Site icon vidhaatha

ఢిల్లీలో మా ప్రభుత్వం వస్తుంది.. ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో మినహాయింపు ఇస్తాం: మంత్రి మ‌ల్లారెడ్డి

విధాత‌: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ ఎర్రకోటపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని మంత్రి మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలంలోని తునికి బొల్లారం పునరావస కాలనీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… హస్తినలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఐటీ మినహాయింపు ఇవ్వడంతో పాటు సంపాదించిన ఆస్తిలో వాలంట్రీగా టాక్స్‌ చెల్లించే విధంగా చట్టాన్ని తీసుకు వస్తామన్నారు.

కేసీఆర్‌ అంటే మామూలు మనిషి కాదని, ఒక మహాత్ముడని అన్నారు. అంబేద్కర్‌ తర్వాత పేదల ప్రజలకు ఏమైనా చేశాడంటే అది సీఎం కేసీఆర్‌ మాత్రమే అని తెలిపారు. 2024లో ఢిల్లీలో మా ప్రభుత్వం వస్తుందని ఇన్‌కమ్‌ ట్యాక్స్‌లో మినహాయింపు ఇస్తామన్నారు. ఇట్లా రైడ్స్‌ లాంటివి ఏమీ చేయమన్నారు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్లు ఎంతైనా సంపాదించుకోవచ్చు. వాళ్లు వాలంట్రీగా టాక్స్‌ చెల్లించేలా చట్టాన్ని తెస్తామన్నారు.

దేశంలో మార్పు రావాలని, ప్రజలంతా ఆలోచన చేస్తున్నారన్నారు. మొండి వైఖరితో వ్యవహరిస్తున్న మోడీ లాంటి ప్రభుత్వం మాకు వద్దని, ఇంత అన్యాయంగా ధరలు పెంచే ప్రభుత్వం మాకు వద్దని ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. 13 నెలల పాటు రైతులు నిరసన తెలిపితే వాళ్లను కార్లు ఎక్కించి చంపిన ఘనత బీజేపీ ప్రభుత్వానిది అని ధ్వజమెత్తారు. నా జీవితంలో ఇంత ఘోరమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అందుకే సీఎం కేసీఆర్‌ పెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీకి ఆదరణ లభిస్తున్నదని చెప్పారు.

మ‌హారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక మన చుట్టూ ఉన్న రాష్ట్రాల స‌రిహ‌ద్దు ప్రాంతాల ప్ర‌జ‌లు మేము కూడా తెలంగాణలో కలిస్తే బాగుండని అనుకుంటున్నారని పేర్కొన్నారు. అక్కడ ఉంటే మాకు తాగునీరు, సాగునీరు, కరెంటు, దళితబంధు వస్తుండే అని ప్రజలు ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్‌ దేశమంతా తిరుగుతారు, 2024లో ఎర్రకోటపై బీఆర్‌ఎస్‌ జెండా ఎగురవేస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

Exit mobile version