రైతులు స‌మృద్ధిగా పంట‌లు పండించాలంటే..

రైతులు భూమిని సాగు చేసి పంట‌లు పండించాలంటే.. భూమి దున్ని విత్తు నాటాలి.. నీళ్లు కావాలి.. స‌రైన ఎరువులు చ‌ల్లాలి.. పురుగు నివార‌ణ‌కు ర‌సాయ‌న ఎరువులు

  • Publish Date - January 31, 2024 / 01:55 PM IST

గత సర్కారులో పెట్టుబడి కరువైన అన్నదాతలు

కౌలు రైతులకూ రుణాలు ఇవ్వాలన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

వ్యవసాయేతర రంగాలకు కూడా..

2024-25 ఆర్థిక సంవత్సరంలో రైతులకు 1,34,587 కోట్ల రుణాలు

విధాత‌: రైతులు భూమిని సాగు చేసి పంట‌లు పండించాలంటే.. భూమి దున్ని విత్తు నాటాలి.. నీళ్లు కావాలి.. స‌రైన ఎరువులు చ‌ల్లాలి.. పురుగు నివార‌ణ‌కు ర‌సాయ‌న ఎరువులు పిచికారీ చేయాలి.. ఇవ‌న్నీ చేయాలంటే రైతుల‌కు డ‌బ్బులు కావాలి.. హైద‌రాబాద్‌లోనో.. మ‌రో ప‌ట్ట‌ణంలోనో పెట్టుబడి పెట్టేవారి వద్ద డ‌బ్బుల‌కు కొద‌వ లేదు.. కానీ ఈ న‌గ‌రాల ప్ర‌జ‌లు వ్య‌వ‌సాయం చేయ‌రు. కానీ కాయక‌ష్టం చేసి, గ్రామంలో పంట‌లు పండించి న‌గ‌రంలో ఉండే వారికి కావాల్సిన తిండి గింజ‌లు పంపించే రైతుకు మాత్రం ఆ డ‌బ్బే క‌రువైంది. గ్రామీణ ప్రాంతాల‌లో సాగు చేస్తున్న రైతుకు ఒక్క పంట‌కు సాగుపెట్టుబ‌డి కింద ఎక‌రాకు స‌రాస‌రి రూ. 40 వేల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుందని అంచనా. చెర‌కు, ప‌త్తి లాంటి వ్యాపార పంట‌ల‌కు ఒక ఎక‌రాకు సుమారు ల‌క్ష వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో సాగ‌వుతున్న 1.50 కోట్ల ఎక‌రాల సాగుకు రెండు పంట‌ల‌కు క‌లిపి రూ.1.50 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతున్న‌ది. ఇవికాకుండా భూమి అభివృద్ధికి, వ్య‌వసాయ యంత్ర ప‌రిక‌రాల‌కు అద‌నంగా ఖ‌ర్చు అవుతున్న‌ది. కానీ ఇలా పంట‌ల సాగుకు అయ్యే ఖ‌ర్చుల‌కు స‌కాలంలో డ‌బ్బులు దొర‌క‌క‌, బ్యాంకులు స‌రిగ్గా రుణాలు ఇవ్వ‌కపోవ‌డంతో అధిక వ‌డ్డీల‌కు ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్ర‌యించాల్సిన ప‌రిస్థితి రైతుల‌కు ఏర్ప‌డింది.

కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం

రాష్ట్రంలో కౌలురైతుల ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. కౌలు రైతుల‌కు గుర్తింపు లేదు. గ‌త బీఆరెస్ ప్ర‌భుత్వం కౌలు రైతుల‌ను గుర్తించ‌డానికి నిరాక‌రించింది. దీంతో బ్యాంకుల్లో రుణాలు తీసుకోవ‌డానికి మండ‌ల కార్యాల‌యం నుంచి ఒక్క కాగితం కూడా తెచ్చుకోలేని దుస్థితి ఏర్ప‌డింది. ఇలా రాష్ట్రంలో ఉన్న దాదాపు 25 ల‌క్ష‌ల మంది కౌలు రైతులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. వీరంతా సాగు పెట్టుబ‌డి కోసం వ‌డ్డీ వ్యాపారుల‌నే ఆశ్ర‌యించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. వీరికి ప్ర‌భుత్వం నుంచి క‌నీస స‌హాయం కూడా అంద‌ని ప‌రిస్థితి నాడు ఏర్ప‌డింది.

