విధాత: ట్రాన్స్ జెండర్లు తమ పేర్లను నేషనల్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడానికి కేంద్రం అవకాశం కల్పించిందని రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ బి.శైలజ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ట్రాన్స్ జెండర్లు తమ పేర్లను http://transgender.dosje.gov.in/ నేషనల్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ, లింగమార్పిడి వ్యక్తుల ట్రాన్స్ జెండర్ (హక్కుల రక్షణ) చట్టం, 2019ని అమలులోకి తెచ్చిందని, చట్టంలోని నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం “ట్రాన్స్ జెండర్ పర్సన్స్ (హక్కుల రక్షణ) నియమాలు, 2020”ని కూడా సిద్ధం చేసిందని పేర్కొన్నారు.
లింగమార్పిడి వ్యక్తులు స్కాలర్‌షిప్‌లు, స్కిల్ డెవలప్‌మెంట్ మరియు ఎంప్లాయ్‌మెంట్, కాంపోజిట్ మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్, TG సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డ్ వంటి సంక్షేమ పథకాలను పొందేందుకు కేంద్ర మంత్రిత్వ శాఖ వన్-స్టాప్ పోర్టల్‌ను ప్రారంభించిందని తెలిపారు.
ఆ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ప్రతి దరఖాస్తుదారుడు పథకాల ప్రయోజనాలను పొందేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ నంబర్(యూనిక్ రిజిస్ట్రేషన్ నెంబర్)ను అందజేస్తామని వెల్లడించారు. ట్రాన్స్ జెండర్లు ఆ పోర్టల్ లో తమ పేర్లను నమోదు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగంచుకోవాలని బి.శైలజ ఆ ప్రకటనలో కోరారు.