విధాత: టీవీ9 మాజీ సీఈవో రవి ప్రకాశ్ మీడియాలోకి తిరిగి పునరాగమనం చేయనున్నారా? ఐ న్యూస్ ద్వారా ఆయన రీ ఎంట్రీ ఇవ్వనున్నారా? జనవరిలో దీనికి ముహూర్తం ఖరారైందా? అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొదటిసారి కొలువుదీరిన్నప్పుడు అసెంబ్లీలో అధికారపార్టీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారిపై టీవీ 9లో వెటకారంగా ఒక స్టోరీ వచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ కావడం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేయడం, అనంతరం జరిగిన పరిణామాలలో రవి ప్రకాశ్ టీవీ 9 బాధ్యతల నుంచి తప్పుకోవడం వంటి విషయాలు విదితమే.
అయితే ప్రస్తుతం టీఆర్‌ఎస్ పేరు బీఆర్‌ఎస్‌గా మారడం, కేసీఆర్ వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత జాతీయస్థాయి రాజకీయాల్లోకి వెళ్తారని, కేటీఆర్‌కు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారనే చర్చ చాలాకాలంగా జరుగుతున్నది. కేసీఆర్ నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లినా అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ సీఎం అవుతారని అంటున్నారు.
దీని కోసం ఇప్పటి నుంచే కేసీఆర్ కసరత్తు చేస్తున్నారట. మీడియా రంగంలో తనదైన ముద్ర వేసిన రవిప్రకాశ్ కేసీఆర్, కేటీఆర్ కొన్ని నెలల కిందటే సమావేశమైనట్టు తెలుస్తోంది. గతంలో వారి మధ్య వచ్చిన విభేదాలను పక్కనపెట్టి తిరిగి ఆయనకు మీడియాలో కీలక బాధ్యతలు అప్పగించనున్నారనే సమాచారం. ఇందులో భాగంగానే తొలివెలుగు కూడా అధికారపార్టీ చేతుల్లోకి వెళ్లిందనే వార్త ప్రస్తుతం మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతున్నది.
సంక్రాంతి నాటికి మీడియా రంగంలోకి రవిప్రకాశ్ ఎంట్రీతో పాటు మరికొన్ని కొత్త మీడియా సంస్థలు పురుడుపోసుకోనున్నాయట. బీఆర్‌ఎస్‌ను వివిధ రాష్ట్రాల్లో విస్తరించడానికి కేసీఆర్ ప్రణాళికలు రూపొందిం చారని, ఏ రాష్ట్రంలో ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే కూర్పు కూడా కొంతకాలంగా జరుగుతున్నది. కేసీఆర్ ఇప్పటికే వివిధ రాష్ట్రాల ప్రాంతీయ పార్టీ నేతలతో, ప్రముఖులతో బీఆర్‌ఎస్‌కు సంబంధించి సంప్రదింపులు చేశారు.
వారి కార్యాచరణ, ప్రణాళికల అమలుచేయనున్నారు. ఇదంతా మీడియా ద్వారా ప్రజల్లోకి చేరవేసేలా.. తెలంగాణలో పార్టీ పరిస్థితి ఎలా ఉన్నది, వివిధ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది అంతా కేసీఆర్ టీం జనవరి తర్వాత నుంచి స్పీడప్ చేయనున్నారు. ఆయనకు వీటికి సంబంధించిన క్షేత్రస్థాయి రిపోర్టు త్వరలో ఏర్పాటు ప్రారంభం కానున్న మీడియా సంస్థలు నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం.