ISRO | ఆ రోజు.. అంత‌రిక్షంలో చెత్త ఎక్కువ‌గా ఉంది.. అందుకే ప్ర‌యోగం ఆల‌స్యం: ఇస్రో ఛైర్మ‌న్ సోమ‌నాథ్‌

ISRO | తాజాగా ఇస్రో (ISRO) ఛైర్మ‌న్ చేసిన ఓ ప్ర‌క‌ట‌న అంత‌రిక్ష ప్రేమికుల‌ను ఉలిక్కిప‌డేలా చేసింది. గ‌త నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఉప‌గ్ర‌హాల్ని అంత‌రిక్షంలోకి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ ప్ర‌యోగం చివ‌రి క్ష‌ణంలో తాము ప‌డ్డ ఒక ఇబ్బందిని ఇస్రో ఛైర్మ‌న్ ఎస్ సోమ‌నాథ్ పంచుకున్నారు. ఆ రోజు ప్ర‌యోగం ఉద‌యం 6:30కి చేయాల్సి ఉండ‌గా.. ఒక నిమిషం ఆల‌స్యంగా 6:31కి రాకెట్‌ను పంపామ‌ని తెలిపారు. […]

  • Publish Date - August 7, 2023 / 12:32 PM IST

ISRO |

తాజాగా ఇస్రో (ISRO) ఛైర్మ‌న్ చేసిన ఓ ప్ర‌క‌ట‌న అంత‌రిక్ష ప్రేమికుల‌ను ఉలిక్కిప‌డేలా చేసింది. గ‌త నెల 30వ తేదీన పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన ఉప‌గ్ర‌హాల్ని అంత‌రిక్షంలోకి తీసుకెళ్లిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆ ప్ర‌యోగం చివ‌రి క్ష‌ణంలో తాము ప‌డ్డ ఒక ఇబ్బందిని ఇస్రో ఛైర్మ‌న్ ఎస్ సోమ‌నాథ్ పంచుకున్నారు. ఆ రోజు ప్ర‌యోగం ఉద‌యం 6:30కి చేయాల్సి ఉండ‌గా.. ఒక నిమిషం ఆల‌స్యంగా 6:31కి రాకెట్‌ను పంపామ‌ని తెలిపారు.

దీనికి కార‌ణం అంత‌రిక్షంలో భూమి చుట్టూ ప‌రిభ్ర‌మిస్తున్న శాటిలైట్లు, వాటి శిథిలాల ట్రాఫిక్ (Space Traffic) ఎక్కువ‌గా ఉండ‌ట‌మేన‌న్నారు. స‌రిగ్గా ప్ర‌యోగ స‌మ‌యంలో శ్రీ‌హ‌రికోట పైన 500 కి.మీ. ఎత్తులో గ‌గ‌న‌త‌లం అంతా శాటి లైట్ల‌తో నిండిపోయింది. దీంతో ప్ర‌యోగాన్ని ఒక నిమిషం వాయిదా వేయాల్సి వ‌చ్చింది అని పేర్కొన్నారు. దీంతో అంత‌రిక్ష ట్రాఫిక్ గురించి మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది.

అంత‌రిక్షం విశాలంగా చాలా భాగం ఖాళీగా ఉంటున్న‌ట్లు మ‌నం ఊహించికుంటున్నా.. భూమి నుంచి 500 కి.మీ. ఎత్తులో మాత్రం శాటిలైట్లు, వాటి వ్య‌ర్థాలు, ఇత‌ర ప‌రిక‌రాల చెత్త‌ (Space Debris) తో అంత‌రిక్షం నిండిపోయింది. ఇస్రో 2023లో చేప‌ట్టిన ఓ అధ్య‌యనం ప్ర‌కారం.. సుమారు 27 వేల పెద్ద వ‌స్తువులు అంత‌రిక్షంలో నిరంతరం ప‌రిభ్రమిస్తున్నాయ‌ని తేల్చారు.

10 సెం.మీ. క‌న్నా చిన్న చిన్న వ‌స్తువులు అంత‌రిక్షంలో ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్నాయి. ఇవి శాటిలైట్ల‌కు, అంత‌రిక్ష కేంద్రాల‌కు, సుదూరంగా ప్ర‌యాణించే భారీ రాకెట్ల‌కు తీవ్రమైన ముప్పు క‌లిగిస్తాయి. మ‌రోవైపు శాటిలైట్ల‌ను కూల్చే సామ‌ర్థ్యం ఉన్న చైనా, ర‌ష్యా, యూఎస్‌, ఇండియా దేశాలు చేసే ప్ర‌యోగాల వ‌ల్ల ఇలా చిన్న చిన్న శిథిలాలు పెరుగుతూ పోతున్నాయి.

దీనిని దృష్టిలో ఉంచుకునే 500 కి.మీ. ఎత్తున ఉన్న ఆర్బిట్‌లో ఉప‌గ్ర‌హాల‌ను ప్ర‌వేశ‌పెట్టాల్సి ఉన్న‌ప్ప‌టికీ.. వ‌సుధైక కుటుంబం భావ‌న‌తో 300 కి.మీ. ఎత్తులోనే శాటిలైట్ల‌ను ప్ర‌వేశ‌ పెడుతున్నామ‌ని సోమ‌నాథ్ వివ‌రించారు. దీని వ‌ల్ల రాకెట్ నాలుగో ద‌శ 30 రోజుల్లోనే భూ వాతావ‌రణంలోకి ప్ర‌వేశించి మండి పోతుందని.. 500 కి.మీ. ఎత్తులో అయితే ఈ ప్ర‌క్రియ పూర్తి కావ‌డానికి 18 ఏళ్లు ప‌డుతుంద‌ని ఆయ‌న వివ‌రించారు.

ప్ర‌స్తుతం ఉన్న అంత‌రిక్ష చెత్త‌లో 40 శాతం అమెరికాది కాగా.. 28 శాతం ర‌ష్యా, 19 శాతం చైనాదేన‌ని ఇస్రో త‌యారు చేసిన స్పేస్ సిట్యుయేష‌న‌ల్ అసెస్‌మెంట్ రిపోర్టు పేర్కొంది. అదే భార‌త్ వాటా ఇందులో కేవ‌లం 0.8 శాతం మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం.

Latest News