Site icon vidhaatha

గుజరాత్‌లో భళా.. హిమాచల్‌లో డీలా

విధాత: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం సాధించింది. 37 ఏండ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. మోడీ సొంత రాష్ట్రంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించారు. ఈసారి పట్టణ ఓటర్లే కాదు, గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడంలో సఫలమైంది. అలాగే కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకున్నది. పాటీదార్ నేత హార్దిక్ పటేల్, ఓబీసీ నేత అల్పేశ్ ఠాకూర్ కోలీ వర్గ నేత కున్వర్ జీ బవలియాలను కాంగ్రెస్ వదులుకుంటే.. కమలం అక్కున చేర్చుకున్నది.

మోడీ అయితే ఈ ఏడాది మార్చి నుంచి ఎన్నికల ప్రచారం ముగిసే వరకు 20 గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నారు. ఏడాది ముందు నుంచే ఆర్ఎస్ఎస్ , బీజేపీలు సంయుక్తంగా పని చేశాయి. అమిత్ షా మొదలు కీలక నేతలంతా రాష్ట్రం పైనే పూర్తిగా దృష్టి సారించారు. బూత్ స్థాయిలో గట్టిగా పనిచేశారు. ఇవన్నీ ఫలించి రికార్డు విజయాన్ని దక్కించుకున్నది. బీజేపీ నేతలు ముఖ్యంగా మోడీ, షాలకు గెలుపు ఓటముల తో సంబంధం లేకుండా ప్రతి ఎన్నికను సీరియస్‌గా తీసుకుంటున్నారు.

అందుకే కాంగ్రెస్, కమ్యూనిస్టులకు పట్టు బాగా ఉన్న అసోం, త్రిపుర లాంటి రాష్ట్రాల్లోనూ రెండు సార్లు వరుసగా విజయాన్ని సాధించగలిగింది. అందుకే ఆరు సార్లు గెలిచినా ప్రభుత్వ వ్యతిరేకత దాటి ఏడో సారి 50 శాతానికి పైగా ఓట్లు సాధించి రికార్డు సృష్టించింది. బీజేపీ తాను అధికారంలోకి రావాలని అనుకుంటే ఆ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి అన్నిటికీ సిద్ధ పడుతున్నది. తాను ఇప్పటి వరకు గెలవని స్థానాలపై ఫోకస్ పెట్టింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 400 సీట్లే లక్ష్యంగా ముందు కదులుతున్నదని సమాచారం. కాంగ్రెస్ పార్టీ బీజేపీని ఎదురుకోవాలంటే ఇప్పుడున్న విధానాలు, ఆ పార్టీ నేతల వ్యూహాలు సరిపోవు.

అయితే గుజరాత్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా భారీ విజయాన్ని సాధించిది. ఇది ఎంత వాస్తవమో.. హిమాచల్‌ ప్రదేశ్‌లో ఓటమి అంతే నిజం. గుజరాత్‌ విజయాన్ని పెద్దగా చూపెట్టి తాను అధికారంలో ఉన్న హిమాచల్‌ను కోల్పోయిన విషయాన్ని తక్కువగా చూపెట్టడం హాస్యాస్పదంగా ఉన్నది. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కాంగ్రెస్‌ రెండు వంతులు, ఆప్‌ ఒకవంతు పంచుకున్నాయి. ఫలితంగా అక్కడ హస్తం అస్తవ్యస్తం కావడానికి ఆప్‌ కారణమని స్పష్టమౌతున్నది.

35 స్థానాల్లో ఆప్‌ రెండో స్థానంలో నిలవడమే దీనికి నిదర్శనం. గత ఎన్నికల్లో బీజేపీ 49.44 శాతం ఓట్లతో 99 సీట్లు గెలుచుకున్నది. 42.97 శాతం ఓట్లతో కాంగ్రెస్‌ 77 సీట్లను గెలుచుకున్నది. అప్పుడు ఆప్‌ 29 స్థానాలో పోటీ చేసి 0.62 శాతం ఓట్లకే పరిమితమైంది. గతంలో పోలిస్తే ప్రస్తుతం బీజేపీకి 3.05 శాతం ఓట్లు పెరిగాయి. ఫలితంగా ఏకంగా 57 సీట్లు అదనంగా వచ్చాయి. కాంగ్రెస్‌ 15.58 శాతం ఓట్లను కోల్పోయి 60 సీట్లను పోగొట్టుకున్నది. కాంగ్రెస్‌ కోల్పోయిన 12.3 శాతం ఓట్లు ఆప్‌ ఖాతాలోకి, మిగిలినవి బీజేపీ ఖాతాలోకి చేరిపోయాయని స్పష్టంగా తేలింది.

అలాగే ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో 15 బీజేపీ పాలనకు ఆప్‌ చెక్‌ పెట్టింది. మొత్తం 250 వార్డులో ఆప్‌ 134 స్థానాలు కైవసం చేసుకోగా బీజేపీ 104 స్థానాలకే పరిమితమైంది. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఫలితాలతోపాటు ఐదు రాష్ట్రాల పరిధిలో ఒక లోక్‌సభ, ఆరు అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. యూపీలోని మెయిన్‌పురిలో లోక్‌సభ స్థానాన్ని ఎస్పీ 2,88,461 మెజారిటీతో నిలబెట్టుకోగా, రాంపుర్‌ సదర్‌లో అసెంబ్లీలో ఓడిపోయింది.

ఖతౌలీ శాసనసభ స్థానంలో ఎస్పీ మిత్రపక్షం ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి గెలుపొందారు. బీహార్‌లో కుడనీ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. ఒడిషాలోని పద్మపూర్‌ అసెంబ్లీ స్థానంలో బిజూ జనతాదళ్‌ జయకేతనం ఎగువవేసింది. రాజస్థాన్‌లోని సర్దార్శహర్‌, ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌ అసెంబ్లీ స్థానాలను అధికార కాంగ్రెస్‌ పార్టీ నిలబెట్టుకున్నది. కాబట్టి గుజారాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు గెలుపే, అలాగే హిమాచల్‌లో ఓటమి ఓటమే.

అలాగే ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో రెండు మాత్రమే గెలిచింది. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ అధికార కాంగ్రెస్‌ పార్టీ తన పట్టును నిలుపుకున్నదీ నిజమే. ఒక్క గుజరాత్‌లో భారీ విజయం సాధించాం. మిగిలినవి ఓడిపోయినా మేము పరిగణనలోకి తీసుకోమన్నట్టు బీజేపీ నేతలు వ్యవహరిస్తే దానికి ఎవరూ చేసేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజాతీర్పే అంతిమమంగా ఫైనల్‌.

Exit mobile version