విధాత: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన గురించి వదిలేయండని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది.. ఎవరి ప్రయోజనాలు కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ ఇలా వ్యవహరిస్తున్నారు? అని ప్రశ్నించారు.
విభజన అన్యాయం గురించి మాట్లాడటానికి సీఎం జగన్‌కు భయం ఎందుకు? అని నిలదీశారు. పోరాటం చేసి వైఎస్ జన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, ఇప్పుడు జగన్ పోరాటం చేస్తారని ప్రజల్లో నమ్మకం పోతోందన్నారు. అయితే, ఇప్పటికైనా ఏపీకి జరుగుతోన్న అన్యాయంపై జగన్ పోరాటం చేయాలని సూచించారు. పోరాటం చేయకుంటే వైఎస్ జగన్ రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్ పడ్డట్టేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై పోరాటం చేయకపోవడం వల్లే చంద్రబాబుకు 23 సీట్లు రావడానికి ఒక కారణంగా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్‌కు మధ్య మంచి సంబంధాలు ఉండొచ్చు.. కానీ, రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రం రాజీ పడకూడదు అని హితవు పలికారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 22వ తేదీన తుది విచారణ జరగనుంది. ఆరోజుకైనా రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం వివరిస్తూ అఫిడవిట్ వేయాలని సూచించారు.
మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్‌కుమార్ విభజన బిల్లు పాస్ చేసే సమయంలో రాజ్యసభలో టెలీ కాస్టింగ్ ఆపివేశారు. రాజ్యసభలో ఓటింగ్ పెట్టకుండా ఏకపక్షంగా తీర్మానించారు. ఆనాడు రిస్క్ తీసుకోవడం ఇష్టంలేక డివిజన్ చేశామని వెంకయ్య నాయుడు ఓ సందర్భంలో చెప్పారని ఈ సందర్భంగా గుర్తుచేశారు ఉండవల్లి. జనవరి 30, 2012లో ఏం జరిగిందో తన దగ్గర అన్ని ఆధారాలు Iన్నాయి. ఆర్టికల్ 100ను తుంగలో తొక్కి రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఇన్నాళ్లకు ఏకపక్ష రాష్ట్ర విభజనపై కోర్టులో మాట్లాడగలిగే అవకాశం వచ్చిందన్నారు.
ఎనిమిదేళ్లు అయ్యింది.. కానీ, కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కౌంటర్ వేయలేదన్నారు. ఫిబ్రవరి 22 వ తేదీన రాష్ట్ర విభజన కేసును విచారించాలా.. లేదా వదలి వేయాలన్నది చూద్దామని, ముందు కేంద్ర ప్రభుత్వం కౌంటర్ వేయాలని ధర్మాసనం తెలిపింది.. కానీ, ఏపీ ప్రభుత్వం వదిలేయమని అఫిడవిట్ వేసిందని ఉండవల్లి అరుణ్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు