- బీఆర్ఎస్‌కు షాకిచ్చిన బీజేపీ సర్కార్
విధాత: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (Visakha Steel Plant) ప్రైవేటీకరణ ఆగలేదని, కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రైవేటీకరణ నిలిపివేస్తున్నట్లు వస్తున్న వార్తలను కేంద్రం కొట్టిపారేసింది.
స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ క్యాబినెట్ కమిటీ తీర్మాణం ప్రకారం కొనసాగుతోందని తెలిపింది. ప్రభుత్వం, కంపెనీ సహకారంతో ఉపసంహరణ ప్రక్రియ కొనసాగుతోందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
అయితే బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆశలు ఆవిరయ్యేలా కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఈ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. తమ ఒత్తిడి మూలంగానే, సింగరేణి కాలరీస్ కంపెనీ ద్వారా పెట్టుబడులకు సిద్ధమని ప్రకటిచండంతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి పెట్టుబడుల ఉపసంహరణ లేదని కేంద్ర ఉక్కు సహాయ మంత్రి ప్రకటించారని తెలంగాణ మంత్రులు కేటీఆర్, టి.హరీశ్ రావు లు గురువారం గొప్పగా చెప్పుకున్నారు. తమ పార్టీ నిర్ణయం మూలంగానే కేంద్రం దిగివచ్చిందని, పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయం వెనక్కి తీసుకున్నదని తెలిపారు.
ఈ మేరకు ఆంధ్రా, తెలంగాణలో బిఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి కూడా. తెలంగాణ ప్రభుత్వానికి, బిఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలేలా కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగి తీరుతుందని, యూ టర్న్ తీసుకోవడం లేదని కుండబద్దలు కొట్టింది.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంలో బిఆర్ఎస్ ఏ నిర్ణయం తీసుకోనుందనేది తెలియాల్సి ఉంది. శుక్రవారం నాడు విశాఖపట్నంలోని స్టీల్ ప్లాంట్ ముందు ఏర్పాటు చేసి బిఆర్ఎస్ జెండాలను స్థానిక బిజెపి నాయకులు పీకి పారేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.