విధాత: మొదటి పందెం ఎవరిదైతే వాళ్లదే విజయం.. ప్రత్యర్థి ఇంకా సర్దుకోకముందే మనం ఎత్తులు వేస్తే సగం విజయం సాధించినట్లే… సేమ్ ఇదే వ్యూహాన్ని జగన్ అమలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలయిన టిడిపి, జనసేన వంటివి ఇంకా ఎన్నికల మూడ్లోకి వెళ్లకముందే, వాళ్ళింకా అభ్యర్థుల వెతుకులాటలో ఉండగానే తమ అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వెళ్లాలన్నది జగన్ వ్యూహం లా ఉంది. అంటే దాదాపు ఏడాది ముందే అభ్యర్థులను ప్రజల్లోకి పంపితే వారికి ఓ అవగాహన ఉంటుంది.. ప్రజలకూ పరిచయం అవుతుంది. ఈ ఆలోచనతోనే జగన్ సాగుతున్నారు.
తాజాగా జరిగిన వైసీపీ ఎమ్మెల్యేల మీటింగులో పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు వంద రోజుల టైం ఇస్తున్నట్లుగా జగన్ చెప్పారు. మార్చి నెలాఖరు లోగా తమ గ్రాఫ్ ని పెంచుకోవాలని జగన్ చెప్పేశారని అంటున్నారు. అపుడు సర్వేల నివేదికను బట్టి వారి పనితీరుని మరో మారు బేరీజు వేస్తామని ఆయన పేర్కొన్నారని అంటున్నారు.
దీనిని బట్టి చూస్తే పనిచేసే వారికి టికెట్లు అన్న సూత్రం ఆధారంగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో నిర్వహించే మీటింగులో ఎవరికి టికెట్లు రావో అన్నది జగన్ క్లారిటీగా చెప్పేస్తారు అని అంటున్నారు. అదే టైం లో టికెట్లు లభించని వారి స్థానంలో కొత్త వారు వస్తారు అని అంటున్నారు. అంటే వారికి టికెట్లు ప్రకటించి ఏడాది ముందు నుంచే పనిచేసుకోమని చెబుతారు అని అంటునారు.
ఇంకా పనితీరు బాగున్న వారందరికీ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, వచ్చే ఎన్నికల్లో మీరే అభ్యర్ధులు అంటూ వారిని జనంలోకి పంపిస్తారు అని అంటున్నారు. ముందుగా అభ్యర్ధులను ఖరారు చేస్తే వారికి వీలైనంత ఎక్కువ సమయం జనంలో ఉండేందుకు దొరుకుతుంది అని, అది ఎన్నికల వేళ పూర్తిగా అనుకూలంగా మారుతుందని జగన్ ఆలోచన.
మొత్తానికి చూస్తే అందరి కంటే ముందే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన అయితే ఉంటుంది అని అంటున్నారు. ఇప్పటికే దాదాపు 32 మందికి టికెట్లు ఇవ్వడం కష్టం అని ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏప్రిల్లో చాలావరకూ అభ్యర్థుల జాతకాలు మీద క్లారిటీ వస్తుందని అంటున్నారు.