డిప్యూటీ సీఎం భట్టి నివాసంగా ప్రజాభవన్‌

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

  • Publish Date - December 13, 2023 / 09:23 AM IST

విధాత: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రజాభవన్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. భట్టి తన కుటుంబంతో పాటు ప్రగతి భవన్‌కు మారే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌ను సీఎం అధికారిక కార్యాలయంగా, నివాసంగా వినియోగించారు.


 


అయితే కొత్త సీఎం రేవంత్‌రెడ్డి ప్రగతి భవన్‌ తనకు వద్దన్నారు. రాచరికానికి చిహ్నంగా, గడీలను గుర్తు చేసే తీరుగా ఉన్న ప్రగతి భవన్ లో తాను నివాసం ఉండబోనని తేల్చేశారు. దాన్ని జ్యోతిభాపూలే ప్రజాభవన్ గా పేరు మార్చి ప్రతి మంగళ, శుక్రవారాల్లో అక్కడ ప్రజావాణి నిర్వహించేలా ఆదేశాలిచ్చారు. రేవంత్ రెడ్డి తన క్యాంపు ఆఫీస్‌గా మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రాన్ని వాడుకోవాలని భావిస్తున్నారు.ప్రగతి భవన్‌ను మాజీ సీఎంలు వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి, కిరణ్ కుమార్‌రెడ్డిలు తమ అధికారిక నివాసంగా వినియోగించారు. వైఎస్ ఇక్కడ ప్రజాదర్భార్ నిర్వసించారు.


సీఎం క్యాంపు కార్యాలయంగా 2004 మాజీ సీఎం వైఎస్‌. రాజశేఖర్‌రెడ్డి హాయంలో ప్రగతి భవన్‌ను 2ఎకరాల్లో నిర్మించారు. దానిని సీఎం కేసీఆర్ 2016లో 9ఎకరాలకు విస్తరించి భారీ భవంతులతో పునర్ నిర్మాణం జరిపించారు. దానికి ప్రగతి భవన్‌గా నామకరణం చేశారు. ఇందులో ముఖ్యమంత్రి నివాసం, ముఖ్యమంత్రి కార్యాలయం, జనహిత పేరుతో సమావేశ మందిరం ఉన్నాయి. భవనం ముందు రోడ్డు మీద వరకు కూడా పెద్ద ఇనుప కంచెను ఏర్పాటు చేశారు. దీనిని రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తొలగించి వేశారు.

Latest News