Telangana | హ‌క్కులూ మావే.. నిర‌స‌న‌లూ మావే! నిర‌స‌న‌లు, ధ‌ర్నాల్లో.. KCR ప్ర‌భుత్వ ద్వంద్వ నీతి

Telangana ప్ర‌తిప‌క్షాల గొంతుకు తాళం.. త‌మ‌ దాకా వ‌స్తే మేళం ఆర్టీసీ కార్మికులు చేస్తే త‌ప్పు.. అధికార‌ పార్టీ చేస్తే ఒప్పు దేశంలోనే అతి త‌క్కువ‌కాలం అసెంబ్లీ న‌డిపిన ఘ‌న‌త మాట‌ల బారెడు, చేత‌లు జానెడు హామీల్లో ఘ‌నాపాఠి- యూట‌ర్న్‌లో ఆయ‌నే సాటి విధాత: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యలపై ఉద్యమించడం ప్రజాసంఘాలకు, ఉద్యోగ, కార్మిక, విద్యార్ధి, హక్కుల సంఘాలకు నిషిద్ధంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సబ్బండ వర్గాలు సకల జనుల సమ్మెతో, ఉద్యమాలతో […]

  • Publish Date - August 5, 2023 / 10:24 AM IST

Telangana

  • ప్ర‌తిప‌క్షాల గొంతుకు తాళం.. త‌మ‌ దాకా వ‌స్తే మేళం
  • ఆర్టీసీ కార్మికులు చేస్తే త‌ప్పు.. అధికార‌ పార్టీ చేస్తే ఒప్పు
  • దేశంలోనే అతి త‌క్కువ‌కాలం అసెంబ్లీ న‌డిపిన ఘ‌న‌త
  • మాట‌ల బారెడు, చేత‌లు జానెడు
  • హామీల్లో ఘ‌నాపాఠి- యూట‌ర్న్‌లో ఆయ‌నే సాటి

విధాత: కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తమ సమస్యలపై ఉద్యమించడం ప్రజాసంఘాలకు, ఉద్యోగ, కార్మిక, విద్యార్ధి, హక్కుల సంఘాలకు నిషిద్ధంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో సబ్బండ వర్గాలు సకల జనుల సమ్మెతో, ఉద్యమాలతో సమైక్య పాలకులకు వ్యతిరేకంగా ప్రత్యేక రాష్ట్ర నినాదంతో సాగించిన ఉద్యమాలు..నిరసనలు స్వరాష్ట్రంలో నిషిద్ధమై చివరకు నిరసనలు కూడా పాలకుల పరమవ్వడం ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న‌ది.

రాజ్యంగపర భావస్వేచ్చ, నిరసన హక్కులను తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ వీలిన బిల్లు వివాదంతో మరోసారి హైజాక్ చేయడం సర్కారు ద్వంద్వ నీతికి నిదర్శన‌మ‌న్న విమ‌ర్శ‌లు విప‌క్షాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. గతంలో 2019లో ఇదే ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధనకు సాగించిన సమ్మెపట్ల 55రోజుల సమ్మెను రాష్ట్ర ప్ర‌భుత్వం నిర్దాక్షిణ్యంగా అణిచివేసింది. దీంతో ఆనాటి సమ్మెలో 34 మంది కార్మికులు బలయ్యారు. వందలాది మందిపై కేసులు బ‌నాయించి ముప్పుతిప్ప‌లు పెట్టారు. సీఎం కేసీఆర్ 2019 ఆక్టోబర్ 25న మీడియా సమావేశంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిప్పులు చెరిగారు.

“అర్టీసీని ప్ర‌భుత్వంలో గ‌వ‌ర్న‌మెంటులో క‌లుప‌మంటే కలుపుతారా అది అంత ఈజీనా.. ప్రభుత్వానికి ఒక బాధ్యతుంటది.. పద్దతుంటది.. మిగతా కార్పోరేషన్లు ప్రభుత్వంలో కలపాలంటే ఏం చేయాలి?.. ఏం సమాధానం చెప్పాలి?.. ఆర్టీసీని గవర్నమెంట్‌లో కలపడం అసంబద్దమైన, అసంభవమైన, అర్ధ రహితమైన డిమాండ్‌. ఆదో నినాదమానండి!.. పనికిమాలిన, తలమాసినోళ్లు, పిచ్చి రాజకీయ పార్టీలు గీళ్లా.. చెప్పేది.. ఈ భూగోళం ఉన్నంతకాలం విలీనం జరుగదు..కలపడం అసాధ్యం”మంటు నిష్కర్షగా మాట్లాడారు.

అదే ప‌ని ఏపీలో జ‌గ‌న్ చేశారు క‌దా అన్న మీడియా ప్ర‌శ్న‌కు.. కేసీఆర్ జ‌రిగే ప‌నేనా? ఆ క‌మిటీ ఎప్పుడు తేల్చాలి అంటూ ఎద్దేవా చేశారు. అటువంటి కేసీఆర్ మరోసారి అధికారం కావాలన్న ఆలోచన వచ్చేసరికి మంత్రిమండలి భేటీలో ఎజెండాలో లేకుండానే.. కార్మికులు, ప్ర‌తిప‌క్షాల నుంచి ఒత్తిడి రాకుండానే ఆర్టీసీ విలీనం ప్ర‌తిపాద‌న‌పై మంత్రిమండ‌లితో ఓకే అనిపించారు. అప్పటిదాకా మంత్రులతో సైతం ప్రస్తావించ కుండానే ఆకస్మికంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేద్దామంటు కేబినెట్ తీర్మానం చేయించి సహచర మంత్రులను సైతం విస్మయపరిచారు.

ఒక్క‌రోజులోనే సంత‌కం ఎత్తుగ‌డ‌లో భాగ‌మేనా?

ఈ వ్యవహారాన్ని పక్కన పెడితే కేబినెట్ ఆమోదంతో గవర్నర్‌కు పంపిన ఆర్టీసీ విలీన బిల్లు ఒక్క రోజులోనే పరిశీలించి సంతకం పెట్టి పంపించాలంటు గవర్నర్ ను ఒత్తిడిలోకి నెట్టే ఎత్తుగడ వేశారు. మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో తొలి రోజు సమావేశాల మధ్యాహ్నం సమయంలో గవర్నర్ వద్దకు చేరిన ఆర్టీసీ విలీన బిల్లు పరిశీలనకు కనీసం గవర్నర్ సైతం రాజ్‌భవన్‌లో అందుబాటులో లేరు.

ఆమె పుదుచ్చేరి పర్యటనలో ఉన్నారు. ఆ విషయం ప్రభుత్వానికి తెలియందికాదు. అయినా అసెంబ్లీ సమావేశాల గడువు ముగిసిపోతుందంటు, ఈ సమావేశాల్లోనే తాము బిల్లు ఆమోదించాలనుకుంటే గవర్నర్ బిల్లు ఆమోదించి, తిరిగి పంపలేదంటు గవర్నర్ పై నెపం నెట్టేసి ఆర్టీసీ కార్మిక సంఘాలకు గవర్నర్‌ను టార్గెట్ చేసే ఎత్తుగ‌డ‌ల‌కు దిగింది ప్ర‌భుత్వం.

ఇక్కడే కేసీఆర్ ప్రభుత్వం రెండు రకాలుగా తన రాజకీయ వ్యూహాలను అమలు చేయడంలో చతురత చూపింద‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. గవర్నర్‌ను ఇరకాటంలోకి నెట్టడంతో పాటు, ఆర్టీసీ కార్మికుల పక్షపాతిగా తనను చిత్రీకరించుకోవడంలో ప్ర‌భుత్వం సఫలీకృతమైంద‌నే అభిప్రాయం విన‌బ‌డుతోంది.

గవర్నర్‌కు వ్యతిరేకంగా ఆర్టీసి కార్మికులను వీధి పోరాటాలకు ఉసిగొల్పడమ‌నే వ్యూహం విజయమవంత మైంద‌ని చెబుతున్నారు. చిత్రంగా, అంతే అమాయకంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కూడా కేసీఆర్ పన్నిన వ్యూహంలో చిక్కుకుని గవర్నర్ బిల్లును వెంటనే ఆమోదించాలన్న డిమాండ్‌తో శ‌నివారం నాడు నిరసనలకు దిగారు.

ఇక్కడే పెద్ద ట్విస్టు ఏమిటంటే ఏ పాలకుడైతే గతంలో 55 రోజుల ఆర్టీసీ సమ్మెను నిరంకుశంగా అణిచి వేశారో.. రాజ్యాంగ హక్కుతో ఏర్పడిన ఆర్టీసీ కార్మిక సంఘాలకు మ‌నుగ‌డ‌ లేకుండా చేశారో అదే పాలకుడి ప్రోద్భలంతో ఆర్టీసీ కార్మికులు నిరసనలకు దిగడం ప్రజాస్వామిక వింతనే అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య సాగుతున్న రాజకీయ క్రీడ‌లో ఆర్టీసీ కార్మికులు అరటిపండుగా మారి పోయార‌న్న విమ‌ర్శ‌లు ప్ర‌తిప‌క్షాల సైతం చేసే ప‌రిస్థితి వ‌చ్చింది.

ఇది అంతిమంగా ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ల‌బ్ధి చేకూరుతుంద‌నే లెక్క‌ల్లో నేత‌లు మునిగిపోయారు త‌ప్ప ఆర్టీసీ విలీనం ప్ర‌క్రియ‌లో సాధ్యాసాధ్యాలు, న్యాయ‌ప‌ర‌మైన చిక్కులు, ప‌క్క రాష్ట్రంలో జ‌రిగిన విలీనం తాలూకూ ఫ‌లితాలు అంచ‌నాలు వేయ‌డంలో మాత్రం అటు పాల‌కులు, ఇటు కార్మికులు పెద్ద‌గా దృష్టి పెట్ట‌లేద‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి.

ఆది నుంచి అణిచివేతనే..

ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్‌కు ప్రజాందోళనలను, ఉద్యమాలను అణిచివేయడం కొత్తేమికాదు అన్న‌ది ప్ర‌జాస్వామ్య‌వాదులు చేస్తున్న విమ‌ర్శ‌. అందుకు వారు కార‌ణాలూ చెబుతున్నారు. “తొలి దఫా అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ఉద్యమానికి కేంద్రంగా ఉన్న హక్కుల సంఘాల నిరసన వేదికగా పిలువబడిన ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌ను ప్ర‌భుత్వం మూసి వేసింది.

అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, ఐకేపీల ఆందోళలను పోలీసు బ‌ల‌గాల‌తో అణిచివేశార‌ని ఆయా సంఘాల నేత‌లు ఇప్ప‌టికీ వాపోతున్నారు. విద్యుత్ ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శుల, కార్మికుల ఆందోళనలకు ఏమాత్రం విలువ ఇవ్వ‌లేద‌న్న బాధ వారిలో క‌నిపిస్తోంది.

ఎక్కువ మాట్లాడితే వ్య‌వ‌స్థ‌ల‌నే ఎత్తివేస్తాం అన్న‌ట్లుగా వీఆర్వోలను తొల‌గించారు. వారి పోరాటాల‌ను అణిచివేశారు. తాజాగా అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఏఎన్‌ఎంలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మిక, ఉద్యోగుల ఆందోళనలను భగ్నం చేశారు.

ప్రధాన ప్రతిపక్ష పార్టీల నిరసన హక్కులను కూడా కాలరాసి వారిచ్చే ఆందోళనల పిలుపులకు ముందే హౌజ్ అరెస్టులు, ముందస్తు అరెస్టులతో వారి నిరసనలను తొక్కి పెట్టారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల ఆందోళనలను సైతం మరుగుపరిచారు” అంటూ జాబితాను ఏక‌రువు పెడుతున్నారు.

