Site icon vidhaatha

Vidudhala | విడుదల సినిమా ‘రివ్యూ’: ‘పార్ట్ 1 పాస్.. పార్ట్ 2లో విశ్వరూపం చూపాలి’

మూవీ పేరు: ‘విడుదల పార్ట్ 1’ (Vidudhala: Part 1)
విడుదల తేదీ: 15 ఏప్రిల్, 2023
నటీనటులు: సూరి, విజయ్ సేతుపతి, భవానీ శ్రీ, గౌతమ్ మీనన్, రాజీవ్ మీనన్, చేతన్ కె తదితరులు
సంగీతం: ఆర్. వేల్‌రాజ్
ఎడిటింగ్: రమర్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
రచన, దర్శకత్వం: వెట్రిమారన్

రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో సినిమాలు తీసే వాళ్లు బహు అరుదుగా ఉంటారు. తెలుగులో అయితే కృష్ణవంశీ, సుకుమార్ వంటి వారు ఎన్నుకునే కథలు.. మట్టి కథలు, మట్టి మనుషులను పోలి ఉంటాయి. సహజత్వానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు వారి సినిమాల కోసం వేచి చూస్తుంటారు. కోలీవుడ్‌కి వచ్చే సరికి కృష్ణవంశీ, సుకుమార్‌ ఇద్దరూ ఒక్క దర్శకుడిలోనే కనిపిస్తే ఎలా ఉంటుందో అతనే వెట్రిమారన్.

మట్టి కథలతో సినిమాలు తెరకెక్కించడంలో వెట్రిమారన్ దిట్ట. అందుకే ఆయన సినిమాలకు అవార్డులు వస్తుంటాయి. ఆర్టిస్ట్‌లలోని నటనను పిండుకోవడంలో కూడా వెట్రిమారన్‌ది అందెవేసిన చేయి. అందుకే ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే.. ఖచ్చితంగా ఏదో విషయం ఉంటుందనే భావన తమిళ తంబీలలో ఉంటుంది. ఇతర ఇండస్ట్రీల కన్ను ఆయన సినిమాలపై ఉంటుంది.

అలాంటి దర్శకుడి నుంచి తాజాగా వచ్చిన చిత్రం ‘విడుదల పార్ట్ 1’. కోలీవుడ్‌లో ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం.. అక్కడ పాజిటివ్ టాక్‌తో పాటు మంచి కలెక్షన్స్‌ను రాబడుతుండటంతో.. విడుదలైన అతి తక్కువ సమయంలోనే.. డబ్ చేసి తెలుగులో వదిలారు. కమెడియన్ సూరి హీరోగా.. విజయ్ సేతుపతి ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటించిన ఈ చిత్రం శనివారం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం.. తెలుగు ప్రేక్షకులని ఏ మేరకు ఆకట్టుకుందో మన సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

వెట్రిమారన్ సినిమాలలో ఉండే ప్రధాన బలం సంఘర్షణ, ఎమోషన్స్. ఒక సంఘటన జరిగినప్పుడు.. ఆ ఫ్యామిలీకి చెందిన లేదా వృత్తికి చెందిన వ్యక్తి ఎలాంటి సంఘర్షణను అనుభవిస్తాడనే దానిని టార్గెట్ చేస్తూ వెట్రిమారన్ సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గతంలో వచ్చిన వెట్రిమారన్ రూపొందించిన చిత్రాలలోగానీ, ఇప్పుడు వచ్చిన ఈ విడుదలలో కూడా అది స్పష్టంగా కనిపిస్తుంది. కథలోకి వస్తే.. ఈ సినిమా దాదాపు తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘సింధూరం’ తరహాలోనే ఉంటుంది.

అడవులలో ఉంటే ప్రజాదళం నాయకుడైన పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ పోలీస్ టీమ్ పనిచేస్తుంటుంది. ఆ పోలీస్ టీమ్‌కి కారు డ్రైవర్‌ కానిస్టేబుల్ కుమరేశన్ (సూరి). పోలీస్ టీమ్‌కి ఆహారం చేరవేయడమే కుమరేశన్ డ్యూటీ. అయితే కుమరేశన్ నిజాయితీ గల పోలీస్ అధికారి. పోలీస్ విధి నిమిత్తం.. ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా రక్షించాలని చూస్తుంటాడు.

