– రెవెన్యూ రికార్డులో వారి పేర్లను పొందుపర్చి..
ప్రభుత్వ భూమిని తొలగించండి
– ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు
– ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసిన హైకోర్టు డివిజన్ బెంచ్
విధాత, హైదరాబాద్: హఫీజ్‌పేట్‌లోని 24 ఎకరాల భూమిని హిందుస్థాన్ ఏరోనాటికల్ ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ (హెచ్ఏఎల్) మ్యుటేషన్ చేయాలని తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం వేసిన అప్పీల్ పిటిషన్ ను కొట్టివేస్తూ, సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. రెవెన్యూ రికార్డులో వారి పేర్లను పొందుపర్చి, ప్రభుత్వ భూమిని తొలగించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం, వెదిరి ఎస్టేట్స్ ప్రైవేట్ టిమిటెడ్, ఇతరులు దాఖలు చేసిన రిట్అప్పీళ్లను తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్‌వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం ఈనెల 19న విచారించింది.
2005 హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థ రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్‌లోని సర్వే నంబర్ 77లోని 24.35 గుంటల భూమిని కొనుగోలు చేయగా, మ్యుటేషన్‌కు 2006లో అనుమతించారు. కానీ 2007లో రివిజనల్ అథారిటీ ద్వారా పక్కన పెట్టింది. ఆ తర్వాత రెవెన్యూ రికార్డులో పేరు మార్చాలని ఆ సంస్థ దరఖాస్తు చేసుకోవడంతో 1971లోని సెక్షన్9 ప్రకారం రివిజనల్ అథారిటీ (జాయింట్ కలెక్టర్) హిందుస్థాన్ ఏరోనాటికల్ ఎంప్లాయీస్ కు అనుకూలంగా మ్యుటేషన్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా దానిని అమలు చేయాలని తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. అయినా వారి మ్యుటేషన్ చేయలేదు. దీంతో కోర్టు జాయింట్ కలెక్టర్ ఆర్డర్‌ను పక్కన పెట్టి రిమాండ్ చేసింది. తీర్పు కోసం తిరిగి మ్యుటేషన్ అనుమతించబడినప్పటికీ, అది స్పష్టంగా లేదని వారి పేర్లను రికార్డులో పొందుపర్చాలని వారు హైకోర్టులో పిటిషన్‌లో దాఖలు చేశారు. దీనిని సింగిల్ జడ్జి అనుమతిస్తూ పహాణీలతో సహా అన్ని రెవెన్యూ రికార్డుల్లో పిటిషనర్ పేరును యజమానిగా నమోదుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్‌చేస్తూ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేశారు.
ఇందులో అదనపు అడ్వకేట్ జనరల్ వాదిస్తూ.. పిటిషనర్‌కు సంబంధిత భూమికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎందుకంటే భూమి విక్రేతకు ఎలాంటి టైటిల్ లేదని వివరించారు. రిట్ పిటిషనర్ల తరుఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇంట్రా కోర్టు అప్పీల్ పరిధిలోని ఉత్తర్వులను పరిశీలించడానికి పరిమితమైందని తెలిపారు. అయితే ఈ భూమిని హిందుస్థాన్ ఏరోనాటికల్ ఎంప్లాయీస్ సంస్థ కొనుగోలు చేసిందని, వారి పేర్లతో మ్యుటేషన్ చేసి రెవెన్యూ రికార్డులో ఉంచాలని విన్నవించారు.
పిటిషనర్ కొనుగోలు చేసిన భూమి స్వభావాన్ని ప్రభుత్వ భూమిగా పరిగణించొద్దని డివిజన్ బెంచ్ ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. కేవలం రెవెన్యూ రికార్డుల్లో నమోదు మాత్రమే అవుతుందని వ్యాఖ్యానించింది. టైటిల్ వివాదంపై ప్రత్యామ్నాయ పరిష్కారాలను పొందేందుకు హౌసింగ్ సోసైటికి స్వేచ్ఛను ఇచ్చింది. అదేవిధంగా పిటిషనర్‌కు అనుకూలమైన కేసు ప్రొసీడింగ్‌లకు సంబంధించిన ఎంట్రీలు సుప్రీం కోర్టులో అప్పీల్ ఫలితానికి లోబడి ఉంటాయని హైకోర్టు డివిజన్ బెంచ్ తెలిపింది.