అధికార పార్టీ నిరసనలే చట్టబద్ధం

అదే సమయంలో రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ అన్నట్లుగా తనకు రాజకీయంగా అవసరమైన ప్రతిసారి ప్రభుత్వమే తన పార్టీ శ్రేణులను ధర్నాలకు, వీధి పోరాటలకు దించడం మరో రోత రాజకీయం అనే విమ‌ర్శ‌ల‌నూ కేసీఆర్ ప్ర‌భుత్వం మూట‌గ‌ట్టుకుంది.

కేంద్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి పెట్టెందుకు గతంలో పెట్రోల్‌, గ్యాస్ ధరలపైన, ధాన్యం కొనుగోళ్లపైన, రెండువేల నోట్ల రద్దుపైన, తాజాగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై రాజకీయ ఎదురుదాడికి 24 గంటల ఉచిత విద్యుత్తు వివాదంపైన సొంత పార్టీ శ్రేణులను, మంత్రులను, ఎమ్మెల్యేలను సైతం నిరసనలకు దించి కొత్త రాజ‌కీయాల‌కు తెర‌దించార‌ని విప‌క్షాలు వేలెత్తి చూపేలా చేశారు.

తాము నిరసనలు చేస్తే చట్టబద్ధం.. ప్రతిపక్షాలు, పౌర సంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు చేస్తే చట్ట వ్యతిరేకమన్నట్లుగా ప్రభుత్వం ఏకపక్ష నియంతృత్వ విధానాలు ఎంతవరకు సాగుతాయో ప్రజలే నిర్ణ‌యించాల్సి ఉంద‌న్న అవ‌గాహ‌న‌కు సంఘాలు వ‌చ్చాయి.

యూట‌ర్న్‌లో కేసీఆర్ త‌రువాతే…

సీఎం కేసీఆర్ అంటేనే మాటల మరాఠి. ఆయ‌న్ను రాజకీయ చతురుడిగా పిలుస్తారు. తెలంగాణ ఉద్యమ కాలంలో, రెండుసార్లు స్వరాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఏం మాట్లాడినా, ఏం హామీలిచ్చినా జ‌నం న‌మ్మేశారు. అలా మాట్లాడే చాతుర్యం కేసీఆర్ సొంతం.

ఉద్యమ కాలంలో రాష్ట్రమొస్తే ఇంటికో ఉద్యోగమొస్తుందని.. కాలు అడ్డం పెడితే మన నీళ్లు మనకొస్తాయం టు నీళ్లు, నిధులు, ఉద్యోగాల నినాదంతో అందరిని తన వైపుకు తిప్పుకున్న ఘ‌నాపాఠి కేసీఆర్‌. దళిత ముఖ్యమంత్రి, మూడెకరాల భూమి, డబుల్ బెడ్‌రూమ్‌, లక్ష ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, కేజీ టూ పీజి ఉచిత విద్య హామీలిచ్చిన కేసీఆర్ వాటిపై యూటర్న్ తీసుకున్నారు.

దాని గురించి ప్ర‌తిప‌క్షాలు లేవ‌నెత్తితే.. అసెంబ్లీ వేదికగానే “మస్తు చెబుతం.. అన్ని అయితయా” అంటు గ‌డుస‌రిగా స‌మాధాన‌మిచ్చారు. చాలాకాలం పాటు మౌనంగా ఉండ‌టం, అక‌స్మాత్తుగా ప్రెస్‌మీట్లు పెట్టి చిత్ర‌మైన టాపిక్స్ మాట్లాడి జ‌నం దృష్టి మ‌ళ్లించ‌డం కేసీఆర్‌కే చెల్లింద‌న్న విమ‌ర్శ‌లూ ఉన్నాయి.

రాజ్యాంగాన్నిమార్చాలంటు ఒకసారి, దానితోనే తెలంగాణ సిద్ధించిందంటు మరోసారి విభిన్న వివాదస్పద వ్యాఖ్యలు చేసినా..గ‌త ఏడాది భారీ వ‌ర‌ద‌ల‌కు కాళేశ్వ‌రం మోటార్లు మునిగిపోతే, క్లౌడ్ బరెస్టుతో క‌ట్ట‌డి చేయాల‌ని చూడ‌టం..విదేశాల కుట్ర అంటూ ట్విస్టులు ఇవ్వ‌డం కేసీఆర్ వంటి జనాకర్షక నేతకే చెల్లింది.

డ‌ల్లాస్‌.. మాట‌ల్లోనే క‌ల్లాస్‌

కరీంనగర్‌ను లండన్ గా, హైద్రాబాద్‌ను డల్లాస్ గా చేస్తామన్న, జిల్లాకో ఏయిర్ పోర్టు, డ్రై పోర్టు, ఐటీ హబ్‌లు తెస్తామని కేసీఆర్ చెప్పిన హామీలు, చూపించిన రంగుల క‌ల‌లు ఆయా సంద‌ర్భాల‌లో ప్ర‌జ‌ల‌ను ఆకర్షించే ప‌నిలో భాగ‌మే అంటున్నారు. యాదగిరి నర్సన్నకు అంత పెద్ద ఆలయం.. పాలనకు స‌రికొత్త సచివాలయం కట్టినోడు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినోడు.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఇచ్చినోడు ఏదైనా చేస్తాడులే అన్న నమ్మకాన్నే జనం కేసీఆర్‌పై చూపారు.

అదే మాటల మాయలో యూనివర్సిటీలు, ప్రభుత్వ విద్యా సంస్థలు నిర్వీర్యమైనా..గల్లీకో మద్యం దుకాణం వచ్చినా జనం మదికెక్కలేదు. ప్రజలు తన మాటలకు వశమై ఉన్నన్ని రోజులు ఆయన ఆడింది ఆటగా పాడింది పాటగా సాగింది. ఇప్పుడిప్పుడే రెండో పర్యాయం పదవి కాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకతను గ్రహించిన కేసీఆర్ ఆకస్మికంగా తాను చేయలేమన్న అంశాలన్నింటిని కూడా ఎన్నికల ముందు చేేసేస్తు తాను గతంలో సాధ్యం కాదన్న మాటలపై నాలుకను మడతేస్తు కూడా జనాన్ని మరోసారి తన మాయలో పడేసే ప్రయత్నం చేస్తున్నారు.

రైతు రుణాల మాఫీ అయినా, ఆర్టీసీ విలీనం అయినా ఎన్నిక‌ల ముందు వ‌చ్చిన ఆలోచ‌న‌లే త‌ప్ప ప్ర‌జ‌ల బాగుకోసం చెప్పిన మాట‌లు కావ‌న్న‌ది విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌. ఇక ప్రభుత్వంలో నెంబర్ టూగా ఉన్న మంత్రి కేటీఆర్ సైతం ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌న‌లో ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఫ్లకార్డ్సు పట్టుకుని మరి బీఆరెస్ నిరసనల్లో పాల్గొన్నారు.

తాము వ్యతిరేకించిన ప్రభుత్వ భూముల అమ్మకాల పనిని వారు అధికారంలోకి వచ్చాకా నిస్సిగ్గుగా చేస్తు అదో గర్వకారణంగా, పరపతికి నిదర్శనంగా చెప్పడం విడ్డూరంగా ఉంద‌ని పాత ఫోటో పెట్టి నెటిజ‌న్లు ఓ ఆట ఆడుకుంటున్నారు. అన్నింటికి మించి ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థకు గుండెకాయ వంటి అసెంబ్లీ సమావేశాలను దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని రీతిలో అతితక్కువ రోజులకు పరిమితం చేయడంతో పాటు సోత్క‌ర్ష‌కు వేదికగా మార్చిన తీరుపై కూడా ఇదే త‌ర‌హా ట్రోల్స్ మొద‌ల‌య్యాయి.

Latest News