పొంచి ఉన్న ఫిరాయింపు విస్ఫోటం!

అధికారం కోల్పోయి తొలిసారిగా స్వరాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలోకి మారిన బీఆరెస్‌కు అసలైన సవాళ్లు మునుముందు ఎదురుకాబోతున్నాయి.

  • Publish Date - December 12, 2023 / 12:50 PM IST
  • స్థానికంతో ఊపందుకోనున్న వలసలు
  • ఎమ్మెల్యేల నుంచి వార్డు మెంబర్ల దాకా అదే దారి
  • గతంలో రాజకీయ పునరేకీకరణ అన్న బీఆరెస్‌
  • ఇప్పుడు కాంగ్రెస్‌ అదే పని చేసే అవకాశాలు
  • తెరపైకి ‘నియోజకవర్గాల అభివృద్ధి కోసం’ వాదన


విధాత: అధికారం కోల్పోయి తొలిసారిగా స్వరాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలోకి మారిన బీఆరెస్‌కు అసలైన సవాళ్లు మునుముందు ఎదురుకాబోతున్నాయి. పదేళ్లుగా అధికారంలో ఉండి, కుటుంబ పార్టీగా అపకీర్తి మూటగట్టుకున్న బీఆరెస్‌లో సీఎం కేసీఆర్, కేటీఆర్‌, హరీశ్‌రావు, కవిత తప్ప ప్రభుత్వంలో మంత్రులతో సహా ఇతరులెవరూ తమ అభిప్రాయాలను స్వేచ్చగా వ్యక్తీకరించలేని పరిస్థితి ఉండేదనేది బహిరంగ రహస్యమే. అంతా డూడూబసవన్న పాత్రకే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల్లో ఓటమితో బీఆరెస్‌పై ఉన్న ప్రజావ్యతిరేకత స్పష్టంగా తేలింది.


దీంతో ఇక ముందు కచ్చితంగా ఆ పార్టీలో కేసీఆర్ కుటుంబ ఏకపక్ష విధానాలను ప్రశ్నించే.. ధిక్కార గళాలు వినిపించే అవకాశం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదీగాక బొటాబొటీ మెజార్టీతో ప్రభుత్వాన్ని నడపడటం క్షేమం కాదన్న ఆలోచనల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ బీఆరెస్ నుంచి వలసలను ప్రొత్సహించడం ఖాయమన్న చర్చలూ జరుగుతున్నాయి. ఇందుకోసం ‘నియోజకవర్గ అభివృద్ధి కోసం’ అనే వాదాన్ని ముందుకు తెస్తారని అంటున్నారు. దీంతో ఎమ్మెల్యేల స్థాయిలోనూ అధికార బీఆరెస్‌కు ఫిరాయింపుల ముప్పు పొంచి ఉందని చెబుతున్నారు.


ఇది ఒకరకంగా ‘నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష’ అన్న చందంగా ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2014 ఎన్నికల్లో మెజార్టీ పెంచుకునేందుకు బీఆరెస్ అధినేత కేసీఆర్ ఫిరాయింపుల వ్యూహంతో టీడీఎల్పీని విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 2018లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా ఇదే పద్ధతిలో కలుపుకొన్నారు. అదేంటంటే.. రాజకీయ పునరేకీకరణ అని పార్టీ పెద్దలు చెబితే.. నియోజకవర్గాల అభివృద్ధి కోసమే పార్టీ మారామని ఎమ్మెల్యేలు చెప్పేవారు. ఇప్పుడు అదే మళ్లీ రిపీటయ్యేందుకు అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు.


స్థానికంలో ఊపందుకోనున్న వలసలు


సమీపిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు కూడా బీఆరెస్‌ను మరింత కలవర పెడుతున్నాయి. వరుసగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌, జిల్లా పరిషత్ ఎన్నికలు, తదుపరి సహకార ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు రానున్నాయి. బీఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్ల కాలంలో రెండు పర్యాయాలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించారు.


ఆ సందర్భంగా గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లను, మాజీ ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో బీఆరెస్‌లోకి చేర్చుకున్నారు. గ్రామాల్లో పనులు కావాలంటే ప్రభుత్వ పార్టీలో చేరాలన్న సాకుతో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బీఆరెస్‌లోకి అప్పట్లో వలసల పర్వం సాగించారు.


ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో అదే వలసల విధానం (స్ట్రాటజీ)తో బీఆరెస్ నుంచి కాంగ్రెస్‌లోకి తిరిగి పెద్ద సంఖ్యలో వలసలకు తెరలేచే అవకాశాలు ఉన్నాయన్న చర్చ గట్టిగా సాగుతున్నది. అధికార పార్టీలోకి సాగే వలసలకు అడ్డుకట్ట వేయడం బీఆరెస్‌కు అంత సులభం కాదంటున్నాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే బీఆరెస్‌లో చేరకముందు వారిలో మెజార్టీ స్థానిక నేతలు గతంలో కాంగ్రెస్‌లో ఉన్నవారే. ఆ రీత్యా బీఆరెస్ నుంచి సాగే వలసల ప్రక్రియతో ఆ పార్టీ సంస్థాగతంగా కొంత బలాన్ని కోల్పోక తప్పదంటున్నారు.


పురపాలికల్లో జోరందుకున్న అవిశ్వాసాలు


ప్రభుత్వం మారడంతో తెలంగాణలోని మున్సిపాల్టీల్లో ప్రస్తుత చైర్మన్లపై అవిశ్వాసాలు మళ్లీ ఊపందుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, తర్వాత అధికార బీఆరెస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటూ గులాబీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు సంధిస్తున్నారు. కౌన్సిలర్ల బలాబలాల సమీకరణలో తేడాలు రావడంతో అవిశ్వాస ప్రక్రియ రాజుకుంటున్నది. మున్సిపాల్టీ చైర్మన్‌లపై అవిశ్వాసాల పర్వంలో నల్లగొండ మున్సిపాల్టీ, హాలియా, భువనగిరి, మంచిర్యాల, బెల్లంపల్లి, సత్తుపల్లి, ఆర్మూర్‌, రామగుండం కార్పొరేషన్‌, బోధన్‌, జవహర్‌నగర్‌, బోడుప్పల్‌, పీర్జాదిగూడ కార్పొరేషన్లలో, మేడ్చల్‌, దమ్మాయిగూడ, ఘట్‌కేసర్ సహా మరో 20కిపైగా మున్సిపాల్టీల్లో అవిశ్వాస ప్రహసనం మళ్లీ ఊపందుకుంది.