విధాత: పిసిసిచీఫ్ రేవంత్ రెడ్డి నాయకత్వం పట్ల కాంగ్రెస్ సీనియర్లు భగ్గుమన్నారు. శనివారం హైదరాబాదులో సిఎల్పీ నేత భట్టి విక్రమార్క నివాసంలో సీనియర్లు పిసిసి మాజీచీఫ్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, విక్రమార్క, దామోదర్ రాజనర్సింహ, మధు యాష్కి, జగ్గారెడ్డి, కోదండ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, ప్రేమ సాగర్ రావు సమావేశమయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ల ఈ భేటీ రేవంత్ రెడ్డి పార్టీని నడిపిస్తున్న తీరు పట్ల తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తూ సాగింది. భేటీ అనంతరం ఉత్తమ్, భట్టి, రాజనర్సింహ, యాష్కీ విలేకరులకు తమ భేటీ చర్చల వివరాలను వెల్లడించారు.
సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకెళ్లాలని తామంతా నిర్ణయించామని, ఇటీవల రేవంత్ రెడ్డి ప్రకటించిన పిసిసి కార్యవర్గ రాజకీయ వ్యవహారాల కమిటీలో 108 మందిలో 50 శాతం మంది టీడీపీ నుండి వలస వచ్చిన నాయకులకే స్థానం కల్పించి పార్టీలో ఏళ్ల తరబడిగా పని చేస్తున్న సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు అవకాశం కల్పించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ వేసిన కమిటీలో సీనియర్లకు జరిగిన అన్యాయాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలిపారు. కాంగ్రెస్ ప్రజాస్వామ్య పార్టీ అని కాంగ్రెస్‌లో పుట్టిన తాము కాంగ్రెస్ లోనే చస్తామన్నారు. వలసవాదులు ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ ను నాశనం చేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ గెలిచే నియోజకవర్గంలో ఏకాభిప్రాయం లేదంటూ డీసీసీ అధ్యక్షులను నియమించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ సీనియర్లుగా నిజమైన పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరగకుండా, అలాగే కాంగ్రెస్ పార్టీని రక్షించాల్సిన బాధ్యత సీనియర్లుగా తమపై ఉందన్నారు.
తమ పంచాయతీ పార్టీలోని టీడీపీ వలస వాదులతో మాత్రమే అన్నారు. సీనియర్లను కోవర్టులుగా ప్రచారం చేయడం ఆవేదన కలిగిస్తుంది అన్నారు. రేవంత్ ఏర్పాటు చేసిన సునీల్ కనుగోలు సోషల్ మీడియా తమ పైన కూడా తప్పుల ప్రచారం చేస్తున్నట్లుగా సిపి ఆనంద్ చెప్పడం జరిగిందన్నారు. ఇదంతా చూస్తుంటే కావాలనే కాంగ్రెస్ సీనియర్లను కించపరిచే కుట్ర సాగుతున్నట్లుగా భావిస్తున్నామన్నారు.
ప్రస్తుతం పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాదులకు.. వలసవాదులకు మధ్య ఫైట్ సాగుతున్న వాతావరణం నెలకొందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వలసవాద నాయకత్వంతో బలహీనపడుతుంటే ఢిల్లీ అధిష్టానం ఎందుకు చోద్యం చూస్తుందో అర్థం కావడంలేదని వాపోయారు.
రేవంత్ వైఖరి మాత్రం కాంగ్రెస్ సీనియర్లే పార్టీని నాశనం చేస్తున్నారన్నట్లుగా ఉందని, ఈ పరిస్థితులను సమీక్షించుకొని కాంగ్రెస్‌ను రక్షించుకునేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా మరోసారి భేటీ అవుతాం అన్నారు.
కాగా కాంగ్రెస్ మరో సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి , ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజా పరిణామాల పై భట్టి విక్రమార్క కు ఫోన్ చేసి సీనియర్ల సమావేశానికి, నిర్ణయాలకు తమ మద్దతును తెలపడం మరింత ఆసక్తికరంగా మారింది. సీనియర్లు ఏ నిర్ణయం తీసుకున్నా తాను మద్దతుగా ఉంటానని వెంకట్‌రెడ్డి ప్రకటించడం విశేషం.