- రాహుల్‌గాంధీ దేశభక్తుడిపై నిందలు వేస్తున్నాడన్న బీజేపీ
- గాడ్సేకి తుపాకి ఇచ్చింది సావర్కరే: తుషార్ గాంధీ
విధాత: ఈ మధ్య బీజేపీ నేతలు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఎదురుదాడే తమ దారి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వారిపై, వారి పార్టీ భావజాల మూలాలపై విమర్శలు వచ్చినప్పుడు వాటికి సమాధానం ఇవ్వటం కాకుండా, విమర్శకులపై ఎదురు దాడి చేసి తమదే పైచేయి అన్న చందంగా ప్రవర్తిస్తున్నారు. సావర్కర్ బ్రిటిష్ వారికి లొంగిపోయి రక్షణ వేడుకున్నాడని రాహుల్ గాంధీ చెప్పిన విషయంపై బీజేపీ నేతలు ఇల్లెక్కి గోల చేస్తున్నారు. దేశ భక్తునిపై నిందలు వేస్తున్నాడని రాహుల్ గాంధీపై దాడి చేస్తున్నారు.
బీజేపీ వారు తమ మూల సిద్ధాంత కర్తగా చెప్పుకొనే సావర్కర్ గురించి రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా, బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్ రాత పూర్వకంగా ఇచ్చిన హామీ పత్రాన్ని చూపించి ఈ ఆరోపణ చేశారు. నాడు, స్వాతంత్ర సంగ్రామం ఉధృతంగా సాగుతున్న సమయంలో సావర్కర్ తో పాటు అనేక మంది అండమాన్ జైలులో నిర్బంధింప బడి ఉన్నారు. అందులో ఏ ఒక్కరూ బ్రిటిష్ ప్రభుత్వానికి లొంగిపోయి ఇంకెప్పుడూ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనబోమని రాసి ఇవ్వలేదు.
కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ వారు వీరునిగా కొనియాడే సావర్కర్ మాత్రం బ్రిటిష్ వారికి లొంగిపోతున్నట్లు హామీ పత్రం రాసిచ్చి విడుదలయ్యాడు. అంతే కాదు ఎల్లప్పుడూ బ్రిటిష్ ప్రభుత్వానికి కృతజ్ఞుడిగా ఉంటానని చెప్పుకొన్నాడు. ఆ నేపథ్యంలోంచే.. నాటి హిందూ మహాసభ వారంతా బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించినట్లు చరిత్రలో దాఖలాలున్నాయి.
నిజానికి బీజేపీ నేతలు చేయాల్సిందేమంటే.. రాహుల్ గాంధీ చూపించిన లేఖ తప్పుదని, అబద్ధమని చెప్పాలి. ఆ లేఖ అంతా కట్టుకథ అని చెప్పదల్చుకుంటే అదే చెప్పాలి. కానీ నిజం దాచేస్తే దాగేది కాదు. చరిత్ర పుటల్లో సావర్కర్ రాసిన లేఖ భద్రంగా ఉన్నది. దాన్ని కాదనే ధైర్యం ఎవరు చేసినా అది దుస్సాహసమే గాక, వ్యథాప్రయాస కూడా. వీటన్నింటినీ పక్కన పెట్టి ఎదుటి వారిపై మూక దాడి చేస్తూ పై చేయి సాధించటమే పనిగా బీజేపీ పెట్టుకున్నట్లు కనిపిస్తున్నది.
ఇదిలా ఉంటే మహాత్మాగాంధీ ముని మనుమడు తుషార్ గాంధీ గాంధీని హత్య చేయటానికి గాడ్సేకు తుపాకీని సరఫరా చేసింది సావర్కరే అని మరో బాంబు పేల్చటం గమనార్హం.