కేరళ గవర్నర్ ఉన్నతమైన ఆ హోదాలో అనర్హుడు

కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్‌) ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు మధ్య అధికార కుమ్ములాట రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నది

  • Publish Date - December 18, 2023 / 12:48 PM IST
  • సీపీఎం పొలిట్‌బ్యూరో ఆగ్రహం



న్యూఢిల్లీ : కేరళలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్‌) ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్‌కు మధ్య అధికార కుమ్ములాట రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నది. కేరళలోని కాలికట్ యూనివర్సిటీ సెనేట్ నియామకంలో ఇది బహిరంగంగా ముందుకు వచ్చింది. కేరళ గవర్నర్ ఆరిఫ్ మమ్మద్ ఖాన్‌పై సీపీఎం పొలిట్ బ్యూరో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది.


గవర్నర్ అన్ని హద్దులను చెరపివేసి, తన పదవికి మించి, అహంభావంతో ప్రవర్తిస్తున్నారని, తాను ఒక గవర్నర్‌ను అనే విషయం మరిచిపోయి, కేంద్ర ప్రభుత్వ అధికారిలా వ్యవహరిస్తున్నారని మండిపడింది. మరొకసారి చట్టబద్ధంగా ఎన్నికైన కేరళ ప్రభుత్వంపై గవర్నర్ బహిరంగ విమర్శలకు దిగుతున్నారని అభ్యంతరం తెలిపింది. గతంలో కూడా ఆయన ఇలా హద్దులు దాటి ప్రవర్తించారని గుర్తు చేసింది.


రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఒక ఉన్నతమైన పదవిలో ఉంటూ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కేరళ ప్రభుత్వాన్ని, కూలదోసి ఇక్కడ రాష్ట్రపతి పాలన విధించాలని, కేంద్రానికి సిఫారసు చేస్తున్నారని, దీన్ని కేరళ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తారని స్పష్టం చేసింది. గవర్నర్‌ ఒంటెత్తు పోకడలను నిరసిస్తూ ఇటీవల కాలికట్‌ యూనివర్సిటీ ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు నల్లజెండాలు చూపించిన విషయం తెలిసిందే.


కావాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనకు వ్యతిరేకంగా చేసిన కుట్రని గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రి మార్గ దర్శకత్వం లేకుండా ఇది జరగదని, స్పష్టంగా రాష్ట్రంలో చట్టబద్ధ పాలనా యంత్రాంగం కూలిపోయిందని అన్నారు. తనకు వ్యతిరేకంగా మాత్రమే ఇక్కడ కార్యకలాపాలు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు.