విధాత: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)పై అంచనాలు పెరిగిపోయాయి. పంజాబ్ లాగానే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఆప్ నిశ్శబ్ద విప్లవం తెస్తుందన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆశించిన మేర సీట్లు ఓట్లు తెచ్చుకోవటంలో విఫలమైంది. గుజరాత్‌లో ఓ మేరకు ఐదు ఎమ్మెల్యే సీట్లను గెలిచి 12శాతం ఓట్లను సాధించి పరువు నిలుపుకొన్నది. కానీ హిమాచల్ ప్రదేశ్ ఓటింగ్ శాతం అందరినీ ఆశ్చర్య పర్చింది.
ఎన్నికల ఫలితాలు ప్రకటించక ముందు హిమాచల్ ప్రదేశ్‌లోనూ ఆప్ తనదైన మార్క్ రాజకీయ సఫలతను చాటుతుందని ఆశించిన వారున్నారు. కాంగ్రెస్, బీజేపీతో పాటు అన్ని సీట్లకు పోటీ చేసి ప్రధాన పోటీ దారుగా బరిలో నిల్చింది ఆప్. ఫలితాల తర్వాత చూస్తే.. రాష్ట్రంలో ఒక్కసీటు కూడా గెలువకపోవటం అటుంచి ఎక్కడా డిపాజిట్ దక్కలేదు. మొత్తంగా చూస్తే.. ఆప్‌కు వచ్చిన ఓట్ల శాతం 1.1శాతం ఉండటం గమనార్హం. హిమాచల్ ప్రదేశ్‌లోని డల్హౌసీ, కాసుంప్టీ, చోపాల్, అర్కీ, చాంబా లాంటి ప్రాంతాల్లో నోటా కన్నా తక్కువ ఓట్లు ఆప్‌కు పడటం గమనార్హం.
ఢిల్లీ, పంజాబ్ చూసిన తర్వాత మధ్య తరగతి జీవులు, మేధావుల్లో ఆప్‌కు ఆదరణ ఉన్నదని అనిపించింది. కానీ హిమాచల్‌లో ఆ వర్గాలు కూడా ఆప్‌ను సొంతం చేసుకోలేదు. దీనికి కారణం ఏమిటా అని అక్కడి ప్రజలను అడిగితే.. అసలు వాస్తవాలు వెల్లడించి ఆప్ రాజకీయ డొల్లతనాన్ని తెలియజేశారు.
హిమాచల్ ప్రదేశ్‌లో రైతుల ప్రాబల్యం ఎక్కవ. సగాని కన్నా ఎక్కువ నియోజక వర్గాల్లో వ్యవసాయ ఉత్పత్తి దారుల ప్రాబల్యం ఉన్నది. అలాంటి పరిస్థితుల్లో ఆప్ రైతులకు సంబంధించి మద్దతు ధర ఊసెత్తక పోవటం పెద్ద దెబ్బతీసింది. ఆప్‌ను రైతులు తమ ప్రతినిధిగా భావించలేదు.
అలాగే హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ అగ్రశ్రేణి నాయకత్వం ఎవరూ పెద్దగా ప్రచారం చేయలేదు. ఎన్నికల ప్రచారంలో గుజరాత్‌కు ఇచ్చిన ప్రాధాన్యమిచ్చినట్లు కనిపించలేదు. అలాగే… కేజ్రీవాల్ తన ప్రచారంలో.. తనను నమ్మండి అన్నారు కానీ, స్థానిక నేతను ముందుపెట్టి చూపలేదు. స్థానికత ప్రధానంగా ఉండే హిమాచల్‌లో కేజ్రీ ప్రచారం కలిసిరాక పోగా, నష్టం చేకూర్చిందని అంటున్న ఆప్ నేతలున్నారు.
మొత్తంగా చూస్తే.. ఆమ్ ఆద్మీ పార్టీ ఓ మూస పద్ధతిలో పోతున్నదని, దాని ఫలితమే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఓటమి అని ఆప్ నేతలే అంటున్న స్థితి ఉన్నది. ఇకముందైనా.. స్థానికతకు ప్రాధాన్యమిచ్చి పకడ్బందీ నిర్దిష్ట రాజకీయ వ్యూహాలతో ముందుకు పోకుంటే ఆప్‌కు భవిష్యత్తు అంధకారమేనని ఆప్ వర్గాలే అంటున్నాయి.