సెంటి’మంట’ల్లో ఓట్ల పంటకు నాయ‌కులు స‌న్న‌ద్ధం

మలుపు తిప్పిన 'నర్సంపేట' తెరపైకి సమైక్య, తెలంగాణ వాదం సజ్జల ఎంట్రీతో రసవత్తరం ఎన్నికలకు ముందస్తు ఎత్తుగడలు విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్నాయంటే రాజకీయ పార్టీలు పాత ఎత్తుగడలను పాతరేసి కొత్తవ్యూహాలను ఎజెండాపైకి తెచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటీవల ఈ ట్రెండు దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వేదికగా చేసుకొని మరొకసారి ఎన్నికలకు ముందస్తుగా సెంటిమెంటు మంటలు రేగొట్టేందుకు రాజకీయ వర్గాలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం […]

  • Publish Date - December 9, 2022 / 10:51 AM IST
  • మలుపు తిప్పిన ‘నర్సంపేట’
  • తెరపైకి సమైక్య, తెలంగాణ వాదం
  • సజ్జల ఎంట్రీతో రసవత్తరం
  • ఎన్నికలకు ముందస్తు ఎత్తుగడలు

విధాత, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు సమీపిస్తున్నాయంటే రాజకీయ పార్టీలు పాత ఎత్తుగడలను పాతరేసి కొత్తవ్యూహాలను ఎజెండాపైకి తెచ్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. ఇటీవల ఈ ట్రెండు దేశవ్యాప్తంగా మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వేదికగా చేసుకొని మరొకసారి ఎన్నికలకు ముందస్తుగా సెంటిమెంటు మంటలు రేగొట్టేందుకు రాజకీయ వర్గాలు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (తాజాగా బీఆర్ఎస్) ఈ కార్యక్రమానికి ముందుగా శ్రీకారం చుట్టింది.

టీఆర్ఎస్ పన్నిన ఉచ్చులో బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు చిక్కుకున్నాయా? లేక టీఆర్‌ఎస్‌కు సెంటి మెంట్ దక్కకుండా చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయనేదీ ఇప్పుడే చెప్పలేము. అయితే ఇదే సమయంలో తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా సమైక్య నినాదాన్ని ముందుకు తేవడంతో రచ్చ రసవత్తరంగా మారింది.

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల మరో అడుగు ముందుకు వేసి ‘సమైక్య ఆంధ్రప్రదేశ్’ వాదాన్ని మరోసారి తెరపైకి తెచ్చి టీఆర్ఎస్ సెంటి’మంటల’కు వైయస్సార్సీపీ ఆజ్యం పోసి అగ్గి మంటలను పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తుంది. నిన్నటి సజ్జల వ్యాఖ్యలతో టీఆర్ఎస్ శ్రేణులు, నాయకులు, ప్రజా ప్రతినిధులు భగ్గుమంటున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అక్కడ వైయస్సార్సీపీ ఈ మంటల్లో కాగుతూ వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు ప్రయత్నించడం గమనార్హం.

ఎన్నికల్లో లాభమే ఏకైక లక్ష్యం

రాష్ట్రంలో కొద్దికాలంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ముందస్తుగా వీటికి ప్రణాళిక బద్ధంగా తెరతీసినట్లు భావించాలి. ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో ఈ అస్త్రాలను తమకనుకూలంగా ఉపయోగించేందుకు ఎప్పుడూ ప్రయత్నిస్తున్నారు. ముందస్తుగా ఈ ఆయుధాలను ప్రచారంలో పెట్టేందుకు రకరకాల కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ముందు పెద్ద పీటవేసి ఊదరగొడుతున్నారు. ఇంకోవైపు సెంటిమెంట్ ప్రయోగిస్తున్నారు.

వరంగల్ కేంద్రంగా మలుపు

తెలంగాణవాదం, సమైక్యవాదం సెంటిమెంట్ల మొత్తం ఎపిసోడ్లో వరంగల్ జిల్లా నర్సంపేట ఒక మలుపు కేంద్రంగా మారడం విశేషం. ఇటీవల షర్మిల పాదయాత్ర నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలు ఈ వ్యవహారాన్ని మరింత తీవ్రం చేశాయి.

