" /> " /> " /> " />
విధాత: నైరుతి (Southwest) రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానున్నది. ఆదివారం నాటికి రుతుపవనాలు కేరళను తాకుతాయని భారత వాతావరణశాఖ తొలుత అంచనా వేసింది. కానీ, ఆదివారం కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకలేదు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను బట్టి రుతుపవనాలు వచ్చేందుకు మరో మూడు నాలుగు రోజుల సమయం పడుతుతుందని వాతావరణ నిపుణులు వెల్లడించారు.
“రుతుపవనాల ప్రవేశానికి అనుకూలంగా దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమర గాలులు వీస్తున్నప్పటికీ అవి మరింత బలపడాల్సి ఉన్నది. ఇంకా ఆగ్నేయ అరేబియా సముద్రంలో రుతుపవన మేఘాలు కమ్ముకున్నాయి. మరో మూడు నాలుగు రోజుల్లో రుతుపవన అనుకూల పరిస్థితులు మరింత మెరుగు పడతాయని తాము అంచనా వేస్తున్నాం” అని ఐఎండీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
మూడు రోజులు పొడి వాతావరణమే
రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా వచ్చే 4 8 గంటల పాటు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొన్నది. సోమవారం 34 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలతో 213 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని వెల్లడించింది. మంగళవారం తొమ్మిది మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 276 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని తెలిపింది.
కాగా.. అక్కడక్కడా ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నది. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆదివారం ఎండ మండిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సాయంత్రం హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ వానలు పడటంతో కొంత ఉపశమనం పొందారు.