యుద్ధోన్మాద అమెరికా పెంపుడు బిడ్డగా ఐరాస‌

ఐరాస‌ పుట్టిన రోజు పాలస్తీనాకు మరణశాసన దినమా?

మొదటి ప్రపంచ యుద్ధోన్మాద బూడిద కుప్పల్లో పిచ్చిమొక్కగా మొలిచి, రెండో ప్రపంచ యుద్ద తొలి జ్యాలలకి దగ్ధమైన నానాజాతి సమితి దారిలో వ‌చ్చిన‌ది ఐక్య రాజ్య స‌మితి.

హిరోషిమా, నాగసాకి అణు మారణ హోమం సృష్టించిన యుద్ధోన్మాద రాజ్యపు ఊయలలో ఎదిగిన శిశువే ఐరాస‌!

అక్టోబ‌ర్ 24.. ఐరాస‌ 78వ పుట్టిన రోజు! అది పుట్టిన రోజు ప్రపంచ ప్రజలకు విషాద దీనంగా మారింది. ఆ రోజే గాజాలో మృతుల సంఖ్య ఐదు వేలకు, వెస్ట్ బ్యాంక్‌లో వందకు చేరడం విషాదాల్లో కెల్లా ఓ పెను విషాదం.

తనకు ఏడాదిన్నర ఏళ్ల వయస్సులో పాలస్తీనాపై 15-5-1947న ఐరాస‌ 11 దేశాలతో ఒక ప్రత్యేక కమిషన్ వేసింది. దాని పాల‌స్తీనా ప‌ర్య‌ట‌న రోజు నల్లజండాలతో సార్వత్రిక సమ్మెలతో అరబ్బులు నిరసనల్ని తెలిపారు. అది వాటిని ఖాతరు చేయకుండా యూదుల నుండి ఏకపక్షంగా 32 టన్నుల వినతిపత్రాలు స్వీక‌రించింది. తీర్పు ఇవ్వడానికి బరితెగించిన చరిత్రను రెండేళ్ల లేత వయస్సులో అది మూటకట్టుకుంది. ఐరాస‌ వికృత జననమది.

25-11-1947న పాలస్తీనా దేశ విభజన తీర్మానం ఓటమి పొందే పరిస్థితుల్లో యూదు దురహంకార శక్తుల ప్రయోజనాల కోసం ఎన్నిక మరో మూడు రోజులు వాయిదా వేసిన దుష్ట చరిత్ర ఐరాస‌ది.

29-11-1947న యూదు రాజ్య స్థాపన తీర్మానం నెంబర్ 181 ని బ్లాక్ మెయిల్ పద్ధతుల్లో నెగ్గించుకున్న శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మారిన చరిత్ర ఐరాస‌ది. తన రెండవ పుట్టిన రోజు తర్వాత నెల రోజులకే జరిగిన పరిణామమది.

1-4-1948న (ఏప్రిల్ ఫూల్ డే) ఐరాస భ‌ద్ర‌తామండ‌లి తీర్మానం నంబర్ 44, అదే నెల 17వ తేదీన 46, తిరిగి 23వ తేదీన 48వ తీర్మానాలు కూడా ఐరాస‌ ప్రారంభ పుట్టుమచ్చలే.

పాలస్తీనా దేశాన్ని బ్రిటీష్ పాలకులు 14-5-1948న విడిచిపెట్టి వెళ్లిన రెండు నెలలకు ఐరాస తన నేతృత్వంలో రెండు దేశాల సరిహద్దులు గీసి దేశ విభజన జరగాల్సి ఉంది. తనను ఖాతరు చేయకుండా యూదు జాత్యహంకార శక్తులు ఆ తెల్లారే (15-5-1948) ఏకపక్షంగా ఇజ్రాయెల్ ఏర్పాటు జరిగినట్లు ప్రకటించుకొని, అదేరోజు ఐదు వేల పాలస్తీనియన్ అరబ్బుల గ్రామాల్ని దగ్ధం చేసి, ఏడు లక్షల మందికి పైగా కట్టుబట్టలతో వెళ్ల‌గొడుతుంటే గుడ్లప్పగించి చూసిన చరిత్ర ఐరాస‌ది. దాని వయస్సు అప్పటికి రెండున్నర ఏళ్ళు!

