విధాత: ఏపీ ప్రభుత్వంలోని పెద్దలు ఒక్కోసారి మాట్లాడే మాటలు, ఇచ్చే స్టేట్మెంట్లు ఒక పట్టాన అర్థం కావు. ఏ ఉద్దేశంతో అన్నారో, ఎవర్నీ ప్రభావితం చేయడానికి అన్నారో అర్థం అయ్యేసరికి చాలా టైం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కాసేపటి క్రితం ఏపీ విభజన అంశాన్ని మళ్లీ ప్రస్తావించారు. ఆంధ్ర, తెలంగాణ విడిపోయి వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడి ప్రజలు కూడా అలవాటైపోయి ఎవరి జీవితాలు వాళ్లు సాగిస్తున్న తరుణంలో ఇన్నేళ్ల తరువాత మళ్లీ సజ్జల సమైక్యాంధ్ర అంటున్నారు.
సాధ్యమయ్యే పనేనా..
కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానమని హాట్ కామెంట్స్ చేశారు. సమైక్య రాష్ట్రాన్ని వైసీపీనే గట్టిగా కోరుకుందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతు ఇస్తామని తెలిపారు. కుదిరితే మళ్లీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా కలిసి ఉండాల న్నదే తమ విధానమని హాట్ కామెంట్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్ మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ తమ ప్రభుత్వం దానికే ఓటు వేస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కానీ ఇప్పుడది సాధ్యమయ్యే పనేనా అని సజ్జల వ్యాఖ్యానించారు.
ఉండవల్లి వ్యాఖ్యలపై సజ్జల ఆగ్రహం
అంతేకాకుండా రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి జగన్ ఏపీ ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని.. రాష్ట్ర ప్రయోజనాలను వదిలేశారని.. ఇలా అయితే జగన్ రాజకీయంగా గట్టి దెబ్బతినడం ఖాయమని ఉండవల్లి నిన్న కామెంట్స్ చేశారు.
అంతేకాకుండా రాష్ట్ర విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిందంటూ ఉండవల్లి ఆరోపించారు. పోరాటం చేసే జగన్ ముఖ్యమంత్రి అయ్యారని ఇప్పుడు ఆ విషయాన్ని పూర్తిగా విస్మరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ కోసం పోరాటం చేయకపోతే జగన్ రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినట్లేనని అన్నారు.
విడిపోయి మళ్లీ కలిసిన చరిత్ర భారత్‌లో లేదు..
ఈ నేపథ్యంలో ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు రిప్లై గా మాట్లాడిన సజ్జల.. జగన్ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసమే పోరాడుతున్నారన్నారు. అవసరం అయితే మళ్లీ సమైక్యాంధ్రను సాధిస్తాం అన్నట్లుగా మాట్లాడారు. అయితే ఒకసారి విడిపోయిన రాష్ట్రాలు మళ్లీ కలిసిపోయిన చరిత్ర భారత్ లో లేదు. కానీ మరి సజ్జల ఏ ఉద్దేశంతో, ఏ లక్ష్యంతో అన్నారో తెలీడం లేదు.