న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల పేరిట అన్ని రాజకీయ పార్టీలు సెప్టెంబర్ 30వ తేదీ వరకూ సేకరించిన విరాళాల వివరాలను సమర్పించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ వివరాలను సీల్డ్‌కవర్‌లో కోర్టు రిజిస్ట్రీకి అందించాలని సూచించింది. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై విచారిస్తున్న కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకూ వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల పేరిట అందిన విరాళాల వివరాలు ఎన్నికల కమిషన్ వద్ద లేకపోవడంపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఎలక్టోరల్ బాండ్ల నిధులపై ఎప్పటికప్పుడు వివరాలు కలిగి ఉండాలని 2019 ఏప్రిల్ 12న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వును ధర్మాసనం గుర్తు చేసింది. ఎన్నికల సంఘం తరఫున వాదించిన న్యాయవాది అమిత్ శర్మ.. 2019లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్ల వివరాల వరకూ మాత్రమే ఆ మధ్యంతర ఉత్తర్వు వర్తిస్తుందనే అభిప్రాయంతో ఈసీ ఉన్నదని కోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. వివరాలను నిరంతరాయంగా సేకరించి ఉంచాలని ఆ ఉత్తర్వు స్పష్టంగా పేర్కొంటున్నదని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. సందేహాలు ఉంటే కోర్టు నుంచి వివరణ కోరి ఉండాల్సిందని మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా చెప్పారు. కోర్టుకు వచ్చే సమయానికే మీరు ఆ డాటాను సేకరించి ఉండాల్సిందని అన్నారు.
ఈ మేరకు ఆ రోజు ఉత్తర్వులను చదివి వినిపించినట్టు గుర్తు చేశారు. మీరు ఆ వివరాలతో వస్తారని తామంతా భావించామని పేర్కొన్నారు. దాతల వివరాలను బయటపెట్టాలని తాము ఎస్‌బీఐని కోరబోవడం లేదని సీజేఐ స్పష్టం చేశారు. అందులో తమకెవరికీ ఆసక్తి లేదని తెలిపారు. కానీ.. ఎంత మొత్తంలో విరాళాలు అందాయో తెలుసుకోవాలని అనుకుంటున్నామని చెప్పారు. దీనిపై ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ఇప్పటి వరకూ అందిన విరాళాల వివరాలను కోర్టుకు సమర్పించేందుకు అంగీకరించారు. అదే సమయంలో 2019 ఏప్రిల్ వరకూ వివిధ రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అందిన వివరాలను కోర్టుకు అందజేశారు.
రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల పేరుతో అందుతున్న విరాళాల చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతున్నది. వీటి రూపంలో ఏ రాజకీయ పార్టీ అయినా గుప్త విరాళాలు పొందేందుకు అవకాశం ఉన్నది. దీనిని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారిస్తున్నది.