Tirumala | తిరుమల శ్రీవారిని చిరుతలు కలవరానికి గురి చేస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అటవీశాఖ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా చిరుతలు జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి చేరుతున్నాయి. ఇటీవల నడకదారి మార్గాల్లో చిరుతలు భక్తులను భయాందోళనకు గురి చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోన్లలో వాటిని బంధించి సురక్షిత ప్రాంతాలకు వాటిని తరలించారు. తాజాగా అలిపిరి మార్గంలో మరో చిరుతపులి ప్రత్యక్షమైంది.
దీంతో భక్తులు మళ్లీ ఆందోళనకు గురవుతున్నారు. నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం దగ్గర చిరుత సంచరిస్తుంది. గతవారం కిందట ఈ ప్రాంతంలోనూ చిరుత సంచరించింది. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. నడకదారి భక్తులను గుంపులుగా భద్రతా సిబ్బంది అనుమతిస్తున్నది. గతంలో నెల్లూరుకు చెందిన ఆరేళ్ల బాలిక చిరుత దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం అటవీశాఖ సహకారంతో ఐదు చిరుతలను బంధించింది.
చిరుత దాడి ఘటన తర్వాత నడక మార్గానికి ఇరువైపులా కెమెరా ట్రాప్‌లను ఏర్పాటు చేశారు. వీటిలో పలు కెమెరాల్లో చిరుత పులుల కదలికలను గుర్తిస్తున్నారు. అయితే, నడకదారి మార్గంలో భక్తులు ఆహార పదార్థాలు పడేయడం, వన్యప్రాణులకు అందించడం వంటి పనులు చేస్తున్నది. దీంతో జింకల వంటి జంతువులు జనసంచారం ఉన్న ప్రాంతాల్లోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే జింకలు, ఇతర జంతువులు వాటిని వేటాడేందుకు వస్తున్నట్లుగా అటవీశాఖ అధికారులు పేర్కొంటున్నారు