చలితోపాటు.. రాజకీయ వేడి!

పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ వేటు పడుతున్నది. దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 151 మందిని సస్పెండ్‌ చేసింది.

  • Publish Date - December 20, 2023 / 11:48 AM IST
  • జనవరిలో ఉధృతంగా ప్రచారపర్వం
  • నెల ముందే ఎన్నికలు జరిగే చాన్స్‌
  • ఇప్పటికే రసకందాయంలో రాజకీయం
  • వాడివేడిగా పార్లమెంటు సమావేశాలు
  • 143 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌
  • జనంలోకి వెళతామన్న ఇండియా నేతలు
  • ఉమ్మడి అభ్యర్థితోనే బీజేపీ దూకుడుకు చెక్‌
  • బీజేపీ ఓటమికి మమతా బెనర్జీ ఫార్ములా



(విధాత ప్రత్యేకం)

పార్లమెంటులో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్ష సభ్యుల సస్పెన్షన్‌ వేటు పడుతున్నది. మంగళవారం నాటికి దేశ చరిత్రలో గతంలో ఎన్నడూ లేనివిధంగా 151 మందిని సస్పెండ్‌ చేసింది. ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా చట్టసభలు జవాబుదారీగా పనిచేయాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. సంఖ్యా బలం ఉన్నది కదా అని ఎన్డీఏ ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తొమ్మిదిన్నరేళ్లకు పైగా చూస్తున్నదే.


పైకి తమకు తిరుగులేదు అనుకుంటూనే విపక్షాలు ఏకతాటిపైకి వస్తే ముప్పు తప్పదని గ్రహించే మోడీ ప్రభుత్వం పార్లమెంటులో విపక్ష ఎంపీలపై వేటు వేస్తున్నదనే విమర్శలున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో ఏం చేశారో చెప్పకుండా భావోద్వేగ అంశాలు, మత సంబంధ విషయాలపైనే మాట్లాడే బీజేపీ నేతలు దేశంలో సకల సమస్యలకు తొలి ప్రధాని నెహ్రూనే కారణం అన్నట్టు మాట్లాడుతుంటారు. కానీ నాడు పార్లమెంటులో విపక్ష సభ్యుల విమర్శలను, సూచనలను నెహ్రూ ఏ విధంగా స్వీకరించారో నాటి రికార్డులు చూస్తే అధికారపార్టీ నేతలకు అర్థమౌతుంది.


మోడీ నేతృత్వంలో భారత్‌ ప్రపంచ ఐదో ఆర్థికశక్తిగా అవతరించిందని, రానున్నరోజుల్లో 3వ స్థానానికి చేరుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది. సబ్‌ కా సాత్‌ సబ్‌ కా వికాస్‌ అని నినదించే కేంద్ర ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అంతరాలు పెరిగాయనే వాస్తవాన్ని విస్మరిస్తున్నది. ఆక్స్‌ఫామ్‌ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 84 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిపోయింది. ఇదే సమయంలో దేశంలోని బిలియనీర్ల ఆస్తులు రెండింతలకు పైగా పెరిగాయి.


సంపద కొద్ది మంది చేతిలోనే పోగుపడటం, దేశ ప్రజల్లో అత్యధికమంది కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉండిపోవడం దేనికి సంకేతం? 2021-22 మానవాభివృద్ధి సూచీలో 191 దేశాల్లో భారత్‌ 132వ స్థానానికే పరిమితమవడం దేశంలో నెలకొన్న పరిస్థితులకు అద్దం పడుతున్నది. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఉన్నడూ లేనివిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. మెజారిటీ ప్రజలు సంక్షోభంలో కూరుకుపోతున్నా పట్టించుకోని కేంద్రం కొంతమంది సంక్షేమం కోసం పనిచేస్తున్నదని విపక్షాలు చేస్తున్న విమర్శలు వాస్తవాలేనని ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.


కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలే అజెండాగా విపక్షాలు పార్లమెంటులో గళమెత్తుతున్నాయి. ప్రజల్లో వాటిని ఎండగట్టేందుకు ఐక్యమౌతున్నాయి. ఢిల్లీ వేదికగా 28 పార్టీలు మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు, ఉమ్మడి ప్రచారం, సీట్ల సర్దుబాటు, భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించాయి. సీట్ల సర్దుబాటుపై రాష్ట్ర స్థాయిలో చర్చించుకుని పరిష్కరించుకోవాలని, అక్కడ ఏమైనా సమస్యలు తలెత్తితేనే ఢిల్లీ స్థాయిలో నేతలు చర్చిస్తారని నేతలంతా సూత్రప్రాయంగా ఒక అంగీకరానికి వచ్చారు.


ఈ భేటీలోనే పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించిన ఫార్ములా అమలైతే కమలనాథులకు కష్టాలు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించే ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌, బెంగాల్‌లో తాను బాధ్యత తీసుకుంటామని, ఢిల్లీ, పంజాబ్‌లలో కేజ్రీవాల్‌ చూసుకుంటారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ బీజేపీతో పాటు ఇండియా కూటమిలో లేని ప్రాంతీయ పార్టీలతో నేరుగా తలపడే కర్ణాటక, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, హర్యానా, ఉత్తరాఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌ హిమాచల్‌ప్రదేశ్‌, అస్సాం, తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాల్లో సుమారు 300 సీట్లకు పోటీ చేయాలని సూచించారు.


మిగిలిన 243 స్థానాల్లో అంటే తమిళనాడు, బీహార్‌, మహారాష్ట్ర, బెంగాల్‌, జార్ఖండ్‌, కేరళ, జమ్ముకశ్మీర్‌లలో మిత్రపక్షాలతో సీట్లు సర్దుబాటు చేసుకుంటే ఓట్లు చీలిపోకుండా చూసుకుంటే కూటమి విజయానికి దోహదపడుతుందనేది ఆమె వాదన. కాంగ్రెస్‌ పార్టీ కూడా కూటమిలో సీట్ల సర్దుబాటు ఎంపీ ముకుల్ వాస్నిక్‌ కన్వీనర్‌గా ‘నేషనల్‌ అలయెన్స్‌ కమిటీ’ని ఏర్పాటు చేసింది. ఇవన్నీ మోడీ ప్రభుత్వాన్ని కలవరపెడుతున్నాయి. అందుకే విపక్ష పార్టీల ఐక్యతను దెబ్బతీయడానికి, పార్లమెంటులో వారి గొంతు నొక్కడానికి యత్నిస్తున్నారనే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


అలాగే లోక్‌సభ ఎన్నికలు నిర్ణీత సమయం కంటే ముందే జరుగతాయనే ప్రచారం జరుగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్‌ ఎంపీలందరినీ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వాటి ఫలితాలను లోక్‌ సభ నియోజకవర్గాల వారీగా విశ్లేషించనున్నారు. ఏపీలోనూ టీడీపీ, జనసేన, సీపీఐ కలిసి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. జగన్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభకు సన్నద్ధమౌతున్నారు.


బీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీపీ, బీజూ జనతాదళ్‌, టీడీపీ పార్టీలు ప్రస్తుతానికి ఏ కూటమిలో లేకుండా తటస్థంగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమీకరణాలు మారనున్నాయి. ప్రస్తుతానికి ఇండియా కూటమితో పాటు తటస్థంగా ఉన్న పార్టీలు కూడా లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తున్నాయి. అన్ని పార్టీల టార్గెట్‌ లోక్‌సభ ఎన్నికలే అన్నది తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. జనవరి చివరి నాటికి దేశంలో చలికి రాజకీయ వేడి తోడు కానున్నది.