కౌలు రైతులకు పంట రుణాలపై ప్రభుత్వ నిర్ణయం

ఈ దుస్థితిని గ‌మ‌నించిన‌ కాంగ్రెస్ ప్ర‌భుత్వం కౌలు రైతుల‌ను గుర్తించాల‌ని నిర్ణ‌యించింది. ఈ ఏడాది కౌలు రైతుల‌కు కూడా పంట రుణాలు ఇవ్వాల‌ని కోరింది. ఈ మేర‌కు వ్య‌వ‌సాయ రుణాల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు ఇచ్చే నాబార్డ్ కౌలు రైతుల‌ను కూడా ఆర్థికంగా ఆదుకోవాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చింది. దీంతో 2024-2025 ఆర్థిక సంవత్సరంలో వ‌చ్చే వానకాలం సీజ‌న్‌లో బ్యాంకుల ద్వారా వ్య‌వ‌సాయానికి 1,34,587 కోట్ల రుణాలు రైతుల‌కు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది. ఈ మేర‌కు బ్యాంకుల‌కు స్ప‌ష్ట‌మైన ఆదేశాలు జారీ చేసింది. ఇందులో పంట రుణాలు రూ.1,09,142.93 కోట్లు, వ్య‌వ‌సాయ మౌలిక వ‌స‌తుల‌కు రూ.5,197.26 కోట్లు, వ్య‌వ‌సాయ యంత్ర ప‌రిక‌రాల‌కు రూ.19,247.67 కోట్ల రుణాలు ఇవ్వాల‌ని నిర్ణ‌యించింది.

వ్యవసాయేతర రంగాలకూ భారీగా రుణాలు

వ్య‌వ‌సాయేత‌ర రంగాల‌కు కూడా భారీగా రుణాలు ఇవ్వ‌డానికి బ్యాంకులు ముందుకు వ‌చ్చాయి. ఇందులో సూక్ష్మ‌, చిన్న‌, మ‌ధ్య‌త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌ల‌కు రూ.1,29,635.83 కోట్లు, ఎగుమ‌తుల‌కు రూ 451.67 కోట్లు, విద్య‌కు 2706.50 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.10,768.58 కోట్లు, సంప్ర‌దాయేత‌ర ఇంధ‌న రంగానికి రూ.566.61 కోట్లు, మౌలిక వ‌స‌తుల‌కు రు.1447.31 కోట్లు, స్వ‌యం స‌హాయ‌క సంఘాలకు (సెల్ఫ్ హెల్ఫ్ గ్రూపులు) రూ.836.20 కోట్లు ఇవ్వాల‌ని బ్యాంకులు నిర్ణ‌యించాయి. ఈ మేర‌కు బ్యాంక‌ర్లు రుణ ప్ర‌ణాళిక విడుద‌ల చేశారు.

రుణ ప్ర‌ణాళిక‌ను అమ‌లు చేయ‌ని బ్యాంకులు

ముగిసిపోతున్న ఈ ఏడాదిలో అనేక జిల్లాల్లో బ్యాంకులు రుణ ప్ర‌ణాళిక‌ను స‌రిగ్గా అమ‌లు చేయ‌లేదు. వికారాబాద్‌, ఆసిఫాబాద్ జిల్లాల్లో రుణ ప్ర‌ణాళిక‌లో 50 శాతం కూడా అమ‌లు చేయ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. హైదారాబాద్‌, హ‌న్మ‌కొండ‌, ఖ‌మ్మం, మ‌ల్కాజిగిరి, న‌ల్ల‌గొండ‌, సూర్యాపేట, వ‌రంగ‌ల్‌, క‌రీంగ‌న‌గ‌ర్‌, అదిలాబాద్ జిల్లాల్లో వంద శాతం అమ‌లు చేసిన బ్యాంక‌ర్లు మిగిలిన జిల్లాల్లో 50 నుంచి 8 శాతం మ‌ధ్య మాత్ర‌మే అమ‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. రుణ ప్ర‌ణాళిక‌లు బ్ర‌హ్మాండంగా రూపొందిస్తున్న బ్యాంకులు క్షేత్రస్థాయిలో స‌రిగ్గా అమ‌లు చేయ‌డం లేద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చిన నేప‌థ్యంలో రైతుల‌కు ఉదారంగా రుణాలు ఇవ్వాల‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు బ్యాంకుల‌ను కోరారు.

Latest News