షర్మిల పాదయాత్ర పై భగ్గుమంటున్న టీఆర్ఎస్ ఆమెకు మద్దతు తెలిపిన బీజేపీ పై కూడా పనిలో పనిగా విమర్శలు ఎక్కుపెట్టారు. వైయస్సార్సీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల తీరును గతంలోనే తీవ్రంగా వ్యతిరేకించారు.

వ్యూహాత్మకంగా కేసీఆర్‌ ప్రయత్నం

గత కొంతకాలంగా కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో పడిపోయిన తమ గ్రాఫ్ ను సెంటిమెంటును తిరిగి రెచ్చగొట్టి తామే తెలంగాణ వాదానికి ఏకైక వారసులుగా ప్రకటించుకునేందుకు మరింత తాపత్రయ పడుతున్నారు. దీనికి రెండు కారణాలను పరిశీలకులు చెబుతున్నారు.

ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిన తెలంగాణ సెంటిమెంట్ ముచ్చటగా మూడోసారి పనిచేస్తుందా లేదా అని అనుమానం ఉన్నది. ఈ నేపథ్యంలో తమ వంతు ప్రయత్నాలు చేస్తూ తామే తెలంగాణ వాదానికి ఏకైక వారసులుగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు కేసీఆర్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ నేపథ్యంలో…

రెండోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఆ పార్టీ పేరును బీఆర్ఎస్ గా మార్చినందున ఎక్కడ తాము తెలంగాణ సెంటిమెంటుకు దూరమవుతామేమోనని అనుమానం నెలకొంది. దీనికి ప్రతిపక్ష పార్టీలు కూడా టీఆర్ఎస్ ఇక తెలంగాణ వాదానికి ఏ మాత్రం ప్రతినిధి కాదని విమర్శలు ఎక్కుపెట్టారు.

ఈ రెండు కారణాల రీత్యా ఇటీవల గులాబీ నాయకుల నోటి వెంట తెలంగాణ వాదం పదపదే వినిపించింది. ఉద్యమానికి తామే ప్రతినిధులమనే ఢంకా బజాయించుకుంటున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో సైతం దీన్ని ఒక అస్త్రంగా ప్రయోగించి కొంతమేరకు విజయవంతమయ్యారు. రానున్న ఎన్నికల నాటికి తెలంగాణలో సెంటిమెంటును పెంచి తగ్గుతున్న తమ చరిష్మా కాపాడుకునేందుకు దీన్నొక అవకాశం గా భావిస్తున్నారు.

సెంటిమెంట్ ఫలిస్తుందా?

రాష్ట్ర విభజన అనంతరం రెండు టర్మ్‌లు పూర్తయిన నేపథ్యంలో ఈ సెంటిమెంట్ ఇప్పుడు పని చేస్తుందా? అనే అనుమానం మాత్రం సర్వత్ర వ్యక్తం అవుతుంది. టీఆర్ఎస్, వైయస్సార్సీపీల‌ ప్రయత్నం వృథా ప్రయాసగా కొందరు అభివర్ణిస్తున్నారు. మరికొందరు మాత్రం ఏ మాత్రం లాభం చేకూరినా చాలనే అభిప్రాయంతో ఈ రెండు పార్టీలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

అయితే తెలంగాణ సమైక్యాంధ్ర సెంటిమెంటులను ఈ రెండు పార్టీలకు రాకుండా ప్రత్యర్థి పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఆంధ్రాలో వైయస్సార్సీపీ ఈ సెంటిమెంట్లకు ఇక ఏమాత్రం ప్రతినిధులు కాదని విమర్శిస్తున్నారు.

