భారీగా పెరుగుతున్న కరోనా కేసులు.. లాక్‌డౌన్‌ దిశగా సింగపూర్‌..!

మొన్నటి వరకు శాంతించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇటీవల పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.

  • Publish Date - December 19, 2023 / 06:06 AM IST

Singapore | మొన్నటి వరకు శాంతించిన కరోనా మహమ్మారి మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఇటీవల పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ముఖ్యంగా సింగపూర్‌లో ఒకే వారంలో 56వేలకుపైగా కరోనా కేసులు రికార్డయ్యాయి. గతవారంతో పోలిస్తే 75శాతం కేసులు పెరిగాయి. డిసెంబర్‌ 3 నుంచి 9 మధ్య వారంలో 56,043 కొత్త కేసులు నమోదయ్యాయని సింగపూర్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.


ఈ క్రమంలో పౌరులకు అడ్వైజరీని జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌ను తప్పనిసరి చేసింది. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల్లో పడకల సంఖ్యను పెంచేందుకు సింగపూర్‌ ఎక్స్‌పో హాల్‌ 10లో రెండో కొవిడ్‌ చికిత్సల కోసం ఏర్పాట్లు చేయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. అయితే, కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో అరికట్టేందుకు సింగపూర్‌లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ విధించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అయితే, ప్రభుత్వం వైరస్‌కు వ్యతిరేకంగా ప్రజలుకు టీకాలు వేయాలని సూచించింది. ప్రాణాంతక వైరస్‌ నుంచి టీకాలు తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


మలేషియాలో 20వేల కేసులు..


మలేషియాలోనూ కొవిడ్‌ విజృంభిస్తున్నది. డిసెంబర్‌ 10-16 మధ్య మలేషియాలో 20,696 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ విధించనున్నారని ప్రచారం జరిగింది. అయితే, ఆరోగ్య మంత్రి డుల్కెఫ్లీ అహ్మద్ సోమవారం లాక్‌డౌన్ ఊహాగానాలను తోసిపుచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఎలాంటి భారం పడదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అయితే, ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లుగా ది స్ట్రెయిట్స్‌ టైమ్స్‌ తెలిపింది.