ఎదురుకాల్పుల్లో వాంటెండ్ క్రిమిన‌ల్ హ‌తం

పంజాబ్‌లోని లూథియానాలో గురువారం తెల్ల‌వారుజామున పోలీసుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో వాంటెడ్ క్రిమిన‌ల్ హ‌త‌మ‌య్యాడు

  • Publish Date - December 14, 2023 / 06:59 AM IST
  • మృతుడి ముగ్గురు సహచరుల అరెస్టు
  • పంజాబ్‌లోని లూథియానాలో ఘ‌ట‌న‌



విధాత‌: పంజాబ్‌లోని లూథియానాలో గురువారం తెల్ల‌వారుజామున పోలీసుల‌తో జ‌రిగిన ఎదురు కాల్పుల్లో వాంటెడ్ క్రిమిన‌ల్ హ‌త‌మ‌య్యాడు. మృతుడి ముగ్గురు సహచరులను పోలీసులు అరెస్టు చేశారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సుఖ్‌దేవ్ సింగ్ అలియాస్ విక్కీ అనే వాంటెడ్ క్రిమిన‌ల్ త‌న‌ సహచరులతో కలిసి వరుసగా హింసాత్మక దోపిడీలకు పాల్పడి పరారీలో ఉన్నాడు.


కోహరా మచివార రహదారిపై పంజేటా పిండ్ సమీపంలో విక్కీ ఉన్న‌ట్టు పోలీసుల‌కు బుధ‌వారం రాత్రి స‌మాచారం అందింది. సీఐఏ-2 లూథియానాకు చెందిన భ‌ద్రతా బృందం ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకోగానే.. ముందే ప‌సిగ‌ట్టిన నేర‌స్తులు కాల్పులు ప్రారంభించారు. పోలీసులు జ‌రిపిన ఎదురు కాల్పుల్లో సుఖ్‌దేవ్ సింగ్ మ‌ర‌ణించాడు. గాయ‌ప‌డిన అత‌డి ఇద్ద‌రు స‌హ‌చ‌రుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సింగ్, అతని సహచరులపై 18 కేసులు ఉన్న‌ట్టు పోలీసులు తెలిపారు. మ‌రో ముగ్గురు సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


ఘటనా స్థలం నుంచి రెండు 32-బోర్ పిస్టల్స్, మందుగుండు సామాగ్రి, ఒక బొమ్మ పిస్టల్, దోపిడీలకు ఉపయోగించిన మోటార్ సైకిళ్లతో సహా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ జ‌రుపుతున్నారు.