షర్మిల పాదయాత్ర నేపథ్యం

షర్మిల పాదయాత్ర నేపథ్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట ప్రాంతంలో ఇటీవల జరిగిన సంఘటనలు గుణాత్మక పరిణామంగా భావిస్తున్నారు. తెలంగాణలో తమ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద పార్టీ ఏర్పాటు చేసి తెలంగాణ అంతట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

ఆ పార్టీ అధినేత్రి షర్మిల నర్సంపేటలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత దూషణల నేపథ్యంలో స్థానికంగా నెలకొన్న హైడ్రామా సెంటిమెంట్ అస్త్ర ప్రయోగంలో భాగమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రమంతా ఇదే విమర్శలు, ఆరోపణలు చేసినప్పటికీ ఎక్కడా ఈ స్థాయి నిరసన వ్యక్తం కాలేదు.

ఈ నిరసన షర్మిల అరెస్ట్, విడుదల అనంతరం ఆమె తిరిగి పాదయాత్ర చేసేందుకు చేసిన ప్రయత్నాలకు చెక్‌పెడుతున్నారు. పైగా షర్మిల బీజేపీ వదిలిన బాణమని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సజ్జల వ్యాఖ్యలతో గులాబీలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది వైయస్సార్సీపీ, టీఆర్‌ఎస్‌ మధ్య ఐక్యతా, ఘర్షణా అనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు.

సజ్జల మీద భగ్గుమన్న గులాబీలు

సజ్జల వ్యాఖ్యల నేపథ్యంలో ఎమ్మెల్యేలు తీవ్రంగా ప్రతిస్పందించారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మరోసారి కాలరాచేందుకు సమైక్యవాదులు కుట్ర చేస్తున్నారని దానికి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న బీజేపీ సహకరిస్తుందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

కేసీఆర్ పాలన అంతం, ప్రభుత్వ అస్థిరతే సమైక్యవాదుల లక్ష్యమని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటు మళ్లీ ఏపీ తెలంగాణను కలిపే కుట్ర జరుగుతోందని, షర్మిల పాదయాత్ర తర్వాత అనేక పరిణామాలకు ఇదే నిదర్శనమన్నారు. సమైక్యవాదుల కుట్రకు బీజేపీ మద్దతు బయట పడుతోందన్నారు.

షర్మిలకు సజ్జల, బీజేపీ, చంద్రబాబు మద్దతు పలకడం కుట్రలో భాగమని అంటున్నారు. ప్రధాని మోదీ షర్మిలతో మాట్లాడారనే వార్తలు కుట్రలు రుజువు చేస్తున్నాయనీ, ఆంధ్ర నేతలు కేఏ పాల్, వైఎస్ షర్మిల, చంద్రబాబు తెలంగాణలో మకాం వేస్తూ వివిధ రూపాల్లో పథక రచన చేస్తున్నారని విమర్శించారు.

కథ స్క్రీన్ ప్లే మోడీ, అమిత్ షాలే

తెలంగాణ విఫల ప్రయత్నంగా చెప్పే కుట్రకు కథ స్క్రీన్ ప్లే మోడీ, అమిత్ షాలేననీ బీజేపీ కేంద్ర ప్రభుత్వ డైరెక్షన్‌లోనే ఏపీ పార్టీల సమైక్య రాగమన్నారు. వారి జెండాలు వేరైనా ఎజెండా మాత్రం ఒక్కటేననీ ఎన్ని బాణాలు ఎదురైనా తెలంగాణ ఆత్మబలం ముందు తక్కువన్నారు. తెలంగాణ సమాజం మరోసారి సమైక్యాంధ్ర కుట్రలను తిప్పుకోవాల్సిన అవసరం అనివార్యం అవుతోందన్నారు.

అందుకే తెలంగాణ వాదులుగా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ఉనికిని కాపాడుకోవాలంటే దానికి టీఆర్ఎస్ ఒక్కటే ఛాంపియన్‌గా ఉంటుందని సెంట్‌ మంటలు రేగోట్టేందుకు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే సజ్జల వ్యాఖ్యలపై వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చీప్‌విప్ వినయ్‌భాస్కర్,నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి తీవ్రంగా విరుచుకు పడ్డారు.