కట్టుబట్టలతో వెళ్లిన వారి తరపున పొరుగు అరబ్ దేశాలు ఇజ్రాయెల్ మీద అదేరోజు యుద్ధానికి దిగాయి. ఆ సందర్భంగా 22-5-1948న కాల్పుల విరమణ తీర్మానం నెంబర్ 49 ఆమోదించింది. అది ఆచరణలో అమలు జరిగింది లేదు.

తరమబడ్డ పాలస్తీనా అరబ్బులు తిరిగి తమ స్వంత స్థలాలకు వచ్చే హక్కు ఉందనీ, 181 తీర్మానాన్ని ఇజ్రాయెల్ గుర్తించాలనీ, ఆక్రమిత ప్రాంతాల నుండి వెంటనే ఇజ్రాయెల్ వైదొలగాలనీ తదితర తీర్మానాలను వరసగా చేసింది. ఐనా నేటికీ దిక్కులేదు.

1949 లో పాలస్తీనాపై 8-12-49 నెంబర్ 302, 9-12-49 నెంబర్ 303, 10-12-49 నెంబర్ 356 తీర్మానాల్ని కూడా UNO ఆమోదించింది. నేటికీ దిక్కులేదు.

1950 లో మూడు, 1952లో నాలుగు, 1953లో రెండు, 54లో రెండు, 55లో రెండు, 56లో ఒకటి, 57లో మూడు, 58లో ఒకటి, 59లో ఒకటి, 60 లో ఒకటి, 61లో మూడు, 62లో రెండు, 63లో నాలుగు తీర్మానాల్ని ఆమోదించింది. వీటిలో 27-6-1963న UNO ప్రత్యేక సాధారణ సభ కూడా జరిగి 1874 & 1875 నెంబర్ తీర్మానాల్ని ఆమోదించింది. 1965లో నాలుగు, 66లో రెండు తీర్మానాల ఆమోదం జరిగింది. 1967లో ఆరు రోజుల అరబ్ ఇజ్రేలీ యుద్ధం జరిగింది. ఆ ఏడాది ఏడు తీర్మానాలు జరిగాయి. వాటికి కూడా దిక్కు లేదు.

1967 నుండి 1989 వరకు ఇదే పాలస్తీనా పై UNO భద్రతా సమితి మరో 131 తీర్మానాల్ని ఆమోదించింది. వాటి అమలుకూ దిక్కు లేదు

UNO ఆమోదించిన 194, 242, 338 నెంబర్ల తీర్మానాలకు చాలా అధిక ప్రాధాన్యత ఉంది. అవి పదేపదే పునరామోదం కూడా పొందాయి. తాను చేసిన గత తీర్మానాల్ని ఇజ్రాయెల్ అమలు చేయనందున వాటిని అమలు చేయాలంటూ పదేపదే తీర్మానాలను అది ఆమోదించింది. ఐనా కూడా దిక్కులేదు.

దేశ విభజన జరిగిన 65 ఏళ్లకు 29-11-2012న సాపేక్షికంగా ప్రాధాన్యత గల అంశం మీద ఐరాసలో ఓటింగ్ జరిగింది. పాలస్తీనాను ఐరాస‌లోకి నాన్ మెంబ‌ర్ దేశంగా తీసుకోవాలనే ప్రతిపాదన‌కు అనుకూలంగా 138 దేశాలో ఓటు వేశాయి. అమెరికాతో కలిసి 9 దేశాలు వ్య‌తిరేకించాయి. ఓ 40 దేశాలు ఓటింగ్‌లో పాల్గొన‌లేదు. పాలస్తీనాకు విశేష అండ లభించింది. ఐనా పాలస్తీనాను గానీ, పాలస్తీనా పౌరుల్ని గానీ ఇజ్రాయెల్ గుర్తించడం లేదు. ఆ తీర్మానాలను అమలు చేసిందీ లేదు.

2008లో కూడా గాజాపై ఇజ్రాయెల్ 13 రోజులు బాంబు దాడులు చేసింది. ఆ సందర్భంగా ఐరాస భ‌ద్ర‌తా మండ‌లి 8-1-2009న తీర్మానం 1860ని ఆమోదించింది. 15 దేశాల్లో 14 అనుకూల ఓటు చేశాయి. కనీసం కుంటిసాకు కూడా దొరక్క పోవడంతో అమెరికా వ్యతిరేక ఓట్ కూడా చేయలేదు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న‌ది. విశేషం ఏమంటే, 1860 తీర్మాన పాఠంలో 1967 నాటి 242; 1973 నాటి 338; 2002 నాటి 1397; 2003 నాటి 1515; 2008 నాటి 1850 నెంబర్ల తీర్మానాల్ని కూడా ఇజ్రాయెల్ అమలు చేయాలని ఆరోజు భ‌ద్ర‌తా మండ‌లి డిమాండ్ చేసింది.

పాలస్తీనా సమస్యపై 12-8-1949 నాటి జెనీవా కాన్ఫరెన్స్, యాబై ఏళ్ల తర్వాత 15-7-1999న మరోసారి ఇజ్రాయెల్ ఆక్రమిత ప్రాంతాల సమస్య పై జెనీవా కాన్ఫరెన్స్ జరిగాయి. ఆ నిర్ణయాల అమలు కోసం కూడా ఐరాస‌ చేసింది ఏమీ లేదు. పైగా పదేపదే నగ్నంగా ఉల్లంఘనలకు పాల్పడుతోంది.

1947 నుండి 2015 వరకు అమెరికా 80 సార్లు వీటో ప్రయోగించింది. ఆ 80 లో ఒక్క పాలస్తీనాపై దాదాపు సగం ఉండటం గమనార్హం.

అలాంటి ఐరాస‌ పుట్టిన రోజు ప్రపంచ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పే శుభదినం కాదు. అమెరికా చేతుల్లో కీలుబొమ్మగా మారి ప్రపంచ పీడిత ప్రజల కన్నీళ్లకు ఐక్య‌రాజ్య స‌మితి కూడా ఓ కారకురాలుగా మారింది. హిరోషిమా, నాగసాకి అణు మరణ హోమం సృష్టించిన యుద్ధోన్మాద అమెరికా పెంపుడు బిడ్డగా ఐరాస‌ ఎదిగింది. 1930 వ దశాబ్దంలో భౌగోళిక పునస్స‌మీకరణ దశ నానాజాతి సమితికి మరణ శాసనం రాసింది. బహుళ ధ్రువ ప్రపంచ స్థితి బలపడే నేటి క్రమం కూడా మున్ముందు ఐరాస‌కు అదే దుస్థితిని కల్పించే అవకాశం లేకపోలేదు. అది చచ్చే ముందు ఆఖరి రోజుల్లో ప్రపంచ ప్రజల శవాల దిబ్బల సాక్ష్యంగా తన పుట్టిన రోజు పండగ జరుపుకుంటుందేమో!

రక్తసిక్త పాలస్తీనా జాతి నిర్మూలనకు పూనుకునే దుష్ట లక్ష్యం జియోనిస్టు ఇజ్రాయెల్ ది. అది జారీ చేస్తోన్న డెత్ వారెంట్ పై అప్రకటిత సంతకందారు ఐరాస‌ కావడం గమనార్హం! బలపడుతోన్న బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు ఐరాస కూడా మున్ముందు బలిపశువుగా మారక తప్పదు. తాను చచ్చే ముందు కోట్లాది ప్రపంచ ప్రజలకు సామ్రాజ్యవాదం జారీ చేసే డెత్ వారెంట్ పై గంగిరెద్దులా చేవ్రాలు చేస్తున్నది. ఐతే అంతిమ పరిశీలనలో ప్రపంచ ప్రజలకు మరణం లేదు. ఐరాస‌తో పాటు దాని జన్మదాతలకు కుక్కచావు తప్పదు. కుక్కచావు చావబోయే ఐరాస‌ పుట్టిన రోజు ప్రపంచ ప్రజలకు శుభదినం కాదు. దాని మరణోణ్ముఖ దారిలో ఈ రోజు ఓ మజిలీయే.

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)

24-10-2023