- వేసవి సెలవుల తర్వాత తదుపరి విచారణ
- అప్పటిదాకా యథాతథ స్థితి కొనసాగుతుంది
- సర్వోన్నత న్యాయస్థానం వెల్లడి
విధాత: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (Telangana MLA Poaching case) విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. వేసవి సెలవుల తర్వాత విచారణ చేపడుతామని సుప్రీంకోర్టు (Supreme Court) ధర్మాసనం తెలిపింది. జూలై 31నుంచి ప్రారంభమయ్యే వారంలో మిస్‌లేనియస్ పిటిషన్ కింద విచారణ జరుపుతామన్నది. అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. సీబీఐ (CBI) విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ కేసులో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐకి విచారణ అప్పగించడంపై స్టే ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు పదే పదే కోరిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బే!
ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు వేసవి సెలవుల తర్వాత చేపడుతామని స్పష్టం చేసింది. మరోవైపు హైకోర్టు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించడం, దీన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం (Telangan State Government) సుప్రీంలో సవాల్ చేసి, దానిపై స్టే ఇవ్వాలని కోరినా నిరాకరించింది. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌తో పాటు ఇతర ఆధారాలు తమకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ ఇప్పటికే అనేకసార్లు లేఖలు రాసింది. కానీ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేసు వేయడంతో ఒత్తిడి చేయలేదు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వమని, అప్పటివరకు యథాతథ స్థితి కొనసాగుతుందని సుప్రీం ధర్మాసనం పేర్కొనడం రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బగానే భావించాలని పరిశీలకులు అంటున్నారు.