సింగరేణి ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం

సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 27న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది

  • Publish Date - December 21, 2023 / 06:59 AM IST
  • 27న ఎన్నికలకు ఆదేశాలు

విధాత : సింగరేణి ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 27న ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికలు వాయిదా వేయాలన్న మధ్యంతర పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సింగరేణిలో ఎన్నికల కోలహాలం ఊపందుకోనుంది. సింగరేణి సంస్థ తన వెబ్‌సైట్‌లో ఉంచిన వివరాల ప్రకారం ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 42 వేలు. డిసెంబర్ 27న జరిగే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల్లో మొత్తం 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.


తెలంగాణలో 6 జిల్లాల పరిధిలో (కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం) సింగరేణి 18 ఉపరితల (ఓపెన్ కాస్ట్), 24 భూగర్భ గనులను నిర్వహిస్తోంది.సింగరేణిలో ఇప్పటి వరకు 6 సార్లు గుర్తింపు కార్మిక సంఘానికి ఎన్నికలు జరిగాయి. అందులో సీపీఐ అనుబంధ కార్మిక సంఘం మూడుసార్లు, ఏఐటీయూసీ మూడు సార్లు, కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ ఒక సారి, బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) రెండు సార్లు విజయం సాధించాయి.


చివరిసారిగా 2017లో జరిపిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ గెలుపొందింది. సింగరేణి గుర్తింపు సంఘాల ఎన్నిలను ప్రతి నాలుగేళ్లకొకసారి నిర్వహించాల్సివుంది. నిజానికి రెండేళ్ల క్రితమే ఈ ఎన్నికలు జరగాల్సి ఉన్నా కోవిడ్, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చాయి. ప్రస్తుత ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు గుర్తింపు హోదా కోసం పోటీ పడుతున్నాయి. పోటీ ప్రధానంగా జాతీయ కార్మిక సంఘాలు, టీబీజీకేఎస్ మధ్య నెలకొంది. సింగరేణి ప్రాంతాన్ని మొత్తం 11 డివిజన్లు (ఏరియాలు) గా విభజించి ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. పోలింగ్ జరిగిన రోజు సాయంత్రమే ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు.