TSRTC | ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. డిసెంబర్ 26న అరుణాచల క్షేత్రానికి పౌర్ణమి సందర్భంగా ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులను నడిపించనున్నట్లు రంగారెడ్డి రీజియన్ మేనేజర్ శ్రీధర్ తెలిపారు. బస్సు ఈ నెల 24 రాత్రి 8 గంటలకు ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుంది.
మరుసటి రోజు కాణిపాకం వినాయకుడి దర్శనం ఉంటుంది. అనంతరం వేలూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సందర్శిస్తారు. అదే రోజు రాత్రి 10 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. 26న అరుణాలచం గిరి ప్రదక్షిణ చేస్తారు. అనంతరం రాత్రి బయలుదేరి 27న ఎంజీబీఎస్‌కు బస్సు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
అరుణాచలం వెళ్లాలనుకునే భక్తులు ఒక్కొక్కరికి రూ.3690 చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న ప్రయాణికులు ఆర్టీసీ అధికారిక వెబ్‌సైట్ tsrtconline.inలో సంప్రదించాలని సూచించారు. అలాగే ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌తో పాటు ఆర్టీసీ టికెట్ కేంద్రాల్లోనూ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.
వివరాలకు 9959226257, 9959224911, 9959226246 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఇదిలా ఉండగా.. గతంలోనూ టీఎస్ ఆర్టీసీ అరుణాచలం గిరి ప్రదక్షిణ కోసం ప్రత్యేకంగా బస్సులు నడుపగా.. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఆర్టీసీ తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ ఉన్న ప్రముఖ ఆలయాలకు ప్రత్యేకంగా సర్వీసులు నడుపుతున్నది.