విధాత: టీఆర్‌ఎస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని.. ఒకరినొకరు విమర్శలు చేసుకుంటున్నట్లు నటిస్తున్నాయని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నిన్న కేటీఆర్ మాపై ఈడీ, సీబీఐ మావెంట పడుతున్నాయని, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెబుతూ ప్రజల్లో టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య వార్ నడుస్తున్నట్లు క్రియేట్ చేస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ దోపిడీపై మాట్లాడుతున్నారని, టీఆర్‌ఎస్ నేతలేమో కేంద్రం రాష్ట్రంపై చిన్న చూపు చూస్తోందని చెబుతున్నారన్నారు.
వెస్ట్ బెంగాల్‌లో మళ్లీ టీఎంసీ గెలవడానికి కారణం పీకే వ్యూహమే అని, మమత, మోడీల మధ్య చక్రం తిప్పింది కూడా పీకేనే అని, తెలంగాణలో కూడా కేసీఆర్, మోడీల మధ్య పీకే ఉండి నడిపిస్తున్నాడని అన్నారు. నిన్న కేటీఆర్ మాటలు కూడా మోడీకి అనుకూలంగానే ఉన్నాయని, కాంగ్రెస్ బలహీన పడింది అంటే మోడీ బలవంతుడు అన్నట్లేగా? భారత్ జోడో పై కామెంట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య అంతర్గత ఒప్పందం ఉందని, విభేదాలు లేవని అన్నారు.
ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల కిందకే వస్తారని, ప్రభుత్వ ఉద్యోగులు.. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయరాదని అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు సర్కార్ నుంచి జీతం తీసుకుంటూ.. మళ్లీ పబ్లిక్ నుంచి వసూలు చేయరాదని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ రూ.20 వేలకంటే ఎక్కువ నగదు తీసుకోరాదని, కేంద్ర ఎన్నికల సంఘానికి ఏటా లెక్కలు చూపించాల్సి ఉంటుందని కానీ 2017 ఏప్రిల్‌లో బంగారు కూలీ పేరుతో, ఇతరత్రా వసూలు చేసిన చందాలను, నిధులను, ఖర్చులను కేంద్ర ఎన్నికల సంఘానికి చూపించకుండా టీఆర్‌ఎస్ మోసం చేసిందన్నారు.
అవినీతి నిరోధక శాఖ ఇది మా పరిధిలోకి రాదన్నారని, ఈ విషయమై ఢిల్లీ హైకోర్టులో పబ్లిక్ లిటికేషన్ కింద కేసు వేశానన్నారు. వరంగల్‌లో 2017లో టీఆర్‌ఎస్ ఫ్లీనరీ కోసం బంగారు కూలీ, టీఆర్‌ఎస్ కూలీ నిర్వహించి, గులాబీ కూలీ పేరుతో వ్యాపారస్తులను టీఆర్‌ఎస్ లీడర్లు వేధించి వందలాది కోట్లు వసూలు చేశారన్నారు. కానీ పార్టీ కోసమే నిధులు వసూలు చేసినట్లు ఏపీ ఏసీబీ హైకోర్టుకు చూపించారని అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేయలేమని 2019లో సీబీడీటీకి లేఖ రాసిందని, నేనూ పంపిన లేఖతో సహా విచారణ చేపట్టాలని సీబీడీటీ ఛైర్మన్‌ను కోరామన్నారు. ఈ విషయమై నేను ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని ఇకనైనా వారు విచారణ చేయించాలని కోరారు.
నేను పిర్యాదు చేసి ఐదేండ్లవుతుందని, ఎన్నికల సంఘానికి సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరుగుతున్న ఆర్థిక ఉగ్రవాది కేసీఆర్ అని రేవంత్ ఆరోపించారు. పార్టీని అడ్డు పెట్టుకొని వేల కోట్లు దోచుకుంటున్నాడని, ఎన్నికల సంఘం కూడా చర్య తీసుకోవడం లేదని.. విచారణ చేస్తే టీఆర్‌ఎస్ పార్టీ రద్దవుతుందన్నారు. కేంద్రం, ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్స్ ఇన్వాల్ కావాలని, మేము సీరియస్‌గా పోరాటం చేస్తున్నాం కాబట్టే త్వరలో టీఆర్‌ఎస్ రద్దయ్యే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ రద్దైతే పీడ విరగడ అవుతుందన్నారు.
ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ న్యాయ నిపుణులతో చర్చించి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తప్పించుకోడానికే కేసీఆర్ టీఆర్‌ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చాడని, అదే జెండాతో పార్టీ పేరు మార్చుకున్నా డని అన్నారు. బీజేపీ నాయకులు ఈ విషయంలో ఎందుకు మాట్లాడడం లేదని, ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చినా.. దానిపై ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు.
నా పిటిషన్‌పై విచారణ చేపట్టే వరకు టీఆర్‌ఎస్ పేరు మార్చడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతానన్నారు. టీఆర్‌ఎస్ రద్దయ్యే వరకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. టీఆర్‌ఎస్ ఫ్లోర్‌ను బీజేపీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది. త్వరలోనే రాజ్యసభ ఫ్లోర్ బీజేపీలో విలీనం కానున్నదని, అందుకే కేసీఆర్ తన పెట్టుబడి దారులనే రాజ్యసభకు పంపించాడని, రాజ్యసభకు వెళ్లిన వారిపై ఇన్‌కంటాక్స్ కేసులున్నాయని రేవంత్ ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు.కేటీఆర్ ఉదయం, సాయంత్రం వేరే పనిలో బిజీగా ఉంటారని.. ముందు అది చూసుకో కేటీఆర్ అని రేవంత్ సలహా ఇచ్చారు.
నేను గతంలో చెప్పినవన్నీ జరిగాయని.. అదే తరహాలో రాజ్యసభ ఫ్లోర్ విలీనం ఖాయమన్నారు. హ్యాపీ రావు నేతృత్వంలో విలీనానికి సిద్ధమైందని, ఒక్కరు తక్కువయ్యారని.. అతని కోసమే చర్చలు జరుగుతున్నాయని అన్నారు. ప్రగతి భవన్ కేంద్రంగానే జరుగుతున్నాయా.. అనే అనుమానం కూడా ఉందని పేర్కొన్నారు. బంగారు కూలీ విషయంలో బీజేపీ లీడర్లు, ఈటెల మాట్లాడాలని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.