Site icon vidhaatha

Supreme Court | టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ అజాహరుద్ధిన్‌కు సుప్రీం షాక్‌

Supreme Court

విధాత: టీమ్ ఇండియా కెప్టెన్ మహ్మద్ అజహరుద్ధిన్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ హైకోర్టు జారీ చేసిన కోర్టు ధిక్కరణ నోటీస్‌లను సవాల్ చేస్తు దాఖలు చేసిన పిటిషన్ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. హైద్రాబాద్ క్రికెట్ అసొసియేషన్ నిర్వహించే లీగ్ మ్యాచ్‌ల్లో పాల్గొనేందుకు తమను అనుమతించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా క్రికెట్ అసొసియేషన్ 2021లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం 2021-22 లీగ్ మ్యాచ్‌లకు ఎన్‌డీసీఏను అనుమతించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హెచ్‌సీఏ అనుబంధ జట్టుగా ఉన్న తమను భవిష్యత్ అన్ని సమావేశాలకు, మ్యాచ్‌లకు, టోర్నమెంట్‌లకు అనుమతించేలా హెచ్‌సీఏను, దాని అప్పటి అధ్యక్షుడు అజాహరుద్దిన్‌ను, బీసీసీఐని ఆదేశించాలని కోర్టును ఎన్‌డీసీఏ అభ్యర్ధించింది.

వాటిపై గత ఏడాది విచారణ చేసిన హైకోర్టు నల్లగొండ క్రికెట్ అసొసియేషన్‌కు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే ఈ ఆదేశాలను హెచ్‌సీఏ పాటించకపోవడాన్ని, తమ ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ కు అజహరుద్ధిన్ అనుమతించకపోవడంపైన హైకోర్టులో ఎన్‌డీసీఏ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. దీనిపై హైకోర్టు అజహరుద్ధిన్‌కు కోర్టు ధిక్కరణ నోటీస్‌లు జారీ చేసింది.

అజహరుద్ధిన్ స్పందిస్తూ కోర్టు ఆదేశాలపై తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని జూన్ 23న కోర్టుకు తెలిపారు. సంతృప్తి చెందని హైకోర్టు ఆగస్టు 4న మరోసారి కోర్టుకు హాజరుకావాలని నోటీస్‌లు జారీ చేసింది. ఈ నోటీస్‌లపై అజహరుద్ధిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ప్రస్తుత దశలో ఆయన పిటిషన్ విచారణ అవసరం లేదంటూ తోసిపుచ్చింది.

Exit mobile version