వాతావరణ మార్పులు (Environmental Changes) పూర్తి వేగంగా జరుగుతున్న ఈ కాలంలో దాని దుష్పరిణామాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎండలో బయట తిరిగే అవసరం ఉన్న వారిని ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా శాస్త్రవేత్తలు ఒక వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. సూర్యుడి నుంచి వచ్చే సమస్యకు విరుగుడుగా ఆ సౌరశక్తినే వినియోగించాలని భావించారు. అనేక పరిశోధనలు, అధ్యయనాలు చేసిన అనంతరం సౌర శక్తిని ఉపయోగించుకునే దుస్తులను తయారు చేశారు.
సోలార్ సెల్స్, ఎలక్ట్రానిక్ డివైజ్‌తో ఉండే ఈ స్మార్ట్ దుస్తులు (Solar Clothes) విపరీతమైన ఉష్ణోగ్రతల నుంచి కాపాడతాయని వారు నమ్మకంగా చెబుతున్నారు. బయట ఉండే ఉష్ణోగ్రతలను ఈ దుస్తులు స్వీకరించి శరీరానికి అవసరమైన ఉష్ణోగ్రతల పరిధిలోకి తీసుకొస్తాయి. ఇవి సౌకర్యవంతమే కాకుండా ఎడారులు, మంచు పర్వతాలు, అంతరిక్షంలో కూడా ఉపయోగపడతాయని ఈ సోలార్ దుస్తుల రూపకర్తలు చెబుతున్నారు. కొన్ని రోజులకు ఇప్పుడు వేసుకుంటున్న దుస్తులను అసలు వేసుకోలేమని ఎందుకంటే కొన్ని చోట్ల విపరీతమైన ఉష్ణోగ్రతలు, మరికొన్ని చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంటున్నారు.
దానికి తగినట్లు దుస్తుల డిజైన్ ఉండాలని భావించి ఈ స్మార్ట్ డ్రెస్‌లను రూపొందించినట్లు వెల్లడించారు. చుట్టూ ఉన్న వాతావరణానికి తగ్గట్లు మన శరీర ఉష్ణోగ్రతను సరిచేయడమే వీటి ముఖ్యఉద్దేశమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సైన్స్ జనరల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. సోలార్ దుస్తుల్లో ఉండే ఎలక్ట్రానికి డివైజ్ 10.1 డిగ్రీల సెల్సియస్ కూలింగ్‌ను ఉత్పత్తి చేయగలదు. అంతే కాకుండా మన శరీరం తట్టుకోగలిగిన ఉష్ణోగ్రత కంటే 3.2 డిగ్రీలను అదనంగా వేడిని గ్రహించి మనకు రక్షణ కల్పిస్తుంది.
బయట వాతావరణం ఎలా ఉన్నప్పటికీ ఈ దుస్తులను ధరిస్తే మానవ శరీరానికి సురక్షితమైన 32-36 డిగ్రీల రేంజ్‌లోనే ఉష్ణోగ్రతలను ఉంచుతుంది. 12 గంటల పాటు ఎండలో వీటిని ధరిస్తే.. సుమారు 24 గంటల పాటు ఈ సోలార్ సూట్ నిర్విరామంగా పనిచేస్తుంది. ఈ సాంకేతికత ద్వారా అత్యంత సామర్థ్యం, స్వయంచాలకత్వం ఉన్న థర్మల్ మేనేజ్‌మెంట్ దుస్తులను తయారుచేయొచ్చు. తద్వారా వాతవరణ మార్పుల నుంచి ప్రజలను రక్షించడానికి అవకాశం ఉంటుంది అని ఈ పరిశోధన పత్రం పేర్కొంది.