ఊహకు అందని రీతిలో.. APలో రిపోర్ట్ చేసిన సోమేశ్ కుమార్

విధాత: ఆంధ్ర తెలంగాణ ప్రజల ఊహలకు అందని పరిణామం ఇది. ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసిన అధికారి పక్క రాష్ట్రానికి వెళ్లి అంతకన్నా దిగువ స్థాయిలో పని చేస్తారా…తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని శాసించి, మంత్రులకన్న అధిక శక్తిమంతుడిగా అధికారాన్ని చెలాయించిన సోమేశ్ కుమార్ కోర్టు తీర్పుతో బలవంతంగా ఆంధ్ర క్యాడర్ కు రావాల్సి వచ్చింది. అసలాయన వస్తారా.. రారా.. అట్నుంచటే స్వచ్చంద పదవీ విరమణ చేస్తారా అనే ఊహాగానాలు వచ్చాయి. దాదాపు పది నెలల సర్వీస్ […]

  • Publish Date - January 12, 2023 / 08:15 AM IST

విధాత: ఆంధ్ర తెలంగాణ ప్రజల ఊహలకు అందని పరిణామం ఇది. ఒక రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసిన అధికారి పక్క రాష్ట్రానికి వెళ్లి అంతకన్నా దిగువ స్థాయిలో పని చేస్తారా…తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని శాసించి, మంత్రులకన్న అధిక శక్తిమంతుడిగా అధికారాన్ని చెలాయించిన సోమేశ్ కుమార్ కోర్టు తీర్పుతో
బలవంతంగా ఆంధ్ర క్యాడర్ కు రావాల్సి వచ్చింది.

అసలాయన వస్తారా.. రారా.. అట్నుంచటే స్వచ్చంద పదవీ విరమణ చేస్తారా అనే ఊహాగానాలు వచ్చాయి. దాదాపు పది నెలల సర్వీస్ ఉన్న ఆయన కేసీఆర్‌కు బాగా సన్నిహితుడిగా వెలుగు వెలిగారు. అదే తరుణంలో రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను చిన్నచూపు చూసేవారని, కలెక్టర్లు కూడా ఆయన దృష్టిలో చిన్న ఉద్యోగే అనే స్థాయిలో వ్యవహరించారు. మంత్రులకు సైతం ఆయన సమాధానం చెప్పే స్థితి ఉండేది కాదు.

ముఖ్యంగా ఆంధ్ర నుంచి విభజనలో భాగంగా తెలంగాణకు వెళ్లిన పలు శాఖల అధికారులను ఆయన దాదాపు రెండేళ్లపాటు పొష్టింగులు ఇవ్వకుండా వేధించారనే అభియోగలున్నాయి. అప్పట్లో ఆయన ఏది చేసినా కాదనేవారు లేరు. అలాంటి రాజసం వెలగబెట్టిన ఆయన మొత్తానికి అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ గురువారం ఏపీ సీఎస్‌ జవహర్‌రెడ్డిని కలిసి జాయినింగ్‌కు రిపోర్ట్ ఇచ్చారు. అనంతరం సీఎం జగన్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

తెలంగాణలో సోమేశ్‌కుమార్‌ కొనసాగింపును ఇటీవల హైకోర్టు కొట్టేసింది. విభజన సమయంలో ఆయన్ను ఏపీకి కేంద్ర ప్రభుత్వం కేటాయించగా కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) తెలంగాణకు మార్చింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం 2017లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దానిపై విచారణ జరిపిన న్యాయస్థానం క్యాట్‌ ఉత్తర్వులను కొట్టేసి సోమేశ్‌కుమార్‌ ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించింది. ఆ తీర్పు వచ్చిన గంటల వ్యవధిలోనే కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలోనే సోమేశ్‌కుమార్ ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేశారు. తనకు అప్పగించే బాధ్యతల్లో కొనసాగాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సోమేశ్‌కుమార్ స్థానంలో తెలంగాణ కొత్త సీఎస్‌గా శాంతికుమారిని నియమించిన విషయం తెలిసిందే. ఆయన్ను ఢిల్లీలో బీఆర్ఎస్ వ్యవహారాలు చూసుకుని, నార్త్ ఇండియా నాయకులతో వ్యవహారాలు, సఖ్యత నడిపే బాధ్యతలో కేసీఆర్ నియమిస్తారని పుకార్లు వచ్చాయ్.

మున్ముందు ఏమవుతుందో కానీ ఇప్పటికైతే ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో విధుల్లో చేరారు. ఆయనకు ఏయే శాఖలు అప్పగిస్తారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. తెలంగాణలో సింగిల్ హ్యాండెడ్ గా మొత్తం పాలనా వ్యవస్థను శాసించిన సోమేశ్ కుమార్ ఇక్కడ వేరే చిన్న పోస్టులో ఇమడగలరా అనే సందేహాలున్నాయ్.