Smartphone Exports | స్మార్ట్‌ఫోన్ల ఎగుమతిలో భారత్‌ జోరు.. అమెరికాకు 254శాతం పెరిగిన ఎక్స్‌పోర్ట్స్‌..!

  • Publish Date - March 18, 2024 / 03:28 AM IST

Smartphone Exports | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో అంటే ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారత్ నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 253.70 శాతం పెరిగి 3.53 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో చైనా, వియత్నాం తర్వాత అమెరికాకు అత్యధికంగా స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతి చేసే దేశంగా భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ సమయంలో చైనా, వియత్నాం దేశాల నుంచి ఎగుమతులు తగ్గుముఖం పట్టడం గమనార్హం. 2022-23 ఇదే కాలంలో భారత్ కేవలం 998 మిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను అమెరికాకు విక్రయించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. 2023-24 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో భారతదేశం వాటా 7.76 శాతానికి పెరిగింది. 2022-23 ఇదే కాలంలో ఇది రెండు శాతం.

డేటా ప్రకారం.. ఈ కాలంలో అమెరికాకు చైనా స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 38.26 బిలియన్ డాలర్ల నుంచి 35.1 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వియత్నాం నుంచి ఎగుమతులు కూడా 9.36 బిలియన్ల నుంచి 5.47 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. స్మార్ట్‌ఫోన్‌ల ఉత్పత్తికి భారతదేశం ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని, దాంతో స్మార్ట్‌ఫోన్ తయారీలో పెరుగుదల ఎగుమతుల పెరుగుదలకు తీసిందని ఓ అధికారి తెలిపారు. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీమ్‌ను ప్రకటించడం.. అమెరికన్ కంపెనీ ఆపిల్ భారతదేశంలో ఐఫోన్ తయారీని ప్రారంభించడం కూడా ఎగుమతులను పెంచడంలో సహాయపడిందని చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో టాప్-5 సరఫరాదారుల నుంచి అమెరికాకు స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు 45.1 బిలియన్లకు తగ్గాయి.

2022-23 ఇదే కాలంలో ఈ దేశాలు 49.1 బిలియన్ డాలర్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను అమెరికాకు ఎగుమతి చేశాయి. అమెరికాకు టాప్‌-5 సరఫరాదారుల జాబితాల్లో భారత్‌, చైనా, వియత్నాం, దక్షిణ కొరియా, హాంకాంగ్‌ ఉన్నాయి. దక్షిణ కొరియా నుంచి అమెరికాకు ఎగుమతులు 858 మిలియన్ల నుంచి 432 మిలియన్లకు తగ్గాయి. హాంకాంగ్ నుంచి ఎగుమతులు 132 మిలియన్ల నుంచి 112 మిలియన్ డాలర్లకు పడిపోయాయి. 2022-23లో స్మార్ట్‌ఫోన్ ఎగుమతి రంగంలో భారతదేశం తన ఉనికిని చాటుకుంటున్నది. ఈ కాలంలో దేశం నుంచి ఎగుమతులు 10.95 బిలియన్లకు పెరిగాయి. భారతదేశం 2023-24 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ప్రపంచానికి 10.5 బిలియన్ల విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసింది.

Latest News