ఇలాంటి నేపథ్యంలో ఓసారి అడవిలో ఓ మహిళకు అతను సాయం చేస్తాడు. అది నచ్చని పై అధికారులు.. కుమరేశన్‌ నుంచి చీప్‌గా చూస్తుంటారు. కుమరేశన్ కాపాడిన మహిళకు మనవరాలు పాప (భవానీ శ్రీ) ఉంటుంది. ఆమెతో కుమరేశన్ ప్రేమలో పడతాడు. పై అధికారుల చీత్కారం, పాపతో ప్రేమ, పెరుమాళ్‌ని పట్టుకునేందుకు జరిపే వేట.. వీటన్నింటి మధ్య కుమరేశన్ అనుభవించే సంఘర్షణ ఎలా ఉంటుందనేది చూడాలంటే.. ‘విడుదల పార్ట్ 1’ థియేటర్లలో చూడాల్సిందే.

నటీనటుల, సాంకేతిక నిపుణుల పనితీరు:

వెట్రిమారన్ సినిమాలలో కథకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. అందులో నటించే ప్రతి పాత్రకు అంతే ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఆ పాత్రకు సరిపడా నటులని ఎన్నుకోవడంలో కూడా ఆయన పెట్టే శ్రద్ధ ఇట్టే అర్థమవుతుంది. ఈ సినిమాకు కూడా పాత్రలకు సరిపడా నటీనటులను ఆయన ఎన్నుకున్నారు. కుమరేశన్ పాత్ర చాలా అమాయకంగా ఉంటుంది. అందుకే ఆ పాత్రకి సూరిని సెలక్ట్ చేసుకున్నాడు.

ఇప్పటి వరకు సూరిని అంతా కమెడియన్‌గా చూశారు. కానీ ఈ సినిమాలో తనలోని అద్భుతమైన నటుడిని వెట్రిమారన్ బయటికి తీశారు. కుమరేశన్ అనుభవించే సంఘర్షణే ఈ చిత్రానికి బలం. సూరి నుంచి అది రాబట్టడంలో వెట్రిమారన్ సక్సెస్ అయ్యాడు. కుమరేశన్ తరహాలోనే పాప పాత్ర కూడా ఉంటుంది. ఆమె కూడా ఆ పాత్రలో ఒదిగిపోయింది.

విజయ్ సేతుపతి కనిపించేది కొన్ని సన్నివేశాలలోనే అయినా.. ఆ పాత్ర కోసమే సినిమా అంతా నడవడంతో.. సినిమా అంతా అతను ఉన్నట్లే అనిపిస్తుంది. నటనాపరంగా విజయ్ సేతుపతి తన అనుభవాన్ని ప్రదర్శించారు. ఇంకా పోలీస్ అధికారులుగా చేసిన చేతన్, గౌతమ్ మీనన్ వంటి వారు వారి పాత్రల పరిధిమేర ఈ సినిమాకు పనిచేశారు.

సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే..

సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ హైలెట్ అనేలా ఉన్నాయి. 1987 నేపథ్యంలో సాగే ఈ కథని ప్రేక్షకులకు కళ్లకు కట్టినట్లు చూపించడంలో కెమెరామెన్ వందశాతం సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అడవులలో చిత్రీకరించిన సన్నివేశాలు హైలెట్ అనేలా ఉంటాయి. అలాగే అప్పటి కథకి ఎటువంటి మ్యూజిక్ ఇస్తే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారో రాజాగారికి తెలియని విషయం కాదు కదా. మేజర్ హైలెట్ అనేలా మ్యూజిక్ ఉంది. ఇక ఎడిటింగ్ పరంగా మాత్రం కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి.

మరీ ముఖ్యంగా ఫస్టాప్‌ అంతా చాలా స్లోగా నడిచింది. దర్శకుడు కథలోకి వెంటనే తీసుకెళ్లినా.. ఆ తర్వాత కాసేపు మరీ సాగదీతగా ఈ సినిమా నడిచింది. దీనిపై ఎడిటిర్ ఓ లుక్ వేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. కథకు అవసరమైన వన్నీ సినిమాకు సమకూర్చారు. ఇంకా ఇతర సాంకేతిక నిపుణులు తమ పనితనాన్ని ప్రదర్శించారు.

దర్శకుడు వెట్రిమారన్ ఈ కథని తమిళ నేటివిటీకి దగ్గరగా తీశారు. అలాఅనీ తెలుగు ప్రేక్షకులకు నచ్చదా.. అంటే, నచ్చుతుంది కానీ.. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులు ఇలాంటి కథలను చూసే ఉన్నారు. వాళ్లని మెప్పించాలంటే టేకింగ్ అద్భుతంగా ఉండాలి. అది ఈ సినిమాలో ఉంది. ఆ విషయంలో వెట్రిమారన్ పాస్ అయినట్లే.

విశ్లేషణ:

రా కంటెంట్‌తో సినిమాలు తీయడం అనేది గొప్ప విషయమే కానీ.. ఆ కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడం, ఆ తర్వాత అవార్డులు రాబట్టడం అనేది ఒక్క వెట్రిమారన్‌కే సాధ్యం. ఒక సినిమాకి ఆయన అంత కష్టపడతాడు మరి. సమాజంలో జరిగిన కథలని, సహజత్వం లోపించకుండా, అలాగే కమర్షియల్ యాంగిల్‌లో వర్కవుట్ అయ్యేలా కథని చెప్పడం అంటే సాహసమనే చెప్పుకోవాలి.

ఒక సాధారణ కానిస్టేబుల్ జీవితంలో ఉండే సంఘర్షణ, అతనిపై పై అధికారులు చూపే అధికార పైత్యం వంటి వాటితో ప్రేక్షకులను లీనమయ్యేలా చేసిన వెట్రిమారన్.. ‘కాంతార’ తరహాలో దీనికి అడవి నేపథ్యం, అన్నల నేపథ్యం ఎన్నుకోవడమనేది ఈ సినిమాకున్న ప్రధాన బలం. అలాగే దళాలు, పోలీసులు మధ్య సామాన్య జనం ఎలా నలిగిపోతున్నారనేది అపరేషన్ ఘోస్ట్ హంట్ అంటూ చక్కని ఉదాహరణతో దర్శకుడు ఇందులో చూపించాడు.

అయితే ఇది రెండు పార్ట్‌లుగా తెరకెక్కడంతో మొదటి పార్ట్‌లో అనుకున్నంతగా డ్రామా లేదు. కేవలం పాత్రల పరిచయాలు, ఆ పాత్రల తీరుతెన్నులు.. సెకండాఫ్ ఇలా ఉండబోతుంది అనేలానే ఈ పార్ట్ నడిచింది. అలా అనీ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అంశాలు లేవని చెప్పలేం. మొదటి పార్ట్ చూసిన తర్వాత, క్లైమాక్స్, ఆ తర్వాత రెండో పార్ట్‌కి సంబంధించి చూపించిన కొన్ని సన్నివేశాలు చూస్తుంటే.. ఇది సినిమాగా కాకుండా వెబ్ సిరీస్‌గా ఏమైనా తీసి ఉంటారా? అనే అనుమానం కూడా వస్తుంది.

అయితే కంటెంట్‌ థియేట్రికల్‌గా బాగా రీచ్ అవుతుందని.. మళ్లీ రెండు ముక్కలు చేసి ఇలా విడుదల చేశారా? అని అనిపిస్తుంది. అందుకే మొదటి పార్ట్‌లో అంత ఎక్కువగా మ్యాటర్ జోలికి వెళ్లలేదు. అసలు విషయం సెకండ్ పార్ట్‌లో ఉందనేలా ఓ చిన్న హింట్ కూడా ఇచ్చారు. కొన్ని సన్నివేశాలు ‘సింధూరం’ సినిమాని తలపిస్తే.. కుమరేశన్‌ని అధికారులు ఇబ్బంది పెట్టే తీరు ‘ఠాగూర్’ సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్రని తలపిస్తుంది.

ఆర్టిస్ట్‌లందరూ సహజసిద్ధంగా కనిపిస్తారు. తమిళ వాసన, తమిళ డైలాగ్స్ కొన్ని యాజీటీజ్‌గా ఉంచేశారు. డబ్బింగ్ విషయంలో అది చూసుకోవాల్సింది. మొత్తంగా అయితే రా అండ్ రస్టిక్ కంటెంట్‌తో ‘వేర్పాటు వాదులు’ ఎవరో తేల్చే.. అసలు, సిసలైన వెట్రిమారన్ చిత్రమిది. మొదటి పార్ట్ వరకు అయితే పాస్ అయినట్లే. రెండో పార్ట్‌తో వెట్రిమారన్‌ విశ్వరూపం చూపించాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ‘విడుదల’కి సరైన న్యాయం జరిగినట్లు.

ట్యాగ్‌లైన్: పార్ట్ 1 పాస్.. పార్ట్ 2లో విశ్వరూపం చూపాలి
రేటింగ్: 3/5

Exit mobile version