హైదరాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షలు ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ వరకు కొనసాగే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓఝా స్పష్టం చేశారు. అయితే నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతివ్వమని ఆమె తేల్చిచెప్పారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు.
ఇంటర్ పరీక్షలను ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోజుకు ఒక పరీక్ష చొప్పున మాత్రమే నిర్వహించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,521 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇందులో 4,78,718 మంది ఫస్టియర్ విద్యార్థులు, 4,44,189 మంది సెకండియర్(రెగ్యులర్) విద్యార్థులు, 58,071 మంది సెకండియర్(ప్రయివేటుగా ఫీజు కట్టి) పరీక్షలకు హాజరు కానున్నారు.
1521 చీఫ్ సూపరింటెండెంట్, 27,900 ఇన్విజిలేటర్లు, 75 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసినట్లు శృతి ఓఝా తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపాలని టీఎస్ ఆర్టీసీని కోరినట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, క్యాలికులేటర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు ఎలాంటి అదనపు పత్రాలకు అనుమతి లేదన్నారు. కేవలం హాల్ టికెట్, పెన్నులు, పెన్సిల్స్‌కు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మంచి నీటి సదుపాయంతో పాటు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని శృతి ఓఝా తెలిపారు.