గ్లోబ‌ల్ వార్మింగ్ కాలంలోనూ చ‌ల్ల‌బ‌డుతున్న హిమాల‌యాలు.. ఎంత మేర ఉప‌యోగం?

భూ తాపం పెరిగిపోయి ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరుకుంటున్న త‌రుణంలో మంచు కొండ‌ల‌న్నీ కరిగిపోతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే

  • Publish Date - December 13, 2023 / 09:39 AM IST

భూ తాపం (Global Warming) పెరిగిపోయి ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరుకుంటున్న త‌రుణంలో మంచు కొండ‌ల‌న్నీ కరిగిపోతున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఆశ్చ‌ర్య‌క‌రంగా భార‌త ఉప‌ఖండంలో ఉన్న హిమాల‌యాలు (Himalayas) ఈ స‌మ‌యంలోనూ మ‌రింత శీత‌లంగా మారుతున్నాయ‌ని ఒక అధ్య‌య‌నం వెల్ల‌డించింది. ఈ ప‌రిణామానికి కార‌ణం కాటాబాటిక్ అనే గాలులేన‌ని ప‌రిశోధ‌కులు పేర్కొన్నారు. ఈ అధ్య‌య‌నం వివ‌రాల‌ను నేచ‌ర్ జియో సైన్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు.


ఎవ‌రెస్టు ప‌ర్వ‌తం మీద‌నున్న పిర‌మిడ్ ఇంట‌ర్నేష‌న‌ల్ లేబ‌రేట‌రీ సేక‌రించిన స‌మాచారం ఆధారంగా ఈ విశ్లేష‌ణ‌ను చేసిన‌ట్లు గ్లేషియాల‌జీ ప్రొఫెస‌ర్ ఫ్రానెస్కా పెలిసియోటీ పేర్కొన్నారు. హిమాల‌యాల పై నుంచి వెళ్లే గాలి అత్యంత వేడిగా ఉంటుండ‌గా.. ఆ ప‌ర్వ‌త సానువుల‌ను తాకుతూ ప్ర‌వ‌హించే వాయు త‌రంగాలు శీత‌లంగా ఉంటున్నాయి. ఆశ్చ‌ర్య‌క‌రంగా ఈ రెండింటి మ‌ధ్య ఉష్ణ మార్పిడి జ‌రిగి త‌ద్వారా హిమాల‌యాలు మ‌రింత శీత‌లంగా మారుతున్నాయి. ఈ గాలుల‌నే కాటాబాటిక్ గాలుల‌ని శాస్త్రవేత్త‌లు పిలుస్తున్నారు. వేడి గాలులు శీత‌లంగా మారే కొద్దీ బ‌రువుగా మారి ప‌ర్వ‌తాల‌పై వాల‌తాయి.


దీని వ‌ల్లే ఉష్ణోగ్ర‌త‌లు అదుపులో ఉంటున్న‌ట్లు ఈ అధ్య‌య‌నంలో పేర్కొన్నారు. ఈ ప్ర‌క్రియ వ‌ల్ల హిమాల‌యాల్లో వాతావ‌ర‌ణ మార్పుల దుష్ప‌రిణామాలు అంత‌గా క‌నిపించ‌కపోయినా..ఇది ఎంత కాలం ఉంటుందో చెప్ప‌లేమ‌ని ఫ్రానెస్కా అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే ఈ అధ్య‌య‌నం మాత్రం వాతావ‌ర‌ణ మార్పుల కోణంలో అత్యంత ముఖ్య‌మైన‌దేన‌ని చెప్పారు. 16 దేశాల్లోని 200 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు జీవ‌నాధార‌మైన న‌దుల‌కు హిమాల‌యాలు జ‌న్మ స్థాన‌మ‌ని.. కాబ‌ట్టి ఇక్క‌డే జరిగే ప‌రిణామాల‌కు అత్యంత ప్రాధాన్యం ఉంటుంద‌ని అన్నారు.


ప్ర‌మాదంలో హిమాల‌యాలు


హిమాలయాల్లో ప్ర‌స్తుతం క‌న‌ప‌డుతున్న ఈ పోక‌డ‌.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న గ్లేషియ‌ర్‌ల క్షీణ‌త‌ను అడ్డుకోలేద‌ని శాస్త్రవేత్త‌లు హెచ్చ‌రిస్తున్నారు. జూన్‌లో వెలువ‌డిన నివేదిక ప్ర‌కారం.. 2010లో హిమాల‌యాలు క్షీణించిన దానికంటే 65 శాతం ఎక్కువ‌గా ప్ర‌స్తుతం క‌రిగిపోతున్నాయ‌ని తేలింది. ఈ త‌గ్గుద‌ల ఇప్ప‌ల్లో ఆగేలా కూడా క‌నిపించ‌డం లేద‌ని ఆ నివేదికలో శాస్త్రవేత్త‌లు పేర్కొన్నారు. ప్ర‌స్తుత అధ్య‌య‌నం పేర్కొన్న అద్భుతం తాత్కాలికం, పూర్తిగా స్థానిక‌మేన‌ని.. ఇది ఏవిధంగా పూర్తి సానుకూల ఫ‌లితాలు ఇవ్వ‌ద‌ని ప‌ర్యావ‌ర‌ణ వేత్త థామ‌స్ షా అన్నారు.

Latest News