విధాత: ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీబీఐ మరోసారి రంగంలోకి దిగింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా సాగుతున్న విషయం విదితమే. తాజాగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సీబీఐ సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు తమ కార్యాలయానికి రావాలని సమన్లలో పేర్కొన్నది.
దీనిపై స్పందించిన సిసోడియా సీబీఐ దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే ఆయన నివాసంలో సోదాలు చేశారు. అయితే ఎలాంటి అధారాలు దొరకలేదని సిసోడియాతో పాటు ఆప్ నేతలు వెల్లడించారు.
ఎలాంటి ఆధారాలు లేకుండానే తనను ఎలా విచారణకు పిలుస్తారని ప్రశ్నించిన సిసోడియా అయినప్పటికీ విచారణకు వెళ్తానని తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానన్నారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి హైదరాబాద్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈకేసులో విజయ్ నాయర్, అభిశేక్ బోయినపల్లిలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.