Site icon vidhaatha

TTD గుడ్‌న్యూస్: 11 నుంచి హైద‌రాబాద్‌లో శ్రీవేంక‌టేశ్వర స్వామి వైభ‌వోత్సవాలు

విధాత‌: హైదరాబాద్‌ వాసులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమ‌ల‌లో శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామి వారికి జ‌రిగే నిత్య‌, వార‌సేవ‌లు, ఉత్స‌వాల‌ను ఇత‌ర ప్రాంతాల్లోని భ‌క్తులు ద‌ర్శించేందుకు వీలుగా దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల్లో వైభ‌వోత్స‌వాలు నిర్వ‌హిస్తున్నామ‌ని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఈనెల 11 నుంచి 15వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌ ఎన్‌టీఆర్ స్టేడియంలో వైభవోత్సవాలు జరుపనున్నారు.

అక్టోబ‌రు 10న ఈ ఉత్స‌వాల‌కు అంకురార్ప‌ణ జ‌రుగుతుంద‌ని.. ఐదు రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు నిత్య కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. వార‌పు సేవ‌ల్లో భాగంగా అక్టోబ‌రు 11న వ‌సంతోత్స‌వం, 12న స‌హ‌స్ర క‌ల‌శాభిషేకం, 13న తిరుప్పావ‌డ‌, 14న నిజ‌పాద ద‌ర్శ‌నం, 15న సాయంత్రం 6.30 నుంచి 8.30 గంట‌ల వ‌ర‌కు శ్రీ‌నివాస క‌ల్యాణం జ‌రుగుతుంద‌ని చెప్పారు. భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో విచ్చేసి స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోరారు.

ప‌విత్ర‌మైన కార్తీక మాసంలో గ‌తేడాది త‌ర‌హాలో విశాఖ‌ప‌ట్నం, క‌ర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌ని ఛైర్మ‌న్ వెల్ల‌డించారు. డిసెంబ‌ర్‌లో ప్ర‌కాశం జిల్లా ఒంగోలులో, జ‌న‌వ‌రిలో ఢిల్లీలో శ్రీవేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ఉత్త‌రాయ‌ణంలో చెన్నైలోని శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి ఆల‌యం, జ‌మ్మూలోని శ్రీవారి ఆల‌యాల‌కు మ‌హాసంప్రోక్ష‌ణ జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

అహ్మ‌దాబాద్ న‌గ‌రంలో శ్రీ‌వారి ఆలయ నిర్మాణానికి గుజ‌రాత్‌ ప్ర‌భుత్వం 5 ఎక‌రాల స్థ‌లం ఇచ్చింద‌ని, త్వ‌ర‌లో భూమిపూజ చేస్తామ‌ని చెప్పారు. అక్టోబ‌రు నెల‌లో ఏజ‌న్సీ ప్రాంతాలైన అన‌కాప‌ల్లి, అర‌కు, రంప‌చోడ‌వ‌రం త‌దిత‌ర ప్రాంతాల్లో శ్రీ‌నివాస క‌ల్యాణాలు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

Exit mobile version