త‌మ లక్ష్యాలను సాధించడానికి వివిధ పాల‌సీల‌ను అమ‌లు చేస్తాయి. కొన్ని కంపెనీలు పని సామర్థ్యం పెంచుకొని అధిక లాభాలను పొంద‌డం లక్ష్యంగా ప‌నిచేస్తాయి. మ‌రికొన్ని కంపెనీలు వ‌చ్చిన‌ లాభాల‌ను ఉద్యోగుల‌కు కూడా పంచుతుంటాయి. కానీ, చైనాకు చెందిన ఓ కంపెనీ మాత్రం వెరైటీ పాల‌సీని అమ‌లు చేస్తున్న‌ది.


కాగా.. 30 రోజుల్లో 50 కిలోమీట‌ర్లు ర‌న్నింగ్ చేస్తే నెల వేత‌నం బోన‌స్‌గా ప్ర‌క‌టిస్తున్న‌ది. అంటే రోజుకు దాదాపు రెండు కిలోమీట‌ర్లు ర‌న్నింగ్ చేయాల్సి ఉంటుంది. త‌మ ఉద్యోగుల ఫిజిక‌ల్ ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యం ఇస్తూనే, సాధారణ జీతాలకు మించి బోనస్‌లను సంపాదించే అవకాశాన్ని క‌ల్పిస్తున్న‌ది.


గ్వాంగ్‌డాంగ్ డాంగ్‌పో పేపర్ కంపెనీ చైర్మన్ లిన్ జియాంగ్ ఇటీవ‌ల త‌మ ఉద్యోగుల‌కు ఈ బంప‌ర్ ఆఫర్ ప్ర‌క‌టించారు. శారీరక వ్యాయామాల ఆధారంగా అదనంగా నగదు సంపాదించే అవ‌కాశం క‌ల్పించారు. కొత్త పాలసీ ప్రకారం ఒక ఉద్యోగి నెలకు 50 కిలోమీట‌ర్లు ఉరికితే నెల వేతనం బోనస్‌గా పొంద‌వ‌చ్చు.


కాగా.. 40 కి.మీ.లు ఉరికితే 60 శాతం, 30కి.మీ ర‌న్నింగ్ 30 శాతం చొప్పున నెలవారీ బోనస్‌ను పొంద‌వ‌చ్చు. నెలకు 100 కి.మీలు పరిగెత్తే వారికి అదనంగా మ‌రో 30 శాతం బోన‌స్ లభిస్తుంది. ట్రెక్కింగ్‌, స్పీడ్‌ వాకింగ్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఉద్యోగుల ఫోన్ల‌లోని యాప్‌ల ద్వారా దూరాన్ని గణిస్తారు.


“ఒక కంపెనీ ఉద్యోగులు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ కంపెనీ కూడా చాలా కాలంపాటు కొనసాగుతుంది” అని ఆ కంపెనీ బాస్ లిన్ జియోంగ్ చెప్పారు. 2022 సంవత్సరంలో జెరోధా అనే భారతీయ కంపెనీ త‌మ ఉద్యోగులు బరువు తగ్గడంపై దృష్టి సారించింది. ప్రతిరోజూ కనీసం 350 క్యాలరీలు క‌ర‌గ‌దీస్తే రూ.10 లక్షల రివార్డ్ అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది.