బీజేపీలో చేరిన ఏడుగురు సుద్దపూసల కథాకమామిషు ఏమనగా..!

అజిత్‌పవార్‌, అశోక్‌ చవాన్‌, నవీన్‌ జిందాల్‌, గీతా కోడా.. వీరంతా గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు! అవినీతిపరులని బీజేపీ ముద్ర వేసినవారు!

  • Publish Date - April 1, 2024 / 06:13 AM IST

నాడు అవినీతిపరులు.. నేడు బీజేపీ అభ్యర్థులు.. స్టార్‌ క్యాంపెయినర్లు

అవినీతిపరులంటూ మోదీ నోట ఆరోపణలు

అదే అవినీతి నేతలకు బీజేపీలో అభ్యర్థిత్వాలు

ఎవరొచ్చినా పార్టీలోకి స్వాగతమంటున్న నిర్మలా సీతారామన్‌

అవినీతి కేసులు ఉన్నా తీసుకుంటామని వ్యాఖ్యలు

మరకలున్న నేతల పాలిట వాషింగ్‌ మిషన్‌గా బీజేపీ

ఆ పార్టీలో చేరగానే కేసులు క్లోజ్‌.. దర్యాప్తులు బంద్‌!

న్యూఢిల్లీ: అజిత్‌పవార్‌, అశోక్‌ చవాన్‌, నవీన్‌ జిందాల్‌, గీతా కోడా.. వీరంతా గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు! అవినీతిపరులని బీజేపీ ముద్ర వేసినవారు! కానీ.. 2024 ఎన్నికలకు ముందు వారందరినీ సుద్దపూసలని సర్టిఫికెట్‌ ఇచ్చి.. పార్టీలో చేర్చుకుని టికెట్లు కూడా ఇచ్చింది. మరికొందరిని తన ఎన్డీయే కూటమిలో చేర్చుకున్నది. అవినీతి మరకలు ఉన్న నేతల పాలిట వాషింగ్‌ మిషన్‌గా బీజేపీ తయారైందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థల చర్యలను తప్పించుకునేందుకు కొందరు కాషాయ పార్టీ గూటికి చేరుతున్నారని పేర్కొంటున్నాయి. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ (అజిత్‌పవార్‌ ముఠా) నాయకుడు ప్రఫుల్‌ పటేల్‌పై ఇటీవల అవినీతి కేసును సీబీఐ మూసేయడం.. అక్రమ మైనింగ్‌ కేసులో నిందితుడిగా ఉన్న గాలి జనార్దన్‌రెడ్డిని బీజేపీలో చర్చుకోవడం ఇందుకు తాజా నిదర్శనాలని చెబుతున్నారు.

ఎవరినైనా బీజేపీలో చేర్చుకుంటాం

అవినీతి ఆరోపణలు ఉన్న నాయకులు బీజేపీలో చేరుతుండటంపై శనివారం మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సమాధానమిస్తూ.. తమ పార్టీలో అందరికీ తలుపులు తెరిచే ఉంటాయని, ప్రతి ఒక్కరినీ స్వాగతిస్తామని చెప్పారు. పలు కేసులు ఉన్నవారిని కూడా పార్టీలో చేర్చుకుంటున్నారని ప్రస్తావించగా.. ‘పార్టీ అందరికీ స్వాగతం పలుకుతోంది’ అని అదే సమాధానం చెప్పడం గమనార్హం. ఇటీవలికాలంలో ఇలా అవినీతి కేసులు ఉండి.. బీజేపీలో చేరగానే సుద్దపూసలైపోయినవారి జాబితా పెద్దగానే ఉన్నది. కొందరు బీజేపీ తరఫున స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలోనూ ఎక్కారు. అందులో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి.

1. అజిత్‌పవార్‌

నిజానికి గత 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్సీపీ అంటే నేచురల్లీ కరప్ట్‌ పార్టీ.. అని మోదీ ముద్ర వేశారు. ఆ సమయంలో అజిత్‌పవార్‌ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదే అజిత్‌పవార్‌ సొంత పార్టీలో తిరుగుబాటు లేవదీసి, పార్టీలో చీలికకు కారణమయ్యారు. ఎన్డీయేలో చేరిపోయారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేసే స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అజిత్‌పవార్‌పై వేర్వేరు దర్యాప్తు సంస్థలు అటు కేంద్ర స్థాయిలో.. ఇటు రాష్ట్ర స్థాయిలో అనేక కేసులు పెట్టాయి. వాటిలో సహకార బ్యాంకు, స్టేట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుకు సంబంధించిన కేసులు దశాబ్దకాలంగా కొనసాగుతున్నాయి. నిజానికి పవార్‌ తిరుగుబాటు లేవదీసి షిండే సేన, బీజేపీతో చేతులు కలపడానికి వారం రోజుల ముందే మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన మోదీ.. నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీని అవినీతి పార్టీ అని ఆరోపించారు. కానీ.. మార్చి నెల మొదటిలో ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) అధికారులు అజిత్‌పవార్‌పై ఉన్న 25000 కోట్ల రూపాయల మహారాష్ట్ర స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు కేసులో క్లోజర్‌ రిపోర్టును సమర్పించారు.

2. అశోక్‌ చవాన్‌

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అశోక్‌ చవాన్‌ ఫిబ్రవరి నెలలోనే బీజేపీలో చేరారు. ఆ వెంటనే ఆయనను బీజేపీ రాజ్యసభకు పంపింది. ఇప్పుడు ఆయన మహారాష్ట్ర బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లలో ఒకరు. అజిత్‌పవార్‌ మాదిరిగానే అశోక్‌ చవాన్‌ పైనా ప్రధాని మోదీ తరచూ అవినీతి ఆరోపణలు చేసేవారు. 2014 మార్చి 14న ఒక సభలో మాట్లాడిన మోదీ.. చవాన్‌కు కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో టికెట్‌ ఇవ్వడంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయనకు టికెట్‌ ఇవ్వడం సిగ్గు చేటని వ్యాఖ్యానించారు. ఆదర్శ్‌ కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. ఆయనను ‘ఆదర్శ్‌’ పురుషుడని ఎద్దేవా చేశారు. చవాన్‌ పోటీచేసిన నాందేడ్‌లో నిర్వహించిన ఆ సభలో మోదీ మాట్లాడుతూ.. అవినీతి పరులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించారు కూడా.

చవాన్‌, ఆయన కుటుంబ సభ్యులు ఆదర్శ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్ సొసైటీ పేరుతో ఉన్న 31 అంతస్తుల భవనంలో లబ్ధి పొందారని కేసులు ఉన్నాయి. నిజానికి ఈ భవనాన్ని 1999 కార్గిల్‌ యుద్ధ వీరుల కోసం, ఆ యుద్ధంలో చనిపోయిన సైనికుల భార్యల కోసం నిర్మించారు. ఈ కేసులో ఈడీ కూడా దర్యాప్తు చేసి, చవాన్‌ను నిందితుడిగా చేర్చింది. కానీ.. బీజేపీలో ఆయన సుద్దపూస అయిపోయారు!

3. నవీన్‌ జిందాల్‌

కాంగ్రెస్‌ మాజీ ఎంపీ, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ గత వారం పార్టీలో చేరిన కొద్ది గంటలకే హర్యానాలోని కురుక్షేత్ర నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించింది. 2014 అక్టోబర్‌లో కురుక్షేత్రలో జరిగిన ఒక సభలో ప్రధాని నరేంద్రమోదీ అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతూ.. కుంభకోణాలు, దోపిడీలు, అవినీతి, భూకుంభకోణాలు కాంగ్రెస్‌ పాలనలో సర్వసాధారణయ్యాయని ఆరోపించారు. జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో కోల్‌ బ్లాకుల కేటాయింపులో అక్రమాలకు పాల్పడినట్టు జిందాల్‌పై మూడు కేసులు ఉన్నాయి. వీటిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేశాయి. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లో కోల్‌బ్లాకుల కేటాయింపు అంశం కూడా ఉన్నది. 2014 నవంబర్‌లో జార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిన మోదీ.. జార్ఖండ్‌ గనులను దోచుకునే ప్రయత్నాలను అనుమతించేది లేదని చెప్పుకొచ్చారు. గత నెలలో పార్లమెంటులో భారత ఆర్థిక వ్యవస్థపై కేంద్రం సమర్పించిన శ్వేపత్రంలో సైతం కోల్‌బ్లాక్‌ కేటాయింపుల స్కాం ఉన్నది. కురుక్షేత్ర బీజేపీ అభ్యర్థిగా నవీన్‌ జిందాల్‌ను ప్రకటించిన తర్వాత బొగ్గు కుంభకోణంలో జిందాల్‌ పాత్ర గురించి మోదీ స్వయంగా మాట్లాడిన అంశాలను ఐఎన్‌ఎల్డీ నేత అభయ్‌సింగ్‌ చౌతాలా ప్రస్తావించారు. ఇప్పుడు బీజేపీ ఎవరినైతే కురుక్షేత్ర అభ్యర్థిగా ప్రకటించిందో ఆ నవీన్‌ జిందాల్‌ బొగ్గు స్కాం గురించి మోదీ గతంలో స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. గనులను దోచుకుంటున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. కట్‌ చేస్తే.. బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల రూపేణా అధిక విరాళాలు ఇచ్చిన టాప్‌ టెన్‌ జాబితాలో జిందాల్‌ గ్రూప్‌ కూడా ఒకటి. గడిచిన ఐదేళ్ల కాలంలో జిందాల్‌ గ్రూపు బీజేపీకి ఎలక్టోరల్‌ బాండ్ల పేరిట 202 కోట్లు విరాళాలు సమర్పించుకున్నది. ఫలితం.. నవీన్‌ జిందాల్‌ సుద్దపూస అయిపోయారు.

4. కృపాశంకర్‌ సింగ్‌

ముంబై కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు కృపాశంకర్‌ సింగ్‌ గతంలో మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. ఆ పార్టీకి రాజీనామా చేసి, 2021లో బీజేపీలో చేరిపోయారు. ఆ వెంటనే ఆయనను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియమించారు. యూపీలోని ఆయన సొంత ప్రాంతమైన జాన్‌పూర్‌ నుంచి లోక్‌సభ టికెట్‌ ఇచ్చారు. ఆదాయానికి మించి 230 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయన్న కేసులో ఆయనపై, ఆయన కుటుంబపై కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. 2012లో బీజేపీ మహారాష్ట్ర విభాగం ఆయన అవినీతిపై మండిపడింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా డిమాండ్‌ చేసింది. కానీ.. ఇప్పుడు బీజేపీలో చేరినందుకు సుద్దపూస కాబట్టి.. ఏమీ మాట్లాడరు.

5. తపస్‌ రాయ్‌

తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత అయిన తపస్‌రాయ్‌ ఆ పార్టీ తరఫున ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. మార్చి నెలలో ఆయనను బీజేపీ కోల్‌కతా నార్త్‌ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది. తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉన్న సమయంలో మున్సిపాల్టీల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ రాయ్‌ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల అనంతరం గతంలో తృణమూల్‌ కాంగ్రెస్‌లో ఉండి.. అనంతరం బీజేపీలో చేరి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎంపికైన సువేందు అధికారి రాయ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. 2021లో రాయ్‌ను ఒక దొంగగా సువేందు ఆరోపించారు. ‘దొంగ ఇంటిలోనే సోదాలు జరుగుతాయి. వారు దొంగలు. అలాంటివారిని కటకటాల వెనక్కు నెట్టాలని బెంగాల్‌ యువత, ప్రజలు కోరుకుంటున్నారు’ అని ఆయన ఒక వార్తా సంస్థతో అన్నారు. ఇప్పుడు ఆయన నీతిమంతుడు. సుద్దపూస. ఎందుకంటే.. బీజేపీలో చేరారు కదా!

6. గీతా కోడా

జార్ఖండ్‌లో కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎంపీ అయిన గీతా కోడా.. మార్చి నెలలో బీజేపీలో చేరారు. ఆమెను సింఘ్‌భూమ్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దింపింది. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా భార్య గీతాకోడా. బొగ్గు బ్లాకుల కేటాయింపు కుంభకోణంలో అవినీతి, కుట్ర అభియోగాలపై 2017లో మధుకోడా జైలుకు వెళ్లారు. అయితే.. 2018లో గీత కాంగ్రెస్‌లో చేరినప్పుడు బీజేపీ తీవ్రస్థాయిలోనే ఆరోపణలు చేసింది. అవినీతిని వ్యవస్థాగతం చేస్తున్నారంటూ ఒక బీజేపీ నాయకుడు ఆరోపించారు. ఇప్పుడు అదే అవినీతిపరుడైన మధు కోడా భార్య గీత బీజేపీలో చేరిపోయారు. మధు కోడా కూడా త్వరలోనే కాషాయ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ జార్ఖండ్‌ అధ్యక్షుడు బాబూలాల్‌ మరాండీ సంకేతాలు ఇచ్చారు. చేరుతారు.. బీజేపీ వాషింగ్‌ మిషన్‌లో పడి.. సుద్దపూస అయిపోతారుగా!

7. దేబాషిష్‌ ధర్‌

పశ్చిమబెంగాల్‌ మాజీ ఐపీఎస్‌ అధికారి దేబాషిష్‌ ధర్‌. ఇటీవలే ఆయన సర్వీసు నుంచి వైదొలగి, బీజేపీలో చేరారు. ఆయనను బిర్భూమ్‌ నుంచి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న కేసులో 2022లో రాష్ట్ర సీఐడీ అధికారులు ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఆయనతోపాటు వ్యాపారవేత్త సుదీప్త రాయ్‌ చౌదరిపైనా సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. వీరిద్దరూ రోజ్‌ వ్యాలీ చిట్‌ఫండ్‌ కేసులో నిందితులుగా ఉన్నారు. అంతేకాదు.. 2021 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర బలగాల కాల్పుల్లో నలుగురు వ్యక్తులు మరణించిన నేపథ్యంలో అప్పట్లో కూచ్‌బిహార్‌ ఎస్పీగా ఉన్న ఆయనను ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. కానీ.. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరగానే సుద్దపూస అయిపోయారు.

Latest News