2024 ఎన్నికల్లో మోదీని ఎదుర్కొనేందుకు ఇండియా కూటమికి ఉన్న అవకాశాలివే!

భారత దేశం తన అప్పులు జీడీపీ లో 100 శాతం మించవచ్చని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది

  • Publish Date - December 26, 2023 / 10:04 AM IST

విధాత‌: భారత దేశం తన అప్పులు జీడీపీ లో 100 శాతం మించవచ్చని ఐఎంఎఫ్‌ హెచ్చరించింది. వాతావరణ మార్పుల లక్ష్యాన్ని చేరుకోవడానికి పెద్ద మొత్తం పెట్టుబడి అవసరం. కాబట్టి దీర్ఘకాలిక రుణ స్థిరత్వ నష్టాలు ఎక్కువగా ఉన్నాయని ఐఎంఫ్‌ తెలిపింది. ప్రభుత్వ రుణం మధ్యకాలానికి దాని స్థూల జాతీయోత్పత్తి లేదా జీడీపీ 100 శాతం మించిపోవచ్చని బిజినెస్‌ స్టాండర్డ్‌ నివేదించింది. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ అప్పులు 2023 మార్చి నాటికి రూ.155.8 లక్షల కోట్లు. ఇది జీడీపీలో 57.3 శాతానికి సమానమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. నిరుద్యోగాన్ని, రైతాంగాన్ని, ధరల పెరుగుదలను అడ్డుకట్ట వేయకుండా బీజేపీ గెలుపునకు దారితీస్తున్న పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ తొమ్మిదిన్నరేళ్ల వైఫల్యాలను పరిశీలిస్తే అసలు విషయాలు అర్థమౌతాయి.


రిటైర్మెంట్‌లే తప్పా రిక్రూట్‌మెంట్‌లు లేవు


కేంద్రంలో బీజేపీ 2014 ఎన్నికల ప్రచారంలో అప్పటి యూపీఏ ప్రభుత్వ కుంభకోణాలను ప్రస్తావిస్తూ.. తమకు అవకాశం ఇస్తే పారదర్శకమైన పాలన అందిస్తామని దేశ ప్రజలకు హామీ ఇచ్చింది. సంకీర్ణ ప్రభుత్వాల వల్ల అభివృద్ధి కుంటుపడుతున్నదని కూడా చెప్పింది. 2014 నుంచి నరేంద్రమోడీ నేతృ్త్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏటా రెండు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన ఈ తొమ్మిదన్నరేళ్లలో దాదాపు 20 కోట్ల ఉద్యోగాలు కల్పించాలి. కానీ ఈ వాగ్దానం మాటలకే పరిమితమైంది. మోడీ ప్రభుత్వ హయాంలోనే 45 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. కాషాయ నేతల పాలనలో రిటైర్మెంట్‌లే తప్పా రిక్రూట్‌మెంట్‌లు లేవన్నది స్పష్టమౌతున్నది.


హామీల అమలు లేదు, అప్పులు మాత్రం ఇబ్బడిముబ్బడి


ఇవేకాకుండా 2022 నాటికి భారత దేశంలో ప్రతి ఇంటికి విద్యుత్‌ను అందిస్తామన్నది. ప్రతి ఇంటికి మరుదొడ్డి సౌకర్యం కల్పిస్తామన్నది. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పింది. బుల్లెట్‌ ట్రైన్‌ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నది. అందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చింది. అలాగే నల్లధనాన్ని అంతమొందించి ప్రతి ఒక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పింది. ఇవన్నీ మాటల దగ్గరే ఆగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వీటన్నింటిని నెరవేర్చలేదు. వీటి అమలు చేసేందుకు ప్రభుత్వం దగ్గర సరైన కార్యాచరణ లేదు. కానీ అప్పులు మాత్రం ఇబ్బడిముబ్బడిగా చేసింది.


రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు


కేంద్ర ప్రభుత్వం చెప్పిన రెట్టింపు సాధ్యం కావాలంటే ఆదాయం వ్యవసాయ రంగం వ్రృద్ధి రేటు 10.40 శాతం ఉండాలి. కానీ ఇప్పుడు వరకు సుమారు 3-4 శాతం మధ్యలోనే ఉన్నది. అందుకే 2014లో ఇచ్చిన హామీ 2022 వరకు సాధ్యం కాలేదు. దేశంలో ఇప్పటికీ ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తున్న ఈ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలైన కాటన్‌, జౌలి, ఆహార, ఆల్కాహాల్‌, ఔషధ ఇతర పరిశ్రమలు రానున్న రోజుల్లో ప్రమాదంలో పడనున్నదని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు.


రైతు పొలం నిలువాలంటే కనీస మద్దతు ధర, పరిశ్రమలతో సమానంగా వ్యవసాయ రంగానికి ప్రోత్సాహాన్నిఅందించాలి. కనీన మద్దతు ధర అంటే రైతులు పెట్టిన పెట్టుబడికి తగిన ఫలితం రావడం, గిట్టుబాటు ధర అంటే పెట్టుబడితో కూడిన లాభాలు రావడం. ఈ రెండూ కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా ప్రచారం చేస్తున్నది. కానీ ఆచరణలోకి వచ్చే వ్యవసాయ రంగాన్ని కుదేలుచేసే వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నది. అందుకే ఆ రంగంలో రాణించలేక వదిలివెళ్లే పరిస్థితి నెలకొన్నది.


45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం


కొవిడ్‌ కాలంలో ప్రపంచమంతా అతలాకుతలం అయ్యింది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగానే కాదు మన దేశంలోనూ అసంఘటిత రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఈ ప్రభుత్వ హయాంలోనే గత 45 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగిపోయింది. ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ రంగంలో మోడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ప్రైవేట్‌ రంగంలోనూ ఉద్యోగాల కల్పన చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం మన దేశంలో నిరుద్యోగం అన్నది పెద్ద సమస్యగా మారింది. యువత ఆశిస్తున్న ఉద్యోగాలు కల్పించాల్సిన మోడీ ప్రభుత్వం భావోద్వేగాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నదని విపక్షాల విమర్శలు వాస్తవం.


పెరిగిన అన్నిరకాల వస్తు, సేవల ధరలు


ద్రవ్యోల్బణం కూడా పెరిగిపోయింది. కొవిడ్‌ కాలంలో దాని కట్టడికి కొన్ని ఉద్దీపన పథకాలు అందించినా ఇప్పటికీ పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో అన్నిరకాల వస్తు, సేవల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు చాలా అవస్థులు పడుతున్నారు. ఇవే కాకుండా కేంద్ర ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచింది. ఇవన్నీ ప్రజలకు మోయలేని భారంగా మారాయి. ప్రజల సంక్షేమానికి తిలోదకాలు ఇచ్చి కార్పొరేట్‌ శక్తులకు కొమ్మకాస్తున్నది.


ఇలా చెప్పుకుంటూ వెళ్తే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు అనేకం. దేశ ప్రజలకు ఇచ్చిన హామీలపై విపక్షాలు పార్లమెంటులో, వెలుపల నిలదీస్తున్నాయి. కానీ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు లేదా లోక్ సభ ఎన్నికల నాటికి వచ్చేసరికి ఇవన్నీ అప్రధాన అంశాలుగా మిగిలిపోతున్నాయి. బీజేపీ ఎన్ని తప్పులు చేసినా గెలువడానికి కారణం వారి హిందుత్వ ప్రచారం, కారణం విపక్షాల అనైక్యత అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.


ఇటీవల మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలే కాదు, 2014 నుంచి వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ని ప్రజలు తిరస్కరించినా 2019లో తిరిగి గతంలో కంటే ఎక్కువ సీట్లతో ఎలా అధికారంలోకి వచ్చింది అన్నది అధ్యయనం చేయాలి. కనుక కేంద్రంలోనూ ప్రజలు మార్పు కోరుకోవడానికి సిద్ధంగా ఉన్నా దాన్ని అందిపుచ్చుకోవాలంటే విపక్షాల ఐక్యతతో పాటు ఉమ్మడి అజెండా చాలా కీలకం. ఎన్నికలకు ముందే ఇండియా కూటమికి ఉమ్మడి నాయకుడిని ముందు పెడితేనే మోడీ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడం సాధ్యమౌతుంది.

Latest News