Satyapal Malik | అయోధ్య ఆలయంపై బీజేపీ దాడి చేయిస్తుందేమో!: సత్యపాల్‌ మాలిక్‌

Satyapal Malik ఒక పెద్ద బీజేపీ నేతను చంపిస్తారేమో మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అనుమానం ఎన్నికల్లో గెలిచేందుకు ఏదైనా చేస్తారని వ్యాఖ్య పాక్‌తో యుద్ధానికీ దిగుతారేమోనని సందేహం న్యూఢిల్లీ: పుల్వామా దాడులకు ప్రధాని నరేంద్రమోదీయే కారకుడని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు అనేక కుట్రలకు పాల్పడుతారేమోనని సందేహాలను ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల […]

  • Publish Date - August 6, 2023 / 11:33 PM IST

Satyapal Malik

  • ఒక పెద్ద బీజేపీ నేతను చంపిస్తారేమో
  • మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ అనుమానం
  • ఎన్నికల్లో గెలిచేందుకు ఏదైనా చేస్తారని వ్యాఖ్య
  • పాక్‌తో యుద్ధానికీ దిగుతారేమోనని సందేహం

న్యూఢిల్లీ: పుల్వామా దాడులకు ప్రధాని నరేంద్రమోదీయే కారకుడని గతంలో సంచలన వ్యాఖ్యలు చేసిన జమ్ముకశ్మీర్‌ మాజీ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించేందుకు అనేక కుట్రలకు పాల్పడుతారేమోనని సందేహాలను ఆయన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో పలు స్వచ్ఛంద సంస్థలు జాతీయ భద్రతా అంశాలపై ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు ముందే అయోధ్యలోని రామమందిరంపై దాడి చేయిస్తారేమోనని అనుమానం వెలిబుచ్చారు. ‘నాకు చాలా భయాలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ముందు ఏదో ఒకటి చేస్తారని నాకు భయాలు ఉన్నాయి. ఎందుకంటే అది వారి స్వభావం. గుజరాత్‌లో వాళ్లు అదే చేశారు. దేశంలో అదే చేశారు. రామమందిరంపై గ్రెనేడ్‌ విసురుతారేమో.. ఒక పెద్ద బీజేపీ నేతను చంపుతారేమో.. ఆఖరుకు పాకిస్థాన్‌తో యుద్ధం వచ్చేలా చేస్తారేమో’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అధికారం కాపాడుకునేందుకు మోదీ ఎంతకైనా తెగిస్తారని సత్యపాల్‌ మాలిక్‌ అన్నారు. పుల్వామా దాడులకు కారకుడైన వ్యక్తి.. ఏదైనా చేయగలడని చెప్పారు. పుల్వామా ఘటన జరిగినప్పుడు జమ్ముకశ్మీర్‌కు మాలిక్‌ గవర్నర్‌గా వ్యవహరించారు. ఆ ఘటన వెనుక భద్రతా వైఫల్యంపై మాట్లాడవద్దని ప్రధాని మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్‌ తనను కోరారని గతంలో ఆయన వెల్లడించిన అంశాలు దేశంలో రాజకీయంగా కలకలం రేపాయి. ఇదే అంశాన్ని ఆయన మరోసారి ప్రస్తావించారు.

‘జవాన్ల బలిదానాన్ని ప్రధాని 2019 ఎన్నికల్లో ఓట్ల కోసం వాడుకున్నారు. ఆ ఎన్నికలు మన సైనికుల శవాల మీద జరిగాయి’ అని చెప్పారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు చనిపోయారు. 2019 జనవరి 14న జరిగిన ఆ దాడికి ఎవరినీ బాధ్యులుగా ప్రభుత్వం ప్రకటించకపోవడాన్ని మాలిక్‌ ప్రశ్నించారు. ‘సాయంత్రం 5 గంటలకు (ఘటన జరిగిన రోజు) ప్రధాని నాకు ఫోన్‌ చేసి ఏం జరిగిందని అడిగారు.

మన లోపాల కారణంగానే దాడి జరిగిందని నేను చెప్పాను. వెంటనే ఆయన మౌనంగా ఉండాలని, ఈ విషయం బయట మాట్లాడ వద్దని చెప్పారు. అజిత్‌ దోవల్‌ కూడా ఇలానే మాట్లాడారు’ అని ఆయన తెలిపారు. గతంలో బీజేపీ ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేసిన సత్యపాల్‌ మాలిక్‌.. ఇటీవలి కాలంలో మోదీని టార్గెట్‌ చేస్తూ కీలక వ్యాఖ్యలు, విమర్శలు చేస్తున్నారు. యుపీకి చెందిన మాలిక్‌.. గతంలో లోక్‌దళ్‌, జనతాదళ్‌, కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీల్లో వివిధ సందర్భాల్లో పనిచేశారు